
కార్పొరేట్ ఆస్పత్రులకు దీటుగా వైద్య సేవలు
నల్లగొండ టౌన్: రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పేద ప్రజలకు కార్పొరేట్ ఆస్పత్రులకు దీటుగా ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నామని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లా కేంద్ర ఆస్పత్రిలో రూ.23.75 కోట్లతో నిర్మించిన క్రిటికల్ కేర్ యూనిట్‌ను శనివారం మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రానున్న ఏడాది కాలంలో అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అవసరమైన వసతులు కల్పిస్తామన్నారు. గాంధీ, ఉస్మానియా ఆస్పత్రుల్లో లివర్, కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ ఆపరేషన్లు కూడా నిర్వహిస్తున్నామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 16 నెలల్లోనే రూ.22కోట్ల విలువైన ఎల్‌ఓసీలు పేద ప్రజలకు ఇచ్చినట్లు తెలిపారు. రాష్ట్రంలో హైదరాబాద్, వరంగల్ తర్వాత అతిపెద్ద పట్టణాల్లో నల్లగొండ ఒకటని, నల్లగొండ జిల్లా కేంద్ర ఆస్పత్రిలో అన్నిరకాల వైద్య సేవలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని గాంధీ, నీలోఫర్ ఆస్పత్రుల తర్వాత ఎక్కువ ప్రసవాలు నల్లగొండలో జరుగుతున్నాయన్నారు. నల్లగొండ జిల్లాలో హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారి, నార్కట్‌పల్లి–అద్దంకి రహదారి ఉండటంతో క్రిటికల్ కేర్ యూనిట్ అవసరమని, సంవత్సర కాలంలోనే క్రిటికల్ కేర్ యూనిట్‌ను ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. నల్లగొండ ప్రభుత్వ వైద్య కళాశాలకు మరో 3 కోర్సులు మంజూరయ్యే అవకాశం ఉందన్నారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.10 లక్షలకు పెంచామని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, అదనపు కలెక్టర్ శ్రీనివాస్, ఆస్పత్రి సూపరింటెండెంట్ అరుణకుమారి, డీఎంహెచ్‌ఓ పుట్ల శ్రీనివాస్, వేణుగోపాల్‌రెడ్డి, బుర్రి శ్రీనివాస్‌రెడ్డి, వైద్యులు పాల్గొన్నారు.
రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి
కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి