
మిర్యాలగూడ పట్టణంలోని హౌసింగ్‌బోర్డులో ఘటన
మిర్యాలగూడ అర్బన్: అనుమానాస్పద స్థితిలో తల్లి, కుమార్తె మృతి చెందారు. ఈ ఘటన శనివారం మిర్యాలగూడ పట్టణంలోని హౌసింగ్‌బోర్డులో చోటు చేసుకుంది. మిర్యాలగూడ వన్ టౌన్ సీఐ మోతీరాం తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పల్నాడు జిల్లా మాచర్ల మండలం గన్నవరం గ్రామానికి చెందిన గుర్రం సీతారాంరెడ్డి ఓ ప్రైవేట్ ఆగ్రో కెమికల్ కంపెనీకి నల్లగొండ జిల్లా సెల్స్ మేనేజర్‌గా పనిచేస్తూ మిర్యాలగూడ పట్టణంలోని హౌజింగ్‌బోర్డులో అద్దె ఇంట్లో కుటుంబ సభ్యులతో కలిసి నివాసముంటున్నాడు. ఈ నెల 10వ తేదీన కంపెనీ పని మీద సీతారాంరెడ్డి హైదరాబాద్‌కు వెళ్లగా..
ఆయన భార్య రాజేశ్వరి(34), చిన్న కుమార్తె వేదసాయిశ్రీ(13)తో పాటు పెద్ద కుమార్తె వేదశ్రీ ఇంటి వద్దనే ఉన్నారు. హైదరాబాద్‌లో పని ముగించుకొని శనివారం తిరిగి మిర్యాలగూడకు వస్తుండగా.. సీతారాంరెడ్డి పెద్ద కుమార్తె “ఎక్కడ ఉన్నావు డాడీ’ అంటూ మెసేజ్ చేసింది. దీంతో “ఇంటికి వస్తున్నాను’ అంటూ సీతారాంరెడ్డి రిప్లై ఇచ్చాడు. అనంతరం కాల్ చేయగా లిఫ్ట్ చేయలేదు. సాయంత్రం 5గంటలకు సీతారాంరెడ్డి ఇంటికి వచ్చేసరికి పెద్ద కుమార్తె వేదశ్రీ తలుపు తీసుకొని తండ్రి వద్దకు పరుగెత్తుకు వచ్చింది.
లోపలికి వెళ్లి చూడగా చిన్న కుమార్తె వేదసాయిశ్రీ మెడపై గాయంతో రక్తపుమడుగులో పడి ఉంది. బెడ్‌రూం వైపు వెళ్లి చూడగా రూం లోపల నుంచి గడియపెట్టి ఉంది. స్థానికుల సహాయంతో తలుపులు పగులగొట్టి చూడగా చీరతో రాజేశ్వరి ఉరేసుకుని కనిపించింది. వెంటనే డయల్ 100కు ఫోన్ చేయగా.. మిర్యాలగూడ వన్ టౌన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.
హత్యా..? ఆత్మహత్యా..?
సీతారాంరెడ్డి పెద్ద కుమార్తెను పోలీసులు ప్రశ్నించగా.. తాను నిద్రపోయామని చెబుతుండడంతో తల్లి, కుమార్తెది హత్యా..? లేక ఆత్మహత్యా..? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఘటనా స్థలానికి చేరుకున్న వన్ టౌన్ సీఐ మోతీరాం, మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర్‌రాజు మృతదేహాలను పరిశీలించారు. నల్లగొండ నుంచి క్లూస్ టీంను పిలిపించి ఆధారాలను సేకరించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ.. తల్లి, కుమార్తె మృతిపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని, పూర్తి సమాచారాన్ని త్వరలో వెల్లడిస్తామని, మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్లు తెలిపారు.