
ఎల్‌ఆర్‌ఎస్‌కు సర్వర్ డౌన్ ఆటంకం!
నల్లగొండ టూటౌన్: లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ (ఎల్‌ఆర్‌ఎస్) గడువు దగ్గర పడుతున్న కొద్దీ అడుగడుగునా సర్వర్ డౌన్ సమస్య ఆటంకంగా మారింది. ఈనెల30వ తేదీలోగా ఎల్‌ఆర్‌ఎస్ చేయించుకున్న వారికి ఫీజులో 25 శాతం డిస్కౌంట్ కల్పిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. మరో వారం రోజుల్లో గడువు ముగియనుండగా సర్వర్ డౌన్ సమస్య దరఖాస్తుదారులను కలవరానికి గురి చేస్తోంది. నీలగిరి మున్సిపల్ కార్యాలయానికి మంగళవారం ఎల్‌ఆర్‌ఎస్ ఫైల్స్ అప్‌లోడ్‌కు సర్వర్ పనిచేయకపోవడంతో రోజంతా దరఖాస్తుదారులు ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ఇదిలా ఉంటే హైదరాబాద్ నుంచే సాంకేతిక సమస్యలు తలెత్తడంతో తరచూ సర్వర్ పనిచేయడం లేదని, రెండు, మూడు రోజుల వరకు ఆన్‌లైన్‌లో ఫైల్స్, వివరాలను అప్‌లోడ్ చేయలేమని టౌన్ ప్లానింగ్ విభాగం ఉద్యోగులు చెబుతున్నారు. అయితే గడువు దాటితే డిస్కౌంట్ ఎత్తేయడంతో పాటు ఫీజు పెంచుతారేమోననే దరఖాస్తుదారులు ఆందోళన చెందుతున్నారు.
ఎఫ్‌టీఎల్ పరిధిలోకి వెళ్లిన వేలాది ప్లాట్లు..
నీలగిరి మున్సిపాలిటీ పరిధిలోని 48 వార్డుల నుంచి 36 వేలకు పైగానే రూ.వెయ్యి చెల్లించి 2020లో ఎల్‌ఆర్‌ఎస్ కోసం దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే. కానీ గతంలో చోటు చేసుకున్న పరిణామాల వలన వేలాది మంది ప్లాట్లు ఎఫ్‌టీఎల్ పరిధిలోకి వెళ్లిపోయాయి. నాలుగేళ్ల క్రితం ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉన్న భూముల వివరాలను రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ, మున్సిపల్, ఇరిగేషన్ శాఖల నుంచి తీసుకుంది. ఆ సమయంలో సంబంధిత శాఖల అధికారులు సమన్వయం లేకుండా ఇష్టానుసారంగా సర్వే నంబర్ల వారీగా పంపించారు. ఇప్పుడు ఇదే సమస్య ప్లాట్ల యజమానులకు ఇబ్బందికరంగా మారింది. ఎఫ్‌టీఎల్ పరిధి వరకు కాకుండా ప్రభుత్వం సర్వే నంబర్లలో ఎంత భూమి ఉంటే ఆ భూమి మొత్తం ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉందని ప్రభుత్వం రెడ్ మార్క్‌లో పెట్టింది. దాంతో నీలగిరి మున్సిపాలిటీ పరిధిలోని కేశరాజుపల్లి, మర్రిగూడ ప్రాంతం, ఆర్జాలాబావి, జీవీ గూడెం ప్రాంతాల్లో 6,800 ప్లాట్లు ఎఫ్‌టీఎల్ పరిధిలోకి వెళ్లాయి. కొన్ని ప్రాంతాల్లో చెరువు లేకున్నా ఎఫ్‌టీఎల్ చూపించడం లాంటివి కూడా ఉన్నాయి. ఇప్పుడు వీరంతా ఎల్‌ఆర్‌ఎస్ చేయించుకోవాలంటే రిజిస్ట్రేషన్, మున్సిపల్, ఇరిగేషన్, తహసీల్దార్ కార్యాలయాల అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. దీనిపై కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారిస్తేనే ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తుల ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉండనుంది.
సర్వర్ డౌన్ సమస్య వాస్తవమే..
ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తుదారులకు సర్వర్ డౌన్ సమస్య నెలకొంటున్న మాట వాస్తవమే. హైదరాబాద్ నుంచే ఈ సమస్య వస్తుంది. అక్కడ సాంకేతిక సమస్యను పరిష్కరిస్తున్నారు. సమస్య పరిష్కారం కాగానే ఎల్‌ఆర్‌ఎస్ ప్రక్రియ సజావుగా సాగనుంది.
– కృష్ణవేణి, మున్సిపల్ ఏసీపీ, నల్లగొండ
ఫ రాష్ట్ర స్థాయిలోనే నెలకొన్న సాంకేతిక సమస్య
ఫ ముందుకు సాగని ఎల్‌ఆర్‌ఎస్ ప్రక్రియ
ఫ నిలిచిపోయిన దరఖాస్తుల అప్‌లోడ్
ఫ ఇబ్బందుల్లో దరఖాస్తుదారులు