
నిలిచిన ఎంసీహెచ్ కిట్లు
నల్లగొండ టౌన్: ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలను ప్రోత్సహించేందుకు చేపట్టిన మాతా శిశు ఆరోగ్య (ఎంసీహెచ్) కిట్ల పంపిణీ నిలిచిపోయింది. దీంతో పాటు గర్భిణులు, బాలింతలకు అందించే ప్రోత్సాహకాలు కూడా బందయ్యాయి. అలాగే గర్భిణులకు న్యూత్రీషన్ కిట్ల సరఫరా కూడా నిలిచిపోయింది. వీటి గురించి వైద్యులు, అధికారులను అడిగితే సమాధానం దాట వేస్తున్నారని కాన్పులకు వచ్చిన మహిళల బంధువులు అంటున్నారు. కిట్లతోపాటు ప్రోత్సాహక నిధులు ఎప్పుడు ఇస్తారోనిన గర్భిణులు, బాలింతలు ఎదురుచూస్తున్నారు.
కేసీఆర్ కిట్ పేరు మార్చినా..
ప్రభుత్వ ఆసుపత్రుల్లో కేసీఆర్ కిట్ పేరిట బీఆర్‌ఎస్ ప్రభుత్వం గతంలో కొత్త పథకం అమలు చేసింది. ప్రభుత్వ ఆసుపత్రిలో కాన్పు చేయించుకున్న మహిళలు డిశ్చార్చి అయ్యే సమయంలో తల్లీబిడ్డలకు అవసరమైన 20 రకాల వస్తువులు ఉండే కేసీఆర్ కిట్ ఇచ్చేవారు. అలాగే ప్రభుత్వ వాహనంలో వారిని ఇంటి వద్దకు చేర్చేవారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ కిట్‌ను ఎంసీహెచ్ కిట్‌గా మార్చింది. గత మార్చి నుంచి కిట్ల సరఫరా కాకపోవడంతో కిట్ల పంపిణీ బంద్ అయింది. ఆసుపత్రుల్లో కిట్ల గురించి అడిగితే బాలింతలకు సమాధానాలు చెప్పలేక వైద్యులు అవస్థలు పడుతున్నారు.
మూడేళ్లుగా నగదు ప్రోత్సాహకాల్లేవ్..
గర్భం దాల్చిన మూడు నెలల నుంచి ప్రభుత్వ ఆసుపత్రిలో పేరు నమోదు చేసుకుని నెలనెలా పరీక్షలు చేయించుకుని అక్కడే ప్రసవించిన వారికి గత ప్రభుత్వం నగదు ప్రోత్సాహకాలు అందజేసింది. ఆడపిల్ల పుడితే రూ.13 వేలు, మగబిడ్డ పుడితే రూ.12 వేలు తల్లుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది. ఈ మొత్తాన్ని గర్భిణులు ప్రభుత్వ ఆసుపత్రుల్లో చెకప్‌లు పూర్తయిన తర్వాత రూ.2 వేలు, ప్రసవించిన తర్వాత రూ.3 వేలు, బిడ్డకు వ్యాక్సినేషన్ తర్వాత రూ.2 వేలు, అన్ని వ్యాక్సినేషన్లు పూర్తయ్యాక జమ చేసేవారు. ఈ ప్రోత్సాహకాలను కూడా 2020 ఆగస్టు నుంచి ప్రభుత్వం నిలిపివేసింది.
గతేడాది మార్చి నుంచి సరఫరా బంద్
ఫ 2022 ఆగస్టు నుంచి నగదు ప్రోత్సాహకాలూ అందట్లే
ఫ న్యూట్రీషన్ కిట్లదీ అదేదారి..
ఫ గర్భిణులు, బాలింతలకు తప్పని ఎదురుచూపులు
ప్రభుత్వం నుంచి సరఫరా లేదు
రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎంసీహెచ్ కిట్లు, న్యూత్రీషన్ కిట్లు సరఫరా కావాల్సి ఉంది. అవి వచ్చిన వెంటనే అర్హులందరికీ అందజేస్తారు. ప్రోత్సాహక నిధులు కూడా ప్రభుత్వం నుంచి విడుదల కాలేదు. విడుదలైన వెంటనే తల్లుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తాం.
– డాక్టర్ పుట్ల శ్రీనివాస్, డీఎంహెచ్‌ఓ, నల్లగొండ
అందని పౌష్టికాహారం..
పౌష్టికాహారం అందించడం ద్వారా రక్తహీనత నుంచి రక్షించి మాతాశిశు మరణాలు తగ్గించేలా గత ప్రభుత్వం గర్భిణులకు న్యూట్రిషన్ కిట్లను పంపిణీ చేసింది. న్యూత్రీషన్ కిట్‌లో నెయ్యి, హార్లిక్స్, ఖర్జూరాలు, పల్లీపట్టి తదితర పదార్థాలు ఉండేవి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఏరియా ఆసుపత్రులు, జీజీహెచ్‌లో పేర్లు నమోదు చేసుకున్న గర్భిణులకు న్యూత్రీషన్ కిట్లు పంపిణీ చేసేవారు. ఇవి కూడా మూడేళ్లుగా సరఫరా చేయడం లేదు.

నిలిచిన ఎంసీహెచ్ కిట్లు