
మాటల యుద్ధం
మంత్రి పదవిపై..
అధిష్టానం నిర్ణయం ఏమిటో?
ప్రస్తుత పరిస్థితులు అన్నింటిని గమనిస్తున్న కాంగ్రెస్ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుందన్నది తేలాల్సి ఉంది. జానారెడ్డి లేఖను పరిగణనలోకి తీసుకొని హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు మంత్రి పదవులు ఇస్తుందా..? ముందుగా ఇచ్చిన హామీ మేరకు రాజగోపాల్‌రెడ్డికి మంత్రి పదవి ఇచ్చి మాట నిలుపుకుంటుందా అనేది వేచి చూడాల్సిందే. మరోవైపు దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్‌కు మంత్రి పదవి రాకుండా అడ్డుకునేందుకే జిల్లా కాంగ్రెస్ పెద్దలు డీసీసీ అధ్యక్షుడు శంకర్‌నాయక్‌కు ఎమ్మెల్సీ పదవిని ఇప్పించారన్న చర్చ సాగుతోంది. తనకు మంత్రి పదవి కావాలని బాలునాయక్ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లిన సమయంలో ఇది జరగడం, ఆయన ఎప్పుడు బహిర్గతం అవుతారోనన్నది చర్చనీయాంశంగా మారింది.
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : జిల్లా కాంగ్రెస్‌లో మంత్రి పదవి మంట రేపుతోంది. నేతల మధ్య మాటల యుద్ధం మొదలైంది. మాజీ మంత్రి జానారెడ్డి తీరుపై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఆదివారం చౌటుప్పల్, చండూరులో బహిరంగంగానే విమర్శలు చేయడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ పార్టీ అధిష్టానంతో 15 రోజుల కిందట జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో మంత్రివర్గ విస్తరణపై చర్చించిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి మంత్రి పదవి దాదాపుగా ఖరారైందని, ఇక ప్రకటనే తరువాయి అన్న చర్చ జోరుగా సాగింది. అదే సమయంలో మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు కేబినెట్‌లో చోటు కల్పించాలని పార్టీ అధిష్టానానికి లేఖ రాయడంతో చిచ్చు మొదలైంది. రాజగోపాల్‌రెడ్డికి వచ్చే మంత్రి పదవిని అడ్డుకునేందుకు ఆయన లేఖ రాశారని రాజగోపాల్‌రెడ్డి అనుచరులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. లోలోపల రగులుతూనే ఉన్నా ఆ మంట ఆదివారం బహిర్గతమైంది.
జానాపై భగ్గుమన్న రాజగోపాల్‌రెడ్డి
ఆదివారం చౌటుప్పల్, చండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీల నూతన పాలకవర్గ ప్రమాణస్వీకార కార్యక్రమంలో పాల్గొన్న రాజగోపాల్‌రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ అధిష్టానం మంత్రి పదవి ఇచ్చేందుకు సిద్ధంగా ఉందని, కొంతమంది దుర్మార్గులు అడ్డుపడుతున్నారంటూ ధ్వజమెత్తారు. 20 ఏళ్లు మంత్రి పదవి అనుభవించిన జానారెడ్డి ధర్మరాజు మాదిరిగా పెద్దన్నలా వ్యవహరించకుండా మహాభారతంలో ధృతరాష్ట్రుడి పాత్ర పోషించారంటూ తీవ్రస్థాయిలో విమర్శించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాకు మంత్రి పదవి ఇవ్వకుండా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు మంత్రి పదవులు ఇవ్వాలంటూ లేఖ రాయడమేంటని ఆయన ప్రశ్నించారు. సామాజిక న్యాయం, సామాజిక కూర్పు అంటున్న జానారెడ్డికి ఇన్నేళ్ల తర్వాత ఆ అంశం గుర్తొచ్చిందా అని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎన్నో త్యాగాలు చేసిన తమ కుటుంబంలో ఇద్దరికీ పదవులు ఇస్తే తప్పు ఎలా అవుతుందని ప్రశ్నించారు. మొత్తానికి జానారెడ్డి లేఖ కాంగ్రెస్‌లో కాకరేపగా.. ఆయనను రాజగోపాల్‌రెడ్డి ధృతరాష్ట్రుడితో పోల్చుతూ హాట్ కామెంట్ చేయడం పార్టీలో చిచ్చు రగిల్చింది.
ఫ జానారెడ్డి తీరుపై భగ్గుమన్న
కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి
ఫ ధృతరాష్ట్రుడిలా వ్యవహరిస్తున్నారని మండిపాటు
ఫ వేరే జిల్లాలకు మంత్రి పదవులివ్వాలని లేఖ రాయడంపై అభ్యంతరం
ఫ తెలంగాణ కోసం పోరాడిన
కుటుంబంలో ఇద్దరికి పదవులు
ఇస్తే తప్పేంటని ప్రశ్న
మంత్రి పదవి రచ్చ ఎటు దారి తీస్తుందో?
ఎప్పుడూ గుంభనంగా ఉండే జానారెడ్డి ఒక్కసారిగా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు మంత్రి పదవులు ఇవ్వాలంటూ లేఖ రాయడం వెనుక ఆంతర్యమేమిటి? అన్నది చర్చనీయాంశంగా మారింది. రాజగోపాల్‌రెడ్డికి మంత్రి పదవి ఇవ్వొద్దని సూటిగా చెప్పలేక వేరే జిల్లాలకు మంత్రి పదవి ఇవ్వాలని లేఖ రాశారన్న చర్చ జరుగుతోంది. ఆయన లేఖ తరువాతే కేబినెట్ విస్తరణకు బ్రేక్ పడిందని కాంగ్రెస్ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలో రాజగోపాల్‌రెడ్డి బహిరంగా విమర్శలు చేయడం ఎటు దారి తీస్తుందో చూడాలి. అంతేకాదు మరోవైపు రాజగోపాల్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ తనకు మంత్రి అయ్యే అర్హత లేదా? అని ప్రశ్నించారు. తాను ఇన్నాళ్లూ ఆగానని, ఇకపై కచ్చితంగా మంత్రి పదవిని అడుగుతానని స్పష్టం చేశారు. అంతేకాదు ఖమ్మంలో 9 మంది గెలిస్తే మూడు మంత్రి పదవులు ఇచ్చినప్పుడు నల్లగొండలో 11 మంది గెలిచినప్పుడు ఎందుకు మూడో మంత్రి పదవి ఇవ్వరని ప్రశ్నించారు.