
- 76 కోట్ల ఆయుష్మాన్ అకౌంట్స్ రూపకల్పన
- 50.9 కోట్ల ఆరోగ్య రికార్డుల అనుసంధానం
- ఆరోగ్య రికార్డుల నిర్వహణ మరింత సులభం
- డేటాను సురక్షితంగా యాక్సెస్ చేసుకునే అవకాశం
- రోగి కేంద్రీకృత ఆరోగ్య సంరక్షణ దిశగా ముందడుగు
న్యూఢిల్లీ: భారతదేశంలో ఇకపై ఆరోగ్య రికార్డుల నిర్వహణ మరింత సులభంగా మారనుంది. ఇప్పుడున్న వ్యవస్థ అత్యంత సవాలుగా ఉన్నదనడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే ఇప్పుడు ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్(Ayushman Bharat Digital Mission) (ఏబీడీఎం) ఈ సమస్యలను పూర్తి స్థాయిలో తొలగించేందుకు నడుంబిగించింది.
డిజిటల్ విధానంతో సమూల మార్పులు
ఏబీడీఎం చూపుతున్న చొరవ కారణంగా రోగులు/బాధితులు తమ ఆరోగ్య డేటాను(Health data) సురక్షితంగా యాక్సెస్ చేసుకునేలా అవకాశం కలుగుతుంది. అలాగే రోగి అనుమతి ఉన్నప్పుడు మాత్రమే డేటా షేర్ చేసేందుకు అవకాశం ఉంటుంది. ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ భారత ఆరోగ్య పరిరక్షణ వ్యవస్థను పూర్తిస్థాయిలో డిజిటల్ విధానంతో సమూలంగా మారుస్తోంది. ఈ నేపధ్యంలో 2025, మార్చి నాటికి 76 కోట్లకు పైగా ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య ఖాతాలు క్రియేట్ చేశారు. అలాగే 50.9 కోట్ల ఆరోగ్య రికార్డులను దీనికి అనుసంధానం చేశారు. ఇది కాగితం అనేది అవసరంలేని, రోగి కేంద్రీకృత ఆరోగ్య సంరక్షణ దిశగా పడిన ముందడుగుగా చెప్పుకోవచ్చు.

రోగి అనుమతి మీదటనే..
ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య ఖాతా అనేది 14 అంకెల యునిక్ నెంబర్. ఈ ప్రత్యేకమైన నంబర్ రోగుల వైద్య రికార్డులను ఆస్పత్రులు, క్లినిక్‌లు, ల్యాబ్‌లు వంటి ఆరోగ్య సంస్థల మధ్య అనుసంధానం చేస్తుంది. ఫలితంగా రోగులు ఆస్పత్రులకు వెళ్లినప్పుడల్లా తమ వైద్య రికార్డులను తీసుకెళ్లాల్సిన అవసరం ఉండదు. బాధితుడు లేదా రోగికి సంబంధించిన పూర్తి వైద్య చరిత్రను(Medical history) హెల్త్‌కేర్ ప్రొవైడర్లు ఇకపై సులభంగా యాక్సెస్ చేసుకోగలుగుతారు. సంప్రదాయ వైద్య డేటా బేస్‌లతో పోలిస్తే.. ఏబీడీఎంలో ఆరోగ్య రికార్డులన్నీ నిల్వ కావు. దీనికి బదులుగా రోగి డేటా ఆయా వ్యక్తుల దగ్గర లేదా ఆరోగ్య సంస్థల వద్ద భద్రంగా ఉంటుంది. ఈ డేటాను రోగి అనుమతితో మాత్రమే ఇతరులకు షేర్ చేసేందుకు అవకాశం ఉంటుంది.
తక్షణం యాక్సెస్ చేసుకునే అవకాశం
ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ సాయంతో రోగులు తమ ల్యాబ్ రిపోర్టులు, ప్రిస్క్రిప్షన్లు మొదలైనవి ఏబీడీఎం అధీకృత పర్సనల్ హెల్త్ రికార్డ్ (పీహెచ్ఆర్) యాప్‌ల ద్వారా వెంటనే యాక్సెస్ చేసుకునే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధులతో(chronic diseases) బాధపడుతున్న వారు ఈ విధానం ద్వారా అత్యధికంగా ప్రయోజనం పొందుతారు. రోగులు క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం ద్వారా ఆరోగ్య సమాచారాన్ని తక్షణమే ఆస్పత్రులు లేదా ఫార్మసీలతో పంచుకోగలుగుతారు. ఫలితంగా ఆస్పత్రులలో బాధితులు వేచి ఉండే సమయం తగ్గుతుంది. అలాగే ఫార్మసీలలో మందులు కొనుగోలు వేగవంతం అవుతుంది.

గణనీయంగా తగ్గనున్న వైద్య ఖర్చులు
ఈ విధానం వలన పేపర్ వర్క్(Paper work) అనేది గణనీయంగా తగ్గుతుంది. డాక్టర్ అపాయింట్‌మెంట్ కూడా సులభంగా లభించేందుకు అవకాశం కలుగుతుంది. బాధితుల మెడికల్ హిస్టరీ కొన్ని నిముషాలలోనే వైద్యులకు అందుబాటులోకి వస్తుంది. దీనివల్ల బాధితులకు పునరావృత పరీక్షల అవసరం మరింతగా తగ్గుతుంది. తప్పిదాలకు అవకాశం ఉండదు. ఖర్చులు కూడా అదుపులో ఉంటాయి. ఈ విధానం సాయంతో వైద్యులు కచ్చితమైన డయాగ్నోసిస్ చేయగలుగుతారు. అలాగే సమర్థవంతమైన చికిత్సను కూడా అందించగలుగుతారు. ఏబీడీఎం నమోదు ప్రక్రియ ఐదు నిమిషాలలో పూర్తవుతుంది. బాధితులు ఇందుకోసం ఏబీడీఎం పోర్టల్‌లో ఏబీహెచ్‌ఏ నంబర్ కోసం సైన్ అప్ చేయాల్సి ఉంటుంది. తరువాత నిర్థారిత పీహెచ్ఆర్ యాప్ ద్వారా వైద్య రికార్డులను లింక్ చేయాలి. తద్వారా వారు ఆరోగ్య సేవలను సులభంగా యాక్సెస్ చేసుకోగలుగుతారు.
ఇది కూడా చదవండి: ప్రధాని మోదీ ఆర్థిక సలహాదారుగా సంజయ్ మిశ్రా