
బైక్ అదుపుతప్పి యువకుడు మృతి
ఆలేరురూరల్: బైక్‌పై వెళ్తు న్న యువకుడు అదుపుతప్పి కిందపడి మృతిచెందాడు. ఈ ఘటన ఆలేరు పట్టణంలో శనివారం జరిగింది. పోలీసులు తెలి పిన వివరాల ప్రకారం.. ఆలేరు మండలం మందనపల్లికి చెందిన పంగ మల్లేష్ పెయింటింగ్ పనిచేస్తూ తల్లిదండ్రులతో కలిసి జీవనం సాగిస్తున్నాడు. శుక్రవారం సాయంత్రం పని ముగించుకొని ఆలేరు నుంచి స్వగ్రామానికి బైక్‌పై వెళ్తున్నాడు. మార్గమధ్యలో ఆలేరు ప్రభుత్వ ఆస్పత్రికి వద్ద ఎదురుగా వస్తున్న వృద్ధుడిని తప్పించబోయి బైక్ అదుపుతప్పి కిందపడిపోయాడు. ఈ ప్రమాదంలో మల్లేష్ తలకు తీవ్ర గాయాలయ్యాయి. అతడికి ఆలేరు ప్రభుత్వాస్పత్రిలో ప్రథమ చికిత్స చేయించి మెరుగైన వైద్యం కోసం జనగామ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతిచెందాడు. మృతుడు అవివాహితుడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రజినీకర్ తెలిపారు.
అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి
పాలకవీడు: అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన పాలకవీడు మండలం శూన్యపహాడ్ గ్రామ సమీపంలో శనివారం జరిగింది. మృతుడి కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నేరేడుచర్ల మండలం చిల్లేపల్లికి చెందిన వట్టె నాగరాజు(37) శుక్రవారం గరిడేపల్లి మండలం కల్మల్‌చెరువు లో తమ బంధువు అంత్యక్రియలకు వెళ్లాడు. రాత్రయినా ఇంటికి రాకపోవడంతో నాగరాజుకు అతడి తమ్ముడు గంగరాజు ఫోన్ చేయగా.. తాను మరో వ్యక్తితో కలిసి దాచేపల్లికి వెళ్తున్నట్లు నాగరాజు చెప్పాడు. శనివారం ఉదయం వరకు నాగరాజు ఇంటికి రాకపోవడం, ఫోన్ చేస్తే స్విచ్చాఫ్ రావడంతో గంగరాజు దామరచర్ల నుంచి శూన్యపహాడ్ వెళ్లే దారిలో అన్నను వెతుక్కుంటూ వెళ్లాడు. శూన్యపహాడ్ సమీపంలో ఓ వ్యక్తి అపస్మారక స్థితిలో ఉన్నట్లు స్థానికులు తెలుపగా.. గంగరాజు అక్కడికి వెళ్లి చూడగా నాగరాజు మృతిచెంది కనిపించాడు. నాగరాజు మృతిపై గంగరాజు అనుమానం వ్యక్తం చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చే సి మృతదేహాన్ని హుజూర్‌నగర్ ఏరియా ఆస్పత్రికి తరలించినట్లు ఎస్‌ఐ లక్ష్మీనర్సయ్య తెలిపారు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.