
టీపీసీసీ పరిశీలకుల నియామకం
నల్లగొండ : తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలకు పరిశీలకులను నియమించింది. ఇందులో భాగంగా నల్లగొండ జిల్లాకు మక్తల్ ఎమ్మెల్యే వి.శ్రీహరి ముదిరాజ్, నజీర్ అహ్మద్‌ను పరిశీలకులుగా నియమిస్తూ టీపీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. వీరు జిల్లాలో ప్రస్తుతం ఉన్న డీసీసీ అధ్యక్షులను కొనసాగించాలా.. లేక కొత్తవారిని నియమించాలా అనే దానిపై పార్టీ శ్రేణుల అభిప్రాయాలు సేకరించి అధిష్టానానికి నివేదిక సమర్పించనున్నారు. వీరిచ్చే నివేదికల ఆధారంగా స్థానిక సంస్థలు, నామినేటెడ్ పదవులను ఆశించే వారికి ప్రాధాన్యం ఇవ్వనున్నట్టు తెలుస్తోంది.
రేపటి నుంచి వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు
నల్లగొండ టూటౌన్: జిల్లా యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో నల్లగొండ, మిర్యాలగూడ పట్టణాల్లో శుక్రవారం నుంచి వేసవి ప్రత్యేక క్రీడా శిక్షణ శిబిరాలను ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా యుజవన, క్రీడల శాఖ అధికారి కుంభం నర్సిరెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. నల్లగొండలోని ఇండోర్ స్టేడియంలో షటిల్ బ్యాడ్మింటన్, ఔట్‌డోర్ స్టేడియంలో బాక్సింగ్ క్యాంపులు ఉంటాయని పేర్కొన్నారు. మిర్యాలగూడలోని ఇండోర్ స్టేడియంలో షటిల్ బ్యాడ్మింటన్, ఔట్‌డోర్ స్టేడియంలో బాక్సింగ్ శిబిరాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. 8 నుంచి 19 సంవత్సరాల వయసు గల చిన్నారులు శిక్షణ శిబిరాల్లో పాల్గొనాలని, పూర్తి వివరాలకు 9440072854 నంబర్‌లో సంప్రదించాలని కోరారు.
పీహెచ్‌సీల్లో మందులు అందుబాటులో ఉంచాలి
వేములపల్లి: పీహెచ్‌సీలకు వచ్చే రోగులకు అవసరమైన మందులు అందుబాటులో ఉంచాలని రాష్ట్ర క్షయవ్యాధి (టీబీ) నిర్మూలన విభాగం జాయింట్ డైరెక్టర్ డాక్టర్ రాజేశం అన్నారు. బుధవారం వేములపల్లిలోని పీహెచ్‌సీని డీఎంహెచ్‌ఓ పుట్ల శ్రీనివాస్‌తో కలిసి ఆయన సందర్శించి రికార్డులను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో టీబీ అనుమానిత వ్యక్తులను పరీక్షించి తెమడ నమూనాలను పీహెచ్‌సీలకు, ప్రాంతీయ ఆరోగ్య కేంద్రాలకు పంపించి పరీక్షలను నిర్వహించాలన్నారు. చిన్నారులకు అవసరమైన వ్యాక్సిన్లతోపాటు పాముకాటు, తేలుకాటు వంటి ఇంజిక్షన్లను అందుబాటులో ఉంచుకోవాలన్నారు. వారి వెంట డిప్యూటీ డీఎంహెచ్‌ఓ కేస రవి, జిల్లా ఫార్మసీ సూపర్‌వైజర్ వీరారెడ్డి, పీహెచ్‌సీ వైద్యులు సుచరిత తదితరులు ఉన్నారు.
పారదర్శకంగా ‘ఇందిరమ్మ’ లబ్ధిదారుల ఎంపిక
చిట్యాల: గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల పథకానికి లబ్ధిదారులను పారదర్శకంగా ఎంపిక చేస్తామని జెడ్పీ సీఈఓ ప్రేమ్‌కరణ్‌రెడ్డి పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికపై బుధవారం ఆయన చిట్యాలలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడీఓ జయలక్ష్మితో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడారు. లబ్ధిదారుల ఎంపికలో ఎలాంటి అవకతవకలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. అంతకుముందు పెద్దకాపర్తి గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని తనిఖీ చేశారు.
చేనేత వృత్తిదారులను ఆదుకోవాలి
నల్లగొండ టౌన్: చేనేత పరిశ్రమ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న నేపథ్యంలో చేనేత వృత్తిదారులను ప్రభుత్వం ఆదుకోవాలని చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంజి మురళీధర్ ప్రభుత్వాన్ని కోరారు. బుధవారం నల్లగొండలోని సుందరయ్య భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ముడి సరుకులు రంగులు, రసాయనాలు, నూలు, పట్టు ధరలు పెరగడంతో చేనేత కార్మికుడికి ఉపాధి కరువైందన్నారు. ఈ సమావేశంలో ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు కందగట్ల గణేష్, ఉపాధ్యక్షుడు కర్నాటి శ్రీరంగం, సహాయ కార్యదర్శి వనం రాములు, వాలుగొండ మధు, ఏలె శ్రీనివాస్, గడ్డం దశరథ, దయానంద్, ఏలె వెంకటేశం, రావిరాల వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.

టీపీసీసీ పరిశీలకుల నియామకం