చింతపల్లి: మండలంలోని నసర్లపల్లిలో గల సాయి రాఘవేంద్ర రైస్ మిల్లులో గురువారం హైదరాబాద్ నుంచి వచ్చిన ప్రత్యేక విజిలెన్స్ బృందం సభ్యులు తనిఖీలు నిర్వహించారు. మిల్లులో ఉన్న రికార్డులు పరిశీలించి అందుకు తగ్గ ధాన్యం నిల్వలు ఉన్నాయా, లేవా అని పరిశీలించారు. ధాన్యం సేకరణ ప్రారంభం కావడంతో ఇంతకు ముందు మిల్లుకు కేటాయించిన వడ్లను ఎంతమేర మర ఆడించారు. ఇంకా ఎన్ని బియ్యం ప్రభుత్వానికి అప్పగించాల్సి ఉందని ఆరా తీశారు. ఈ తనిఖీల్లో పౌర సరఫరాల శాఖ ఇన్‌స్పెక్టర్ కె.వెంకటేశ్‌తోపాటు అంజయ్య తదితరులు ఉన్నారు.
బంజారా కళలను పరిరక్షించుకోవాలి
దేవరకొండ: బంజారా కళలను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ వి.కోటేశ్వరరావు అన్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు గురువారం దేవరకొండ మండలంలోని పలు తండాల్లో గిరిజనుల ఆభరణాల తయారీ, కుట్టుపని కేంద్రాలను కోటేశ్వరరావు బృందం పరిశీలించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజనులు తయారు చేసే ఆభరణాలు, చేతి అల్లికలు, సంప్రదాయ దుస్తులు సామాజిక స్థితిని, సంస్కృతిని ప్రతిబింబించే చిహ్నాలుగా ఉన్నాయని పేర్కొన్నారు. గిరిజనులు తయారు చేసే ఉత్పత్తులకు భౌగోళిక సూచిక (జీఐ) లభించడం ద్వారా ప్రత్యేక గుర్తింపు లభిస్తుందన్నారు. అనంతరం బంజారా కళాకారులతో సమావేశమై పలు విషయాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో మందడి శ్రీహారెడ్డి, శ్రీవత్స, కీర్తి, లావుడి బాషా తదితరులు పాల్గొన్నారు.
ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి
నిడమనూరు : ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని డీఆర్‌డీఓ శేఖర్‌రెడ్డి సూచించారు. గురువారం నిడమనూరు మండలం ఊట్కూర్, ముప్పారం గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన పరిశీలించి మాట్లాడారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో రైతులు ఇబ్బందులు పడకుండా ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలన్నారు. లారీ ట్రాన్స్‌పోర్టు, టార్ఫాలిన్లు, హమాలీ సమస్యలపై స్థానిక అధికారులతో చర్చించారు. ధాన్యం కొనుగోలు చేసిన రైతుల వివరాలను వెంటనే ట్యాబ్‌లో నమోదు చేసి, సకాలంలో డబ్బుల జమ అయ్యేలా చూ డాలని మహిళా సంఘాల ప్రతినిధులకు, ఏపీఎంకు సూచించారు. ఆయన వెంట ఇన్‌చార్జ్ ఎంపీడీఓ బోనగిరి రమేష్, ఏపీఎం లక్ష్మీనారా యణ, వెలుగు సీసీ యాదయ్య ఉన్నారు.
నారసింహుడికి నిత్యారాధనలు
యాదగిరిగుట్ట : యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో నిత్యారాధనలు నేత్రపర్వంగా చేపట్టారు. గురువారం వేకువజామున ఆలయాన్ని తెరిచిన అర్చకులు సుప్రభాత సేవతో స్వామివారిని మేల్కొలిపారు. అనంతరం గర్భాలయంలో స్వయంభూలకు నిజాభిషేకం, తులసీ సహస్రనామార్చాన, అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించి భక్తులకు స్వామి, అమ్మవారి దర్శనభాగ్యం కల్పించారు. ఇక ప్రథమ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, గజవాహన సేవ, నిత్యకల్యాణం, బ్రహ్మోత్సవం, ముఖ మండపంలో అష్టోత్తర పూజలు నిర్వహించారు. సాయంత్రం వెండి జోడు సేవలను ఊరేగించారు. వివిధ పూజల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు.
రైస్ మిల్లులో ‘విజిలెన్స్’ తనిఖీలు
రైస్ మిల్లులో ‘విజిలెన్స్’ తనిఖీలు
రైస్ మిల్లులో ‘విజిలెన్స్’ తనిఖీలు