
భూ భారతితో సాదా బైనామాలకు మోక్షం
మునుగోడు : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన భూ భారతి చట్టం–2025తో అసైన్డ్ భూముల రెగ్యులరైజేషన్, సాదా బైనామాలకు పరిష్కారం లభిస్తుందని కలెక్టర్ ఇలా త్రిపాఠి పేర్కొన్నారు. మునుగోడులో గురువారం భూ భారతి చట్టం–2025పై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆమె ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యంతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ధరణి పోర్టల్‌లో అనేక సమస్యలున్నాయని, వాటన్నింటిని తొలగించి కొత్తగా భూ భారతి చట్టాన్ని ప్రభుత్వం తీసుకొచ్చిందన్నారు. భూ భారతి చట్టంతో సరిహద్దుల వివాదాల పరిష్కారం, మ్యుటేషన్, రిజిస్ట్రేషన్ వంటి అనేక సమస్యలకు పరిష్కారం లభిస్తుందన్నారు. గ్రామాల్లో భూ రికార్డుల నిర్వహణ, భూ వివాదాలను తగ్గించేందుకుగాను ప్రతి గ్రామానికి ఒక గ్రామ పాలన అధికారులను నియమించనుందని తెలిపారు. భూమి కబ్జాలో ఉన్నంత మాత్రన రైతుకు హక్కు రాదని, ప్లో చార్ట్‌తో పాటు అన్ని రకాల డాక్యుమెంట్లు ఉండాలని ఆమె స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం మాట్లాడుతూ భూ భారతి చట్టాన్ని రైతులు సద్వీనియోగం చేసుకుని సమస్యలు పరిష్కారించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో తహసీల్దార్ నరేష్, డిప్యూటి తహసీల్దార్ నరేందర్, ఏఎంసీ చైర్మన్ నారాయణ, ఎంపీడీఓ శాంతకుమారి తదితరులు పాల్గొన్నారు.