
మత సామరస్యానికి నల్లగొండ ప్రతీక
రామగిరి(నల్లగొండ): నల్లగొండ జిల్లా మత సామరస్యానికి ప్రతీక అని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. రంజాన్ పండుగ సందర్భంగా ఆయన సోమవారం నల్లగొండ జిల్లా కేంద్రం సమీపంలోని ఈద్గా వద్ద ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నల్లగొండ జిల్లాలో హిందూ, ముస్లిం, క్రైస్తవులు అంతా కలిసిమెలిసి ఉండాలన్నారు. పట్టణంలోని దర్గాలు, ఈద్గాల అభివృద్ధికి తాను ఎంతో కృషి చేస్తున్నానని తెలిపారు. ఇటీవల నల్లగొండ పట్టణంలో నిర్వహించిన ఇస్తేమాలో సుమారు 40 నుంచి 50 వేల మంది పాల్గొన్నా ఎలాంటి సమస్య లేకుండా సౌకర్యాలు కల్పించామన్నారు. లతీఫ్ సాబ్ దర్గాకు రూ.100 కోట్లతో ఘాట్ రోడ్ నిర్మిస్తున్నామని చెప్పారు. లతీఫ్ షాప్ గుట్ట నుంచి బ్రహ్మంగారి గుట్ట వరకు రోప్ వే, బ్రహ్మంగారి గుట్టకు కూడా వేరే ఘాట్ రోడ్ వేయిస్తున్నామని తెలిపారు. రూ.500 కోట్లతో నల్లగొండకు కొత్త బైపాస్ రోడ్డు నిర్మిస్తున్నామని.. వారం రోజుల్లో పనులు మొదలవుతాయన్నారు. ఎంజీయూ, మెడికల్ కళాశాల, కలెక్టరేట్ తదితర ప్రభుత్వ సంస్థల్లో అవుట్‌సోర్సింగ్, కాంటాక్ట్ పద్ధతిపై చేపట్టే నియామకాల్లో ముస్లింలకు 10 శాతం రిజర్వేషన్ కల్పించేలా కలెక్టర్‌ను ఆదేశించామన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మతం మీద ధ్వేషంతో వక్ఫ్ బోర్డు చట్టాన్ని సవరించాలని చూస్తోందని విమర్శించారు. అనంతరం ముస్లిం మత పెద్ద మౌలానా ఎహసనొద్దీన్‌ను మంత్రి మర్యాదపూర్వకంగా కలిశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, ఎస్పీ శరత్‌చంద్రపవార్, ఆర్డీఓ అశోక్‌రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ బుర్రి శ్రీనివాస్‌రెడ్డి, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్‌గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు గుమ్ముల మోహన్‌రెడ్డి, ఈద్గా కమిటీ చైర్మన్ డాక్టర్ హఫీజ్ ఖాన్ తదితరులు ఉన్నారు.
ఫ వక్ఫ్ బోర్డ్డు చట్టాలను మార్చాలని చూస్తున్న కేంద్రం
ఫ రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి