ప్రజలపై గ్యాస్ భారం
నల్లగొండ : వంట గ్యాస్ వినియోగదారులపై బండబాదుడు మొదలైంది. ఎల్‌పీజీ సిలిండర్ ధర పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ఎల్‌పీజీ ధర పెరగడం, ఇతర కారణాలతో ఒక్కో సిలిండర్‌పై రూ.50 వరకు పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో 14.2 కిలోల సిలిండర్‌ఽ ధర రూ.876.50నుంచి రూ.926.50లకు పెరిగింది. ఈ పెంపు కేంద్ర ప్రభుత్వం ఉచితంగా అందించిన ఉజ్వల్ లబ్ధిదారులకు సైతం వర్తించనుంది. జిల్లాలోని ఏజెన్సీల ద్వారా ప్రతి నెలా 1.55 లక్షల సిలిండర్లు రిఫిల్ అవతుండగా.. ఈలెక్కన వినియోగదారులపై రూ.80 లక్షల అదనపు భారం పడనుంది.
పేద, మధ్య తరగతిపై భారం..
కేంద్ర ప్రభుత్వం పెంచిన వంటగ్యాస్ ధరలతో జిల్లాలోని పేద, మధ్య తరగతి ప్రజలపై భారం పడనుంది. చాలాకాలంగా వంట గ్యాస్ ధరలను కేంద్ర ప్రభుత్వం, కంపెనీలు పెంచలేదు. వాణిజ్య గ్యాస్ ధరలను మాత్రం పెంచుతూ తగ్గిస్తూ వస్తోంది. ఇప్పటికే రోజురోజుకు పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలతో ఇబ్బంది పడుతున్న పేద, మధ్య తరగతి ప్రజలకు తాజాగా గ్యాస్ సిలిండర్ల ధరల పెంపుతో మరింత భారం పడనుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం రూ.500లకే గ్యాస్ సిలిండర్ ఇస్తుండగా.. ప్రస్తుతం పెరిగిన ధరలను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందా... లేదంటే వినియోగదారులే చెల్లించాలన్న అంశంపై స్పష్టత రావాల్సి ఉంది. ఈ పథకం కింద ఇప్పటి వరకు గ్యాస్ సిలిండర్‌ను పూర్తి ధర చెల్లించి నింపిస్తే.. తదనంతరం ప్రభుత్వం వినియోగదారుల అకౌంట్లలో జమ చేస్తోంది.
ఫ ఒక్కో సిలిండర్‌పై రూ.50 పెరిగిన ధర
ఫ నెలకు సుమారు రూ.80 లక్షల అదనపు భారం
ఫ జిల్లాలో 6,18,701 గ్యాస్ కనెక్షన్లు
జిల్లాలో గ్యాస్ కనెక్షన్లు..
జిల్లాలో మూడు కంపెనీల కింద 6,18,701 గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. వాటిలో జనరల్ కనెక్షన్లు 4,76,748, దీపం కనెక్షన్లు 82,209, ఉజ్వల యోజన కనెక్షన్లు 59,744 ఉన్నాయి. జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లో ఒక్కో కుటుంబం సంవత్సరానికి సుమారు 6 సిలిండర్లు, పట్టణ ప్రాంతాల్లో సుమారు 8 నుంచి 12 సిలిండర్లను వినియోగిస్తుంటారు. సరాసరి ప్రతి నెలా 1,55,000 సిలిండర్లు సరఫరా అవుతున్నట్లు సమాచారం. ఈ లెక్కన జిల్లా వ్యాప్తంగా వినియోగదారులపై రూ.77,50,000 అదనపు భారం పడనుంది.


