
చిన్నారులకు క్యాంపు.. టీచర్లకు శిక్షణ
నల్లగొండ: విద్యార్థులు వేసవి సెలవులను సద్వినియోగం చేసుకునేలా జిల్లా స్థాయిలో సమ్మర్ క్యాంపు ఏర్పాటు చేయాలని విద్యా శాఖ ప్రత్యేక ప్రణాళికా సిద్ధం చేసింది. ఇందులో భాగంగా జిల్లా కేంద్రంలో 200 మంది విద్యార్థులకు అవకాశం కల్పించి వివిధ అంశాలు, క్రీడల్లో తర్ఫీదు ఇచ్చేందుకు ప్రత్యేక శిబిరం ఏర్పాటుకు పూనుకుంది. 40 రోజుల పాటు సమ్మర్ క్యాంపు నిర్వహించేందుకు సిద్ధమైంది. ఈ క్యాంపులో ఇండోర్ గేమ్స్ అయిన చెస్, క్యారమ్స్‌తో పాటు డ్యాన్స్, ఆర్ట్ అండ్ క్రాప్టు, కెరీర్ గైడెన్స్, మోరల్ వ్యాల్యూస్, స్టోరీ టెల్లింగ్ అంశాలను నేర్పిస్తారు. 6 నుంచి 9వ తరగతి వరకు పిల్లలను మాత్రమే ఎంపిక చేస్తారు. ఈ నెల 25 నుంచి జూన్ 5వ తేదీ వరకు నల్లగొండ జిల్లా కేంద్రంలోని బోయవాడ అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలలో సమ్మర్ క్యాంపు నిర్వహించనున్నారు. ఉదయం రాగిజావ, మధ్యాహ్న భోజనంతోపాటు సాయంత్రం స్నాక్స్ కూడా విద్యార్థులకు అందించనున్నారు.
ఉపాధ్యాయులకూ శిక్షణ
అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యనందించేందుకు విద్యాబోధనలో మెళకువలు నేర్పించేందుకు గాను ఈ వేసవి సెలవుల్లోనే ఉపాధ్యాయులకు వృత్యంతర శిక్షణ ఇచ్చేందుకు విద్యా శాఖ కార్యాచరణ రూపొందించింది. ప్రాథమిక పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు (తెలుగు, ఆంగ్ల మాద్యమాల్లో తెలుగు 2, పరిసరాల విజ్ఞానం 2, ఇంగ్లిష్ 2, మ్యాథ్స్ 2) శిక్షణ ఇచ్చేందుకు ఎనిమిది మంది ఎమ్మార్పీలతోపాటు స్పెషల్ ఎడ్యుకేషన్‌కు మరో ఇద్దర్ని తీసుకుంటారు. అలాగే ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయుల శిక్షణకు ప్రభుత్వ, లోకల్ బాడీ, మోడల్ స్కూళ్లలో పనిచేస్తున్న స్కూల్ అసిస్టెంట్, పీజీటీ, టీజీటీ, పీడీ, జీహెచ్‌ఎం, ప్రిన్సిపాల్స్ నుంచి 36 మందిని డీఆర్‌పీలుగా తీసుకోనున్నారు. ఉర్దూ అధ్యాపకుల శిక్షణకు 10 మందిని తీసుకోనున్నారు. ఉన్నత పాఠశాలల హెచ్‌ఎంల శిక్షణకు నలుగురిని, ఎల్‌ఎఫ్‌ఎల్ హెచ్‌ఎంల శిక్షణకు మరో నలుగురిని ఎంపిక చేస్తారు. అర్హత, ఆసక్తి గల వారు గురువారంలోగా జిల్లా విద్యా శాఖ కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలి. రిసోర్స్ పర్సన్లుగా పనిచేయాలనుకునే వారి కోసం జిల్లా విద్యా శాఖ వెబ్‌సైట్ doenalgonda.bolgspot.comలో దరఖాస్తు ఫారమ్ అందుబాటులో ఉంచారు. ఎంపికై న వారి వివరాలు 28న ప్రకటిస్తారు. అయితే జిల్లా కలెక్టర్ చైర్మన్‌గా, డీఈఓ కన్వీనర్‌గా, డైట్ ప్రిన్సిపాల్ సమగ్ర శిక్ష క్వాలిటీ కోఆర్డినేటర్ సభ్యులుగా ఉండి డీఆర్‌పీ, ఎమ్మార్పీలను ఎంపిక చేస్తారు. అనంతరం నల్లగొండ డైట్‌లో విడతల వారీగా టీచర్లకు శిక్షణ ఇస్తారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లలో విద్యా శాఖ అధికారులు నిమగ్నమయ్యారు.
ఫ వేసవి సెలవులు సద్వినియోగమయ్యేలా విద్యా శాఖ ప్రణాళిక
ఫ విద్యార్థులకు వివిధ అంశాల్లో తర్ఫీదు
ఫ టీచర్లకు వృత్యంతర శిక్షణ
ఫ ఏర్పాట్లలో నిమగ్నమైన యంత్రాంగం
అన్ని కేటగిరీల టీచర్లకు శిక్షణ
వేసవి సెలవుల్లో ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చేందుకు డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు ప్రణాళిక రూపొందించారు. వేసవి సెలవుల్లో అన్ని కేటగిరీల ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తాం. విద్యార్థులకు కూడా సమ్మర్ క్యాంపు నిర్వహిస్తున్నాం. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం.
– భిక్షపతి, డీఈఓ, నల్లగొండ

చిన్నారులకు క్యాంపు.. టీచర్లకు శిక్షణ