
వెంచర్లకు చెరువు మట్టి!
ఫ రాత్రికి రాత్రే తరలింపు
ఫ పట్టించుకోని అధికారులు
నార్కట్‌పల్లి : వెంచర్లకు చెరువు మట్టిని అక్రమంగా తరలిస్తున్నారు. రాత్రి వేళ గుట్టు చప్పుడు కాకుండా జేసీబీలు, టిప్పర్ల ద్వారా మట్టిని వెంచర్లలో నింపుతున్నారు. వరుసగా మూడు రోజులు సెలవులు రావడంతో ప్రభుత్వ అధికారులు అటువైపు కన్నెత్తి చూడలేదు. ఇదే అదునుగా భావించి వెంచర్ల నిర్వాహకులు మట్టిని తరలించారు. వివరాల్లో వెళ్తే.. నార్కట్‌పల్లి మండలం చెర్వుగట్టు నల్ల చెరువు 60 ఎకరాలో విస్తీర్ణం కలిగి ఉంది. ఈ చెరువు మట్టిని 20 రోజులుగా.. రైతులు పొలాలకు, ఇతరులు తమ అవసరాలకు తరలిస్తున్నారు. వెంచర్ల నిర్వాహకులు చెరువు మట్టిని తరలిస్తున్నారని కొందరు ఫిర్యాదు చేసినా అధికారులు మాత్రం రైతుల వాహనాలను అడ్డుకున్నారు. అధికారులు, వెంచర్ల నిర్వాహకులతో కుమ్మక్కయి.. మట్టి తరలింపునకు సహకరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో అధికారులు సెలవులో ఉన్న ఈనెల 14న రాత్రి పెద్ద భారీ వాహనాలతో చెరువు మట్టిని వెంచర్లకు తరలించడం గమనార్హం. ఇప్పటికై నా అధికారులు స్పందించి వెంచర్లకు మట్టి తరలింపును అడ్డుకోవాలని రైతులు, ప్రజలు కోరుతున్నారు.
అక్రమంగా మట్టి తరలిస్తే కఠిన చర్యలు
చెరువు మట్టిని వెంచర్లకు అనుమతి లేకుండా తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. మట్టి తరలిపునకు మైనింగ్, రెవెన్యూ శాఖ నుంచి అనుమతి ఉండాలి. వెంచర్లను పరిశీలించి మట్టిని చెరువుమట్టి తరలించినట్లు నిర్ధారణ అయితే ఆయా వెంచర్ల నిర్వాహకులపై చర్యలు తీసుకుని మట్టిని సీజ్ చేస్తాం.
– వెంకటేశ్వరావు, తహసీల్దార్