
వరంగల్ సభకు లక్ష మంది
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: ‘వరంగల్‌లో ఈనెల 27వ తేదీన జరిగే బీఆర్‌ఎస్ పార్టీ రజతోత్సవ బహిరంగ సభకు ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి లక్షమందిని తరలించేందుకు సిద్ధమవుతున్నాం. అందులో భాగంగా వరంగల్‌కు సమీప నియోజకవర్గాలైన ఆలేరు, భువనగిరి, సూర్యాపేట, తుంగతుర్తి నుంచి 12,500 చొప్పున 50వేల మందిని తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి’ అని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి తెలిపారు. బీఆర్‌ఎస్ రజతోత్సవ సభ జనసమీకరణ వివరాలను ‘సాక్షి’ ఇంటర్వ్యూలో ఆయన వెల్లడించారు.
కాంగ్రెస్ నేతల్లో గగుర్పాటు
బీఆర్‌ఎస్ రజతోత్సవ సభ కాంగ్రెస్ నేతల్లో గగుర్పాటు కలిగిస్తోంది. ఇది బీఆర్‌ఎస్ సభనా, లేక టీఆర్‌ఎస్ సభనా అంటూ కాంగ్రెస్ నాయకులు ఆగమాగం అయితుండ్రు. సభకు కేసీఆర్ వస్తుండే. ఆల్‌రెడీ బీఆర్‌ఎస్ పేర ఎన్నికల్లో పోటీనే చేసినం. మీకెందుకు అనుమానం. ఉమ్మడి జిల్లా నుంచి బీఆర్‌ఎస్ రజతోత్సవ సభకు ప్రజలతోపాటు రైతులు లక్ష మంది తరలిరానున్నారు.
ఎడ్లబండ్ల యాత్ర మొదలైంది
ఎడ్లబండ్లు, సైకిల్, పాద యాత్రలకు పార్టీ కార్యకర్తలు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే సూర్యాపేట జిల్లా ఆత్మకూర్(ఎస్) మండలం నుంచి ఎడ్లబండ్ల ర్యాలీ ప్రారంభమైంది. నెమ్మికల్ దండు మైసమ్మ ఆలయం వద్ద పూజలు చేసి రైతులు ర్యాలీని ప్రారంభించారు. బండి వెనుక బండి కట్టి 16 బండ్లు కట్టి అనే పాటను గుర్తుగా 16 బండ్లతో వరంగల్ సభకు ర్యాలీగా వెళ్లారు. అర్వపల్లి నుంచి సైకిళ్ల మీద యాత్రగా వెళతామని యువత ముందుకు వస్తే రెండు రోజులు ఆగాలని చెప్పాను. పాదయాత్రకు కూడా సిద్ధమవుతున్నారు. ఎండల తీవ్రతతో ఆగాలని సూచించాం. జనాల్లో అలాంటి వాతావరణం వస్తే సభ విజయవంతమవుద్దనేది కచ్చితమైంది. మేము పేరుకే రజతోత్సవ సభ నిర్వహిస్తున్నాం. ప్రజల ఆలోచన వేరే ఉంది. వారే పెద్ద ఎత్తున బయల్దేరి సభకు రావాలని చూస్తున్నారు. వరంగల్ సభ పండుగ వాతావరణంలో జరగబోతుంది. ప్రభుత్వం మీద వ్యతిరేకతతో అప్పుడే సభకు ఏ విధంగా నైనా హాజరు కావాలని చూస్తున్నారు. కేసీఆర్ ఉంటే మంచి జరుగుతుందనే భావన జనాల్లో ఉంది.
చరిత్రలో నిలిచిపోనుంది
రజతోత్సవ సభ చరిత్రలో నిలిచిపోనుంది. ఇప్పటికే కాంగ్రెస్‌లో అలజడి మొదలైంది. సభపై పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారు. సభ తర్వాత ప్రజల్లో కాంగ్రెస్‌పై మరింత వ్యతిరేకత పెరుగుతుందన్న భయాందోళన ప్రభుత్వంలో ఉంది. అందుకే సభపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. ప్రజలు స్వచ్ఛందంగా సభకు హాజరయ్యేందుకు సిద్ధమవుతున్నారు.
‘సాక్షి’ ఇంటర్వ్యూలో మాజీ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి
ఫ బీఆర్‌ఎస్ పార్టీ రజతోత్సవానికి ఉమ్మడి జిల్లా నుంచి భారీగా జనసమీకరణ
ఫ నాలుగు నియోజకవర్గాల నుంచే సగం మంది
ఫ మిగతా చోట్ల నుంచి పెద్ద సంఖ్యలో తరలిస్తాం
ఫ కేసీఆర్ చెప్పేది వినేందుకు ప్రజలు, రైతులు స్వచ్ఛందంగా వస్తామంటుండ్రు
ఫ కాంగ్రెస్‌కు ఓటేసినోళ్లే కసిగా సభకు రావడానికి సిద్ధమవుతుండ్రు
ఫ ఎక్కడ చూసినా సభపైనే చర్చ
ఫ సభ పేరు వింటేనే అధికార పక్షం జంకుతుంది
ఏ నోట విన్నా సభపైనే చర్చ
ఏ పెళ్లిలో, ఏ చావుకెళ్లినా బీఆర్‌ఎస్ సభ గురించి చర్చ సాగుతోంది. ఎన్నికల ముందు మమ్ముల చూసి పక్కకు పోయినోళ్లు కూడా ఇయ్యాల మా దగ్గరకు వస్తుండ్రు. సభకు రావాలని చూస్తుండ్రు. కాంగ్రెస్‌కు ఓటేసిన నేతలే కసిగా వరంగల్ సభకు వచ్చేందుకు సిద్ధమవుతుండ్రు. జనాలకు కేసీఆర్ అంటే చాలా ప్రేమ ఉంది. కానీ కాంగ్రెస్ నేతలు చెప్పిన మాయమాటలతో ఇంకా ఏమైనా రుణమాఫీ, రూ.2,500 వస్తుందనే ఆశతో కాంగ్రెస్‌కు ఓటేసిండ్రు. ప్రధానంగా ఎన్నికల్లో కాంగ్రెసోళ్లు చెప్పిన మాయ మాటలకు నిరుద్యోగులు ఎట్రాక్టు అయినరు. ఇప్పటి యువతకు తెలంగాణ ఉద్యమం గురించి తెలియదు. ఎన్నికల్లో కేసీఆర్ ఇంటికో ఉద్యోగం ఇస్తానని హామీ ఇచ్చి ఇవ్వలేదంటూ కాంగ్రెస్ నేతలు దుష్ప్రచారం చేశారు. దాంతో నిరుద్యోగులు ఎట్రాక్టు అయ్యిండ్రు. తల్లిదండ్రులకు కూడా యువతే చెప్పుకుంది. రుణమాఫీ ఇస్తే సరిపోతుందా..ఉద్యోగాలు కూడా రావాలనడంతో వారు ఆలోచనలో పడి ఓటేశారు. అలాంటి నిరుద్యోగులు కూడా ఇప్పుడు కేసీఆర్ వెంటే నడిచేందుకు సిద్ధమవుతున్నారు.కాంగ్రెస్ మోసాలు సంవత్సరంలో తెలుసుకున్నరు. ఒక్క నోటిఫికేషన్ వేయలేదు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఇచ్చిన వాటినే భర్తీ చేసిందని దాంతో నిరుద్యోగులు అసలు విషయం తెలుసుకున్నారు.వరంగల్ సభకు వాళ్లే ముందు నడవబోతున్నారు. కేసీఆర్‌కు ఓటేయక పొరపాటు జరిగిన విషయాన్ని గమనించి సభకు రావాలని చూస్తున్నారు.

వరంగల్ సభకు లక్ష మంది

వరంగల్ సభకు లక్ష మంది