
ఇందులో ఇద్దరు మైనర్లు11 మందిని అదుపులోకి తీసుకున్నాం
ఆరుగురిని రిమాండ్‌కు పంపాం.. మరో ఐదుగురిని విచారిస్తున్నాం
ఇద్దరు పరారీలో ఉన్నారు: నల్లగొండ డీఎస్పీ శివరాంరెడ్డి వెల్లడి
నకిరేకల్: పదోతరగతి తెలుగు ప్రశ్నపత్రం లీకేజీ కేసులో 13 మంది పాత్ర ఉందని, అందులో 11 మందిని అదుపులోకి తీసుకున్నట్టు నల్ల గొండ డీఎస్పీ శివరాంరెడ్డి చెప్పారు. మంగళవారం డీఎస్పీ వెల్లడించిన వివరాల ప్రకారం.. నల్లగొండ జిల్లా నకిరేకల్‌లోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల కేంద్రంలో ఈ నెల 21న పదోతరగతి తెలుగు పరీ క్ష ప్రారంభమైన అరగంట తర్వాత ప్రశ్నపత్రం వాట్సాప్‌లో చక్కర్లు కొడుతూ డీఈఓకు చేరింది. వెంటనే ఆయన ఎంఈవో నాగయ్యకు ఫోన్ చేయగా, నకిరేకల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
కేసు నమోదు చేసిన పోలీసులు 13 మందిని అదుపులోకి తీసుకొని విచారించారు. వీరిలో 11 మందిని స్నేహితులుగా పోలీసులు గుర్తించారు. ఆ రోజు(21న) ప్లాన్ ప్రకా రం ఏ–1 చిట్ల ఆకాశ్, ఏ–3 చిట్ల శివ, ఒక బాలుడు కలిసి గురుకుల పాఠశాల వద్దకు స్కూటీపై వెళ్లారు. గేట్ వద్ద అప్పటికే పోలీసులు ఉండటంతో లోప లకు వెళ్లడానికి వారికి వీలు కాలేదు. దీంతో ఆ ముగ్గురు వెనుక వైపునకు వెళ్లారు. అక్కడ ఏ–11 రాహుల్ ఉన్నాడు. బాలుడు పరీక్ష కేంద్రం ఒకటో అంతస్తులోని రూమ్ నంబరు 8 వద్దకు చేరుకున్నా డు.
ఆ గదిలో పరీక్ష రాస్తున్న తనకు పరిచయ మున్న విద్యార్థిని ఉండటంతో ప్రశ్నపత్రం చూపించమని సైగ చేయగా, అతని వెనకాల మరో ఇద్దరు కూడా అక్కడకు చేరుకున్నారు. అయితే రాహుల్‌తో ఉన్న పరిచయం మేరకు ఆ విద్యార్థిని వెంటనే ఆ బాలుడికి ప్రశ్నపత్రం చూపించింది. ఆ బాలుడు తన ఫోన్‌లో ప్రశ్నపత్రం ఫొటో తీసుకొని కిందకు దిగాడు. ఆ బాలుడు తీసిన ఆ ఫొటో పేపర్‌ను మిగతా నిందితులు ఒకరి నుంచి ఒకరికి పంపుకున్నారు.
ఆ పేపర్‌లో ఉన్న ప్రశ్నలకు.. ఏ–4 అయిన ప్రైవేట్ ఉపాధ్యాయుడు గుడుగుంట్ల శంకర్ సమాధానాలు తయారు చేయగా, వాటిని రవిశంకర్ జెరాక్స్ షాప్‌లో జెరాక్స్ తీసుకున్నారు. నిందితులు సమాధాన పత్రాలను వారికి తెలిసిన వారికి ఇవ్వడానికి పరీక్ష కేంద్రానికి వెళ్లగా, అక్కడ పోలీసులను చూసి దొరికి పోతామేమోనని వెళ్లిపోయారు. ఈ కేసుపై పోలీసులు 13 మంది నిందితులను అదుపులోకి తీసుకొని విచారించగా, పేపర్ లీకేజీ వ్యవహారాన్ని బయటపెట్టారని డీఎస్పీ శివరాంరెడ్డి వివరించారు.
బంధువుల పిల్లల కోసం...
నకిరేకల్‌కు చెందిన చిట్ల ఆకాశ్, చిట్ల శివ, గుడుగుంట్ల శంకర్, బి.రవిశంకర్, బండి శ్రీనుతో పాటు ఓ బాలుడిని ఈ నెల 23న రిమాండ్‌కు పంపామని డీఎస్పీ చెప్పారు. పోగుల శ్రీరాములు, తలారి అఖిల్‌కుమార్, ముత్యాల వంశీ, పల్స అనిల్‌కుమార్, పల్ల మనోహర్‌ను విచారిస్తున్నామన్నారు. రాహుల్‌తోపాటు మరోబాలుడు పరారీలో ఉన్నారని చెప్పారు. తమ బంధువుల పిల్లలు పదోతరగతిలో ఎక్కువ మార్కులు సాధించాలని కొంతమంది ఆకతాయిలు ఇదంతా చేశారన్నారు.
కూతురి పరీక్ష.. తల్లిదండ్రులే ఇన్విజిలేటర్లు
కోరుట్ల: జగిత్యాల జిల్లా కోరుట్లలోని ఒక పాఠశాలలో ఉపాధ్యాయ దంపతులు ఇన్విజిలేషన్ నిర్వహిస్తున్న కేంద్రంలోనే.. వారి కూతురు పరీక్ష రాయటం వివాదాస్పదంగా మారింది. తాము ఇన్విజిలేషన్ నిర్వహించే పరీక్ష కేంద్రాల్లో సంతానం పరీక్ష రాయటం లేదని.. ఉపాధ్యాయులు పరీక్షలకు ముందే డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది.
అలాంటి డిక్లరేషన్ ఇచ్చి కూడా.. తమ కూతురు పరీక్ష రాసే కేంద్రంలోనే ఉపాధ్యాయ దంపతులు ఇన్విజిలేషన్ చేశారు. దీనిపై ఇతర విద్యార్థుల తల్లిదండ్రులు అభ్యంతరం తెలపడంతో ఈ విషయం వెలుగు చూసింది. ఇది ఉన్నతాధికారులతోపాటు కలెక్టర్ దృష్టికి కూడా వెళ్లడంతో.. ఉపాధ్యాయ దంపతులను పిలిపించి మాట్లాడినట్లు సమాచారం.