11న ప్రత్యేక ప్రజావాణి
నల్లగొండ : జిల్లాలోని వయో వృద్ధులు, దివ్యాంగుల కోసం ప్రత్యేక ప్రజావాణి కార్యక్రమం ఈ నెల 11న శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 గంటల వరకు నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఇలా త్రిపాఠి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ప్రజావాణి కార్యక్రమానికి వృద్ధులు, దివ్యాంగులు హాజరై వారి సమస్యలపై వినతులు అందజేయవచ్చని ఆమె తెలిపారు.
రైస్ మిల్లుల వద్ద నేటి నుంచి రెవెన్యూ అధికారులకు విధులు
మిర్యాలగూడ : రైస్ మిల్లుల వద్ద ధాన్యానికి మద్దతు ధర ఇచ్చే విధంగా చూసేందుకు బుధవారం నుంచి రెవెన్యూ అధికారులు మిల్లుల వద్ద విధులు నిర్వహించనున్నారు. కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశాల మేరకు మిర్యాలగూడ సబ్‌కలెక్టర్ నారాయణ్ అమిత్ ఆయా మిల్లులకు రెవెన్యూ అధికారులను కేటాయించారు. మిల్లుల వద్ద ధాన్యం కొనుగోళ్లలో ఇబ్బందులు ఉంటే సంబంధిత అధికారులే పరిష్కరించాలని పేర్కొన్నారు. ఏదైనా మిల్లు వద్దకు అధికంగా ట్రాక్టర్లు ఇచ్చి ఇబ్బందులు ఎదురైతే ఇతర మిల్లులకు పంపించాలని సూచించారు. రోజూ ఉదయం 7గంటల నుంచి రాత్రి 9గంటల వరకు రెవెన్యూ అధికారుల పర్యవేక్షణ ఉండాలని ఆదేశించారు. ఫాం–బీ రిజిస్టర్‌లో ధాన్యం కొనుగోలు వివరాలను నమోదు చేయాలని పేర్కొన్నారు.
పూలే జయంతిని ఘనంగా నిర్వహించాలి
నల్లగొండ : మహాత్మా జ్యోతిరావుపూలే జయంతిని ఘనంగా నిర్వహించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి కోరారు. ఈనెల 11న జ్యోతిరావుపూలే జయంతి ఏర్పాట్లపై మంగళవారం కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. జ్యోతిరావుపూలే జయంతిని ప్రభుత్వ నిబంధనల మేరకు ఘనంగా నిర్వహించాలన్నారు. ఈ సందర్భంగా వివిధ సంఘాల నాయకులు, ప్రతినిధులు మాట్లాడుతూ జ్యోతిరావుపూలే జయంతిని ప్రభుత్వం సెలవుదినంగా ప్రకటించాలని కోరారు. సమావేశంలో అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, ఇన్‌చార్జి డీఆర్‌ఓ వై.అశోక్‌రెడ్డి, జెడ్పీ సీఈఓ ప్రేమ్‌కరణ్‌రెడ్డి, గృహ నిర్మాణ శాఖ పీడీ రాజ్‌కుమార్, సంజీవ్ తదితరులు పాల్గొన్నారు.
రైతుల ఆర్థికాభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం
● డీసీసీబీ చైర్మన్ కుంభం శ్రీనివాస్‌రెడ్డి
మునుగోడు : రాష్ట్రంలోని రైతుల ఆర్థికాభివృద్ధే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని డీసీసీబీ చైర్మన్ కుంభం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. మునుగోడు మండలంలోని కొరటికల్, పులిపలపుల, ఊకొండి, కచలాపురం, కొంపల్లి తదితర గ్రామాల్లో ఐకేపీ, పీఏసీఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రాలను మంగళవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ధాన్యానికి మద్దతు ధర చెల్లించేందుకు ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తోందన్నారు. సన్న వడ్లు పండించే రైతులకు క్వింటాకు రూ.500 బోనస్ కూడా ఇస్తుందని చెప్పారు. కార్యక్రమంలో చండూరు మార్కెట్ చైర్మన్ దోటి నారాయణ, నాయకులు పాల్వాయి చెన్నారెడ్డి, భీమనపల్లి సైదులు, వేమిరెడ్డి జితేందర్‌రెడ్డి, ఏఓ పద్మజ, ఏపీఎం మహిశేశ్వరరావు, సీఈఓ సుఖేందర్ తదితరులు పాల్గొన్నారు.
వృత్తి శిక్షణకు దరఖాస్తులు
నల్లగొండ : ఆసక్తిగల కిషోర బాలికలు (విద్యార్థినులు) వృత్తి శిక్షణకు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా మేనేజర్ ఎ.అనిత మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. కేంద్ర ప్రభుత్వ కిషోర బాలికల పథకం ద్వారా బ్యూటిషియన్, టైలరింగ్ కోర్సుల్లో వృత్తి శిక్షణ తరగతులు ఏప్రిల్ 15 నుంచి ప్రారంభమవుతాయని తెలిపారు. బ్యూటిషియన్, టైలరింగ్ కోర్సులకు 8వ తరగతి, వయసు 15 నుంచి 18 ఏళ్లలోపు ఉండాలని సూచించారు. ఒక్కో కోర్సులో 25 సీట్లు ఉన్నాయని పేర్కొన్నారు. ఆసక్తి గల వారు రెండు పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలు, ఆధార్ కార్డు జిరాక్స్ కాపీలతో దుర్గాబాయి మహిళా శిశు వికాస కేంద్రం (మహిళా ప్రాంగణం, నల్లగొండ)లో సమర్పించాలని పేర్కొన్నారు. ఇతర వివరాలకు 76600 22517 ఫోన్ నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.
11న ప్రత్యేక ప్రజావాణి


