
అర్హులకు త్వరలో పట్టాలు
మిర్యాలగూడ, తిరుమలగిరి(నాగార్జునసాగర్) : ఏన్నో ఏళ్లుగా పరిష్కారానికి నోచుకోకుండా ఉన్న భూ సమస్యలు వారం, పది రోజుల్లో తొలగిపోనున్నాయి. కొద్ది రోజుల్లోనే రైతులకు పట్టాలు అధించేందుకు అధికార యంత్రాంగం కసరత్తు చేస్తుంది. నూతన ఆర్‌ఓఆర్ – 2024 చట్టాన్ని తీసుకువచ్చే క్రమంలో అన్ని రకాల భూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తిరుమలగిరి(సాగర్) మండలాన్ని పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసింది. అందులో భాగాంగా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సుబ్రహ్మణ్యం నేతృత్వంలో 14 రెవెన్యూ, సర్వే బృందాలు, 80 మందితో ఏడు నెలలుగా గ్రామాల వారీగా ఎంజాయిమెంట్ సర్వే పూర్తి చేసి అర్హులను గుర్తించారు. అర్హులైన రైతులకు అసైండ్‌మెంట్ పట్టాలు ఇవ్వనున్న నేపథ్యంలో మంగళవారం మిర్యాలగూడ సబ్‌కలెక్టర్ కార్యాలయంలో అసైన్‌మెంట్ కమిటీ సభ్యులు సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్, ఎమ్మెల్యే కుందూరు జైవీర్‌రెడ్డి.. అధికారులతో సమావేశమై పట్టాల పంపిణీపై చర్చించారు. ముందుగా మొదటి విడతలో భాగంగా తిరుమలగిరి(సాగర్) మండలంలోని 13 గ్రామాల్లోని ప్రభుత్వ భూముల్లో కాస్తూ కబ్జా కలిగి ఉండి సేద్యం చేసుకుంటూ అర్హత కలిగి ఉన్న సుమారు 4500 మంది రైతులకు గాను 4000 ఎకరాలకు లావుణి పట్టాలు పంపిణీ చేయడానికి అసైన్‌మెంట్ కమిటీ ఆమోదించింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ పైలట్ ప్రాజెక్టులో భాగంగా ఇంతవరకు ధరణిలో నమోదు కాని పరేడ్, ఉడాఫ్ నంబర్లను కూడా గుర్తించి ఆన్‌లైన్‌లో నమోదు చేశామన్నారు. ఈ అసైన్‌మెంట్ కమిటీలో చైర్మన్‌గా జిల్లా ఇన్‌చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరావు, సభ్యులుగా అడిషినల్ కలెక్టర్ శ్రీనివాస్, సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్, ఎమ్మెల్యే జైవీర్‌రెడ్డి, ఎమ్మెల్సీ మంకెన కోటిరెడ్డి, డీఆర్‌డీఓ శేఖర్‌రెడ్డి ఉండనున్నారు. కమిటీ చైర్మన్ తుమ్మల నాగేశ్వరావు ఆమోదించగానే అర్హులకు పట్టాలు పంపిణీ చేయనున్నారు. సమావేశంలో తహసీల్దార్లు ఎస్.అనిల్‌కుమార్, కృష్ణయ్య, కృష్ణ, దశరథ, మధుసుధన్‌రెడ్డి, శ్రీనివాస్, హరిబాబు, రఘు, శ్రీనివాస్, ప్రమీల, జవహర్, పుష్పలత తదితరులు ఉన్నారు.
ఫ మిర్యాలగూడ సబ్ కలెక్టర్ కార్యాలయంలో అసైన్‌మెంట్ కమిటీ సమావేశం