
ఇద్దరు వ్యక్తులు హత్య చేసినట్లు సీసీ
కెమెరాల ద్వారా గుర్తించిన పోలీసులు
నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక టీంల ఏర్పాటు
నల్లగొండ: నల్లగొండ పట్టణంలో శుక్రవారం అర్ధరాత్రి జరిగిన మణికంఠ లేజర్ కలర్ ల్యాబ్ యజమాని గద్దపాటి సురేష్ హత్య కేసు దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. నల్లగొండ టూటౌన్ పోలీస్ స్టేషన్‌కు కూతవేటు దూరంలో రామగిరి సెంటర్‌లోని గీతాంజలి అపార్ట్‌మెంట్‌లో మణికంఠ లేజర్ కలర్ ల్యాబ్ నిర్వహిస్తున్న సురేష్ వద్దకు శుక్రవారం రాత్రి 11గంటల ప్రాంతంలో ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు మాస్కులు ధరించి వచ్చి తమకు ఫొటోలు ప్రింట్ తీసి ఇవ్వాలని కోరారు. దీంతో సురేష్ ప్రింట్ మిషన్ ఆన్ చేసి కంప్యూటర్‌పై కూర్చున్న సమయంలో నిందితులు మొదట అతడి గొంతు కోసి ఆ తర్వాత గుండెలపై విచక్షణారహితంగా పొడవడంతో సురేష్ అక్కడికక్కడే మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు.
విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పోలీసు జాగిలాలు, ఫింగర్ ప్రింట్స్ టీంలను పిలిపించి వివరాలు సేకరించారు. ఇద్దరు వ్యక్తులు హత్యకు పాల్పడినట్లుగా పోలీసులు సీసీ కెమెరాల ద్వారా గుర్తించారు. సీసీ కెమెరాల సీడీఆర్‌ను సేకరించడంతో పాటు మృతుడి కాల్ డేటా ఆధారంగా పోలీసులు విచారణ చేస్తున్నారు. హత్య అనంతరం నిందితులు ఏ దారి గుండా బయటకు వెళ్లారు. హత్యకు ముందు ఎక్కడి నుంచి వచ్చారనే కోణంలో నల్లగొండ పట్టణంలోని సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. నిందితులను పట్టుకునేందుకు ఎస్పీ శరత్‌చంద్ర పవార్ ప్రత్యేక టీంలను ఏర్పాటు చేశారు. పాత కక్షలతోనే హత్య చేశారా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఫొటో స్టూడియోలు బంద్ చేసి ర్యాలీ..
మృతుడు సురేష్ నల్లగొండతో పాటు నకిరేకల్, చిట్యాల, మిర్యాలగూడ తదితర ప్రాంతాల్లో ఫొటో కలర్ ల్యాబ్‌లు నిర్వహిస్తున్నట్లు తెలిసింది. సురేష్ హత్యకు గురికావడంతో నల్లగొండలో శనివారం ఫొటో, వీడియో గ్రాఫర్లు, కలర్ ల్యాబ్ యజమానులు ఫొటో స్టూడియోలు బంద్ చేసి నల్లబ్యాడీ్జలు ధరించి ర్యాలీ నిర్వహించారు. సురేష్ చిత్రపటానికి నివాళులరి్పంచారు. నిందితులను అరెస్ట్ చేసి సురేష్ కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు.
నకిరేకల్‌లో అంత్యక్రియలు
నకిరేకల్: సురేష్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం శుక్రవారం రాత్రే ఘటనా స్థలం నుంచి నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. శనివారం మధ్యాహ్నం పోస్టుమార్టం నిర్వహించిన తర్వాత సురేష్ సొంతూరు నకిరేకల్‌కు అతడి మృతదేహాన్ని కుటుంబ సభ్యులు తీసుకొచ్చి అంత్యక్రియలు నిర్వహించారు. నల్లగొండ ఆస్పత్రి మార్చురీ వద్ద సురేష్ కుటుంబ సభ్యులను నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం పరామర్శించారు.
సురేష్ సొంతూరు కట్టంగూర్ మండలం పందెనపల్లి కాగా.. కొన్నేళ్ల క్రితమే కుటుంబం అంతా నకిరేకల్‌లోని చీమలగడ్డ ఫ్లైఓవర్ సమీపంలో స్థిర నివాసం ఏర్పరుచుకుని గూనల వ్యాపారం చేసుకుంటున్నారు. సురేష్ తల్లి, భార్య నాగమణి కలిసి గూనల వ్యాపారం నిర్వహిస్తుండగా.. సురేష్ ఏడేళ్ల క్రితమే నల్లగొండలో ఫొటో కలర్ ల్యాబ్ పెట్టుకుని ప్రతిరోజు నకిరేకల్ నుంచి వెళ్లి వస్తున్నాడు. సురేష్‌కు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. సురేష్ తండ్రి 30ఏళ్ల క్రితమే చనిపోగా.. తల్లి రెండు నెలల క్రితమే మృతిచెందింది. సురేష్ మృతదేహానికి నివాళులర్పించిన వారిలో టీపీసీసీ నేత దైద రవీందర్ తదితరులు ఉన్నారు.