
న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుకు నిరసనగా ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు, కార్యకర్తలు మార్చి 31న భారీ ర్యాలీ చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. ఇందులో భాగంగానే నేడు (మంగళవారం) ప్రధాని మోదీ నివాసాన్ని చుట్టుముట్టడానికి సన్నద్ధమవుతున్నారు.
నిరసనలు జరగకుండా చూడటానికి, శాంతి భద్రతలను కాపాడటానికి మోదీ నివాసానికి గట్టి భద్రతను ఏర్పాటు చేసినట్లు ఓ అధికారి పేర్కొన్నారు. దేశ రాజధానిలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే పోలీస్ బలగాలు భద్రతను పటిష్టం చేశాయి. నిరసనలు ఢిల్లీలో పెద్ద అలజడులను రేపుతాయని పోలీసులు ముందుగానీ ఈ చర్యలు తీసుకున్నారు.
ఇప్పటికే ప్రధాన మంత్రి నివాసం చుట్టూ.. సెక్షన్ 144 విధించారు. దీంతో మోదీ నివాసం వద్ద ఎవరూ నిరసనలు ప్రదర్శించడానికి ఆస్కారం లేదు. అయితే ప్రయాణికులు కెమాల్ అటాతుర్క్ మార్గ్, సఫ్దర్‌జంగ్ రోడ్, అక్బర్ రోడ్, తీన్ మూర్తి మార్గ్‌లకు దూరంగా ఉండాలని అధికారులు తెలిపారు.