
చిట్యాలలో ఫ్లై ఓవర్ పనులు ప్రారంభం
ఫ రూ.45 కోట్లు మంజూరు
చేసిన కేంద్రం ప్రభుత్వం
ఫ సర్వీస్ రోడ్డు మీదుగా
వాహనాల మళ్లింపు
చిట్యాల : చిట్యాల పట్టణంలో 65వ నంబరు జాతీయ రహదారిపై ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులను మంగళవారం ప్రారంభమయ్యాయి. ఈ ఫ్లైఓవర్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం రూ.45 కోట్లు మంజూరు చేసింది. పట్టణంలో 750 నుంచి 800 మీటర్ల పొడవున ఫ్లై ఓవర్ నిర్మించనున్నారు. పాల కేంద్రం సమీపం నుంచి ఎస్‌బీఐ బ్యాంకు వరకు ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులు జరగనున్నట్లు తెలుస్తోంది. పోలీస్‌స్టేషన్ ఎదురుగా 8 నుంచి 9 అడుగుల ఎత్తులో సుమారు నాలుగు వరుసలుగా వాహనాలు వెళ్లే విధంగా అండర్‌పాసింగ్ నిర్మించనున్నారు. ప్రస్తుతం పోలీస్‌స్టేషన్ ఎదురుగా అండర్ పాసింగ్ బ్రిడ్జిని నిర్మించే ప్రాంతంలో రహదారిపై బీటీని తొలగించే పనులు చేపట్టారు.
సర్వీస్ రోడ్డు మీదుగా వాహనాల రాకపోకలు..
ఫ్లై ఓవర్ బ్రిడ్జి పనుల ప్రారంభించడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బంది కలగకుండా ట్రాఫిక్‌ను సర్వీస్ రోడ్డుపైకి మళ్లించారు. దీనిలో భాగంగా జాతీయ రహదారిపై గల పాలశీతలికరణ కేంద్రం నుంచి పోలీస్‌స్టేషన్ వరకు రహదారిపై వాహనాలు రాకపోకలు లేకుండా రేకులతో మూసి వేశారు. ప్రస్తుతం హైదరాబాద్ నుంచి నార్కట్‌పల్లి వైపు వెళ్లే వాహనాలన్నీ సర్వీస్ రోడ్డు మీదుగా పంపుతున్నారు.
ఇబ్బందుల్లో వ్యాపారులు..
సర్వీస్ రోడ్డు మీదుగా వాహనాలు వెళ్తుండడంతో రోడ్డు వెంట వ్యాపార సముదాయలు ఉన్న వారు దుమ్ముతో ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే పలు చిరు వ్యాపారులు తమ దుకాణాలను ఖాళీ చేసి వెళ్లారు. రోడ్డు పక్కన ఫుట్‌పాత్‌పై మిర్చి, టిఫిన్, చాయ్ బండ్లు ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తున్న వారు ఎలా బతకాలోనని ఆందోళన చెందుతున్నారు. అంతేకాకుండా సర్వీస్ రోడ్డుపై స్ట్రీట్ లైట్స్‌ను ఏర్పాటు చేయకుండా సోలార్ లైట్స్‌ను మాత్రమే ఏర్పాటు చేశారు. వాటి వెలుతురు తగినంతగా రాక రాత్రి సమయంలో ప్రయాణించే వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.
ఆరు నెలల్లో పనులు పూర్తి చేస్తాం
చిట్యాల పట్టణంలో ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులను మంగళవారం నుంచి పూర్తిస్థాయిలో ప్రారంభమయ్యాయి. ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులను వేగవంతంగా చేపట్టి ఆరు నెలల్లోనే పూర్తి చేసేలా ప్రణాళికలు సిద్ధం చేశాం. నిర్మాణ సమయంలో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలను తీసుకుంటున్నాం.
– నాగకృష్ణ, ప్రాజెక్టు మేనేజర్

చిట్యాలలో ఫ్లై ఓవర్ పనులు ప్రారంభం