
జాగ్రత్తలు పాటిస్తే అధిక దిగుబడులు
పెద్దవూర: రాష్ట్ర ప్రభుత్వం ఆయిల్‌పామ్‌ను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో రైతులకు సబ్సిడీపై మొక్కలు అందించటంతో జిల్లా వ్యాప్తంగా ఆయిల్ పామ్ పంటను అధిక విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు. మండుతున్న ఎండలకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, లేకుంటే పంట ఎదుగుదల, దిగుబడిలో నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని మండల ఉద్యానవన అధికారి మురళి తెలిపారు. ఏప్రిల్, మే నెలల్లో ఉష్ణోగ్రతలను దృష్టిలో ఉంచుకుని కొత్తగా వేసిన, ఎదిగిన పంట పెరుగుదలను కాపాడుకుంటూ, పంట పరిస్థితిని బట్టి రైతులు అధికారుల సూచనలు, సలహాలు పాటించి సాగు చేపట్టాలని, తద్వారా అధిక దిగుబడులు సాధించవచ్చని పేర్కొన్నారు.
● ఒకటి నుంచి మూడు సంవత్సరాల వయసు ఉన్న ఆయిల్‌పామ్ తోటల్లో మొక్కకు మూడు అడుగుల దూరంలో జనుమును, పచ్చిరొట్ట ఎరువు పంటగా నాటుకోవాలి. జనుము పూతకు వచ్చిన తరువాత చిన్న, చిన్న ముక్కలుగా కోసి పాదులో చుట్టూ వేయాలి.
● ప్రతి మొక్కకు రెండువైపులా ఒక్కో మైక్రోజెట్ (30 లేదా 40 లీటర్లు డిశ్చార్జ్ అయ్యేవి) అమర్చుకోవాలి.
● వేసవిలో చిన్న మొక్కలకు రోజుకు 150–165 లీటర్ల నీటిని అందించాలి. చెట్టుకు ఇరుపక్కల జెట్‌కు గంటకు 40 లీటర్ల సరఫరా సామర్థ్యం ఉంటే రోజుకు రెండు గంటలు నీరు అందించాలి. ఎదిగిన ఆయిల్‌పామ్ తోటల్లో వేసవిలో ప్రతి చెట్టుకు రోజుకు 250–330 లీటర్ల నీటిని అందించాలి.
● మూడేళ్ల లోపు వయస్సు ఉన్న మొక్కల్లోని పూగుత్తులను ప్రతి నెల అబ్లెషన్ సాదనంతో(రెండుసార్లు) తొలగించాలి.
● అవసరం మేరకు మాత్రమే (అన్ని చెట్లు కాకుండా) ఎండిన, విరిగిన లేదా చీడపీడలు ఆశించిన ఆకులను తొలగించాలి.
● ఆయిల్‌పామ్ తోటల్లో అంతర పంటలు వేసినట్లయితే ఆయిల్‌పామ్ మొక్కలతో పాటు అంతర పంటలకు కూడా సిఫారసు మేరకు నీరు తప్పనిసరిగా అందేలా చూసుకోవాలి.
● ఎదిగిన ఆయిల్‌పామ్ తోటల్లో గెలలు కోసిన తరువాత నరికి ముక్కలు చేసిన ఆయిల్‌పామ్ ఆకులను, మగ పూల గుత్తులను, మొక్కజొన్న చొప్పను, ఖాళీ అయిన ఆయిల్‌పామ్ గెలలను, పాదుల్లో మల్చింగ్‌గా పరచాలి.
● ఎదిగిన ఆయిల్‌పామ్ తోటల్లో పక్వానికి వచ్చిన ప్రతి గెలను, అల్యూమినియం కడ్డీ లేదా కత్తిని ఉపయోగించి కోయాలి.
ఆయిల్‌పామ్ సాగులో
పాటించాల్సిన మెళకువలపై
ఉద్యానవన అధికారి సూచనలు
ఎదిగిన ఆయిల్‌పామ్ తోటలకు నెలకు ఎకరాకు 5 కిలోల యూరియా, 3 కిలోల డీఏపీ, 5 కిలోల మ్యూరేట్ ఆఫ్ పోటాష్, 2.5 కిలోల మెగ్నీషియం సల్ఫేట్‌ను, ఒక కిలో బోరాక్స్‌ను విడివిడిగా నీటిలో కరిగించి ఫర్టిగేషన్ ద్వారా మొక్కలకు అందించాలి. ఇలా చేయడం వల్ల సమయం, ఎరువులపై ఖర్చు కూడా ఆదా చేయొచ్చు.
ఆయిల్‌పామ్ తోటల్లో ఎక్కువగా పోషక లోపాలు కనిపిస్తే మట్టి, పత్ర విశ్లేషణ కొరకు నమూనాలను సిఫార్సు చేసిన రీతిలో సేకరించి విశ్లేషణ కోసం పంపాలి.

జాగ్రత్తలు పాటిస్తే అధిక దిగుబడులు