
వస్తోంది.. టీబీఎం బేరింగ్!
ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ పనులు త్వరలో పునఃప్రారంభం
ఇన్‌లెట్‌లో డ్రిల్లింగ్, బ్లాస్టింగ్ అనుమతులకు ప్రతిపాదనలు
షియర్‌జోన్ కారణంగా ఇన్‌లెట్ 14వ కిలోమీటరు వద్ద సొరంగం కుప్పకూలిపోవడంతో ప్రభుత్వం ప్రత్యామ్నాయ ప్రతిపాదనలు చేసింది. ప్రస్తుతం ఇన్‌లెట్‌లోని టీబీఎం పూర్తిగా ధ్వంసమైంది. పైగా అక్కడి ప్రమాదకర పరిస్థితుల నేపథ్యంలో కూలిన ప్రాంతానికి కంటే ముందు నుంచి యాభై మీటర్ల పక్కకు వెళ్లి అక్కడి నుంచి సమాంతరంగా డ్రిల్లింగ్, బ్లాస్టింగ్ పద్ధతిలో టన్నెల్‌ను తవ్వాలన్న నిర్ణయానికి వచ్చింది. ప్రతిపాదనలను రూపొందించి కేంద్ర అటవీ పర్యావరణ శాఖ అనుమతి కోసం పంపించింది. ఆ అనుమతులు వస్తే ఇన్‌లెట్ నుంచి కూడా పనులను చేపట్టే అవకాశం ఉంది.
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 4.15 లక్షల ఎకరాలకు సాగునీరు, 516 ఫ్లోరోసిస్ పీడిత గ్రామాలకు రక్షిత తాగునీటిని అందించే లక్ష్యంతో చేపట్టిన ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ఔట్‌లెట్‌లో తవ్వకం పనులు తిరిగి ప్రారంభం కానున్నాయి. మన్నెవారిపల్లిలోని ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ఔట్‌లెట్‌లోని టన్నెల్ బోరింగ్ మిషన్ (టీబీఎం) బేరింగ్ పాడైపోవడంతో 2023 జనవరిలో తవ్వకం పనులు ఆగిపోయాయి. అమెరికాలోని రాబిన్స్ కంపెనీకి ఆర్డర్ ఇచ్చి తయారు చేయించిన బేరింగ్, ఇతర పరికరాలను జనవరి నెలలో రాబిన్స్ కంపెనీ అమెరికా నుంచి ప్రత్యేక నౌకలో చైన్నె పోర్టుకు పంపించింది. అది 20 రోజుల కిందట చైన్నెపోర్టుకు చేరుకుంది. నౌక నుంచి దానిని బయటికి తీసుకొచ్చి, పరిశీలించేందుకు 20 రోజుల సమయం పట్టింది. రెండురోజుల కిందట ఆ బేరింగ్ ప్రత్యేకమైన భారీ వాహనంలో చైన్నె పోర్టు నుంచి బయలుదేరింది.
రాత్రి వేళల్లోనే ప్రయాణించనున్న వాహనం
బేరింగ్ మరో 20–25 రోజుల్లో టన్నెల్ ఔట్‌లెట్ ప్రారంభం ప్రాంతమైన మన్నెవారిపల్లికి చేరుకోనుంది. రోడ్డు మార్గంలోనే బేరింగ్‌ను ప్రత్యేక వాహనంలో తీసుకొస్తున్నారు. అయితే ప్రధాన రోడ్డుపై రద్దీ ఉండే సమయంలో కాకుండా కేవలం రాత్రి వేళలోనే వాహనం ప్రయాణిస్తుందని అధికారులు చెబుతున్నారు. అందుకే ఇక్కడికి రావడానికి ఎక్కువ సమయం పడుతుందని పేర్కొంటున్నారు. దానిని నేరుగా మన్నెవారిపల్లికి తీసుకొచ్చిన తరువాత అన్‌లోడ్ చేయడం, సొరంగంలోకి తీసుకెళ్లడం, టీబీఎంకు బిగించడం వంటి కీలకమైన పనులను చేపట్టాల్సి ఉంటుంది. అందుకు రెండు నెలల సమయం పడుతుందని అధికారులు భావిస్తున్నారు. ఆ పనులు పూర్తయ్యాక తవ్వకం పనులను ప్రారంభించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.
ఔట్‌లెట్‌లో తవ్వాల్సింది.. 3.545 కిలోమీటర్లు
నాగర్‌కర్నూల్ జిల్లాలోని శ్రీశైలం రిజర్వాయర్ సమీపంలోని దోమలపెంట నుంచి మన్నెవారిపల్లి వరకు 43.930 కిలోమీటర్ల పొడవునా సొరంగాన్ని 10 మీటర్ల డయాతో (వెడెల్పు) తవ్వేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. శ్రీశైలం వద్ద నీటిని తీసుకునే ఇన్‌లెట్ నుంచి, మన్నెవారిపల్లి ఔట్ లెట్ నుంచి రెండు వైపులా సొరంగం తవ్వకం పనులను చేపట్టింది. రెండువైపులా కలిపి 34.37 కిలోమీటర్లు టన్నెల్ తవ్వకం పూర్తికాగా, ఇంకా 9.56 కిలోమీటర్లు తవ్వాల్సి ఉంది. అందులో ఔట్‌లెట్ నుంచి ఇప్పటివరకు 20.435 కిలోమీటర్ల సొరంగం తవ్వకం పనులు పూర్తి కాగా, మరో 3.545 కిలోమీటర్లు తవ్వాల్సి ఉంది. అయితే అక్కడ రాయి గట్టిదనం ఎక్కువగా ఉన్నందున తరచూ బేరింగ్, ఇతర పరికరాలు పాడైపోతున్నాయి. ఇప్పటికి మూడుసార్లు బేరింగ్ పాడైపోయింది. దీంతో 2023 జనవరిలో పనులు పూర్తిగా ఆగిపోయాయి. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బేరింగ్ తెప్పించి పనులను ప్రారంభించేందుకు చర్యలు చేపట్టింది.
అదనంగా తవ్వే ఆలోచనల్లో ప్రభుత్వం
చైన్నె పోర్టు నుంచి బేరింగ్ వస్తుండటంతో మరికొద్ది నెలల్లో పనులను ప్రారంభించే అవకాశం ఉంది. ముందస్తు ప్రణాళిక ప్రకారం ఔట్‌లెట్‌లో తవ్వాల్సింది 3.545 కిలోమీటర్లే అయినా ఇంకా ఎక్కువ దూరం తవ్వే ఆలోచనలను ప్రభుత్వం చేస్తున్నట్లు తెలిసింది. మొత్తం టన్నెల్‌లో 34.37 కిలోమీటర్లు పూర్తయింది. అందులో ఇన్‌లెట్‌లోనూ 13.935 కిలోమీటర్ల తవ్వకం పూర్తయింది. రెండింటికి మధ్యలో మిగిలిన 9.56 కిలోమీటర్లలో ఇన్‌లెట్‌లో 6.015 కిలోమీటర్లు తవ్వాల్సి ఉంది. 2019లో వరదల కారణంగా భారీగా సీపేజీ రావడం మొదలైంది. దాంతో అప్పటి నుంచి అక్కడ పనులు ఆగిపోయాయి. అయితే ఫిబ్రవరి 21వ తేదీన తవ్వకం పనులను తిరిగి ప్రారంభించారు. 150 మీటర్లు తవ్వగానే 22వ తేదీన ఉదయం 8 గంటల సమయంలో ఒక్కసారిగా పెద్ద ఎత్తున బురదతో కూడిననీరు రావడంతో టన్నెల్ కుప్పకూలిపోయింది. 200 మీటర్ల మేర మట్టితో నిండిపోయింది. 8 మంది ఉద్యోగులు, కార్మికులు అందులోనే కూరుకుపోయారు. ఇప్పటివరకు ఇద్దరి మృతదేహాలను మాత్రమే బయటకు తీయగలిగారు. ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఔట్‌లెట్ నుంచి ఇంకా ఎక్కువ దూరం సొరంగం తవ్వేలా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. దీనికి సంబంధించిన కార్యాచరణను కూడా సిద్ధం చేసినట్లు తెలిసింది.
ఫ చైన్నె పోర్ట్ నుంచి భారీ వాహనంలో రప్పిస్తున్న అధికారులు
ఫ 25 రోజుల్లో మన్నెంవారిపల్లికి చేరనున్న బేరింగ్
ఫ మూడు నెలల్లోగా ప్రారంభం కానున్న పనులు
ఫ దోమలపెంట ఇన్‌లెట్‌లో కొనసాగుతున్న సహాయక చర్యలు
ఫ ఇన్‌లెట్‌లో ప్రత్యామ్యాయ తవ్వకం దిశగా కసరత్తు

వస్తోంది.. టీబీఎం బేరింగ్!