
నాడు కళకళ.. నేడు వెలవెల
అద్దెకిస్తే వినియోగంలోకి వస్తుంది
రంగనాథ రంగశాలను అద్దెకిస్తే వినియోగంలోకి వస్తుంది. ప్రాజెక్టు అధికారులు సమయానుకూలంగా సమావేశాలు ఏర్పాటు చేసుకునేందుకు వీలుంటుంది. అసాంఘిక కార్యకలాపాలు జరుగకుండా ఉంటాయి.
– శివ, స్థానిక వ్యాపారి
సాగర్‌లో థియేటర్ లేదు
సాగర్‌లో ఒకప్పుడు మూడు సినిమా థియేటర్లు ఉండేవి. నేడు ఒక్కటి కూడా లేదు. వారాంతంలో సినిమాలు చూసేందుకు స్థానికులు సుదూర ప్రాంతాలకు వెళ్తున్నారు. రంగనాథ రంగశాలను లీజుకు తీసుకుని మినీ సినిమా థియేటర్‌గా రూపొందిస్తే పూర్వ వైభవం వస్తుంది.
– భాస్కర్, ఉపాధ్యాయుడు
నాగార్జునసాగర్: నాగార్జునసాగర్ ప్రాజెక్టు నిర్మాణ సమయంలో వేలాది మంది కార్మికులు, ఉద్యోగులు, ఇంజనీర్లు తమ శ్రమను మర్చిపోయి ఆనందంగా గడిపేందుకు హిల్‌కాలనీలో రంగనాథ రంగశాలను నిర్మించారు. ఇందులో నిత్యం నాటకాలు ప్రదర్శించేవారు. అలనాటి సినిమా తారలు నూతన్‌ప్రసాద్, సావిత్రి, రేలంగి, జగ్గారావు, రాజనాల వంటి వారు రంగనాథ రంగశాలలో స్టేజీపై నాటకాలు వేశారని అప్పటి ఉద్యోగులు చెబుతుంటారు. సాగర్ ప్రాజెక్టును సందర్శించేందుకు వచ్చే ఉన్నతాధికారులు, విదేశీయులు సైతం ఇందులో వేసే నాటకాలు చూసి అబ్బుర పడేవారని పేర్కొన్నారు. నాగార్జునసాగర్‌లో సినిమా థియేటర్లు వచ్చాక రంగనాథ రంగశాలలో నాటకాలు ప్రదర్శన ఆగిపోయాయి.
కొంతకాలం సమావేశాలకు వినియోగం
ఆ తర్వాత కొంతకాలం వరకు రంగనాథ రంగశాలను సమావేశాలు నిర్వహించేందుకు వినియోగించారు. గత కృష్ణా పుష్కరాల సమయంలో భక్తులు సేద తీరేందుకు గాను రూ.50లక్షలు ఖర్చు చేసి విద్యుత్ సౌకర్యం, ఫ్లోరింగ్, వాష్‌రూమ్స్, ఫ్యాన్లు, విద్యుత్ దీపాలు, కుర్చీలు ఏర్పాటు చేశారు. కానీ ప్రస్తుతం నిర్వహణ లేక రంగనాథ రంగశాల ఆవరణలో కంపచెట్లు మొలిచాయి. బస్టాండ్‌కు సమీపంలో ఉండటంతో అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారింది. విద్యుత్ బోర్డులు, ఫ్యాన్లు చోరీకి గురయ్యాయి. నాగార్జునసాగర్‌లో గతంలో మూడు సినిమా థియేటర్లు ఉండేవి. నేడు ఒక్క థియేటర్ కూడా లేదు. స్థానికులు సినిమా చూడాలంటే హాలియా, మాచర్ల, మిర్యాలగూడకు వెళ్తుంటారు. రంగనాథ రంగశాలను అద్దెకిస్తే మినీ థియేటర్‌గా ఏర్పాటు చేయాలని స్థానిక ఎమ్మెల్యే, చీఫ్ ఇంజనీర్‌కు సినిమా థియేటర్ల నిర్వహణలో అనుభవం కలవారు దరఖాస్తు చేశారు. కానీ అధికారులు పట్టించుకున్న దాఖలాలు లేవు. దీనిని అద్దెకిస్తే ప్రాజెక్టు అధికారులు సమావేశాలు నిర్వహించుకునేందుకు వీలుంటుందని స్థానికులు అంటున్నారు.
శిథిలావస్థలో నాగార్జునసాగర్‌లోని రంగనాథ రంగశాల
అద్దెకిచ్చి మినీ థియేటర్‌గా అభివృద్ధి చేయాలంటున్న స్థానికులు

నాడు కళకళ.. నేడు వెలవెల

నాడు కళకళ.. నేడు వెలవెల