ముంబై టూ దుబాయ్‌.. రెండు గంటల్లో ప్రయాణం! | UAE Underwater Train Project, Get Ready To Travel From Mumbai To Dubai In Only Two Hours, Know More Details Inside | Sakshi
Sakshi News home page

UAE Underwater Train: ముంబై టూ దుబాయ్‌.. రెండు గంటల్లో ప్రయాణం!

Published Sat, Apr 12 2025 12:53 PM | Last Updated on Sat, Apr 12 2025 1:34 PM

UAE Underwater Train Project Mumbai To Dubai In Only Two Hours

ముంబై నుంచి దుబాయ్‌ వెళ్లాలంటే ఎలా వెళ్తారు అంటే ఎవరైనా ఏం సమాధానం చెబుతారు. విమానం ఎక్కి వెళ్లాల్సిందేనని అంటారు. సరే.. విమానంలో వెళ్లాలంటే ఎంత సమయం పడుతుంది. అంతర్జాతీయ విమానాలకు దాదాపు 3-4 గంట సమయం పడుతుంది. అయితే, మరింత తక్కువ సమయంలో ముంబై నుంచి 2000 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 2 గంటల్లోనే చేరుకును ప్రయత్నాలు జరుగుతున్నాయి. అండర్‌ వాటర్‌ హై స్పీడ్‌ రైలు కోసం ఓ ప్రాజెక్ట్‌ సిద్ధం అవుతోంది.

వివరాల ప్రకారం.. మన దేశం నుంచి దుబాయ్‌ వెళ్లే వాళ్ల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది, అందరూ విమానంలోనే వెళ్లి వస్తుంటారు. ఈ నేపథ్యంలో సమయాన్ని ఆదా చేసేందుకు ముంబై-దుబాయ్‌ మధ్య నడిచే హై స్పీడ్‌ ట్రైన్‌ కోసం ఓ ప్రాజెక్ట్‌ సిద్ధం అవుతోంది. UAE నేషనల్‌ అడ్వైజర్‌ బ్యూరో ప్రణాళిక ప్రకారం.. దుబాయ్‌-ముంబై మధ్య నీటి అడుగున రైలు మార్గం అనుసంధానాన్ని పరిశీలిస్తున్నారు. ఇది ప్రయాణ సమయాన్ని కేవలం 2 గంటలకు తగ్గిస్తుంది.

గంటకు 1000 కిలోమీటర్ల ప్రయాణం!
ఈ హైస్పీడ్ రైలు వేగం గంటకు 600 కిలోమీటర్ల నుంచి 1000 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లవచ్చు. గంటకు 1000 కిలోమీటర్ల వేగంతో వెళ్లినట్లైతే.. 2000 కిలోమీటర్ల దూరంలో ఉన్న దుబాయ్‌ను రెండు గంటల్లో చేరుతుంది. ఇక, ఈ రైలు నీటి అడుగున, అంటే అరేబియా సముద్రం లోపల నుంచి ప్రయాణిస్తుంది. అండర్‌ వాటర్‌ రైల్‌ నెట్‌వర్క్ ద్వారా ప్రయాణీకులు మొత్తం ప్రయాణంలో నీటి అడుగున ప్రపంచంలోని ఆహ్లాదకరమైన అనుభవాన్ని ఆస్వాదించగలుగుతారు.

అయితే, వాస్తవానికి ఈ ప్రాజెక్ట్‌ కొత్తదేమీ కాదు, ముంబై నుంచి దుబాయ్ వరకు అండర్ వాటర్ రైలు ప్రాజెక్టును కొన్ని సంవత్సరాల క్రితమే ప్రతిపాదించారు. దానికి అవసరమైన ఆమోదాలు పొందలేదు. ప్రస్తుతం, రెండు దేశాల మధ్య చర్చలు కొనసాగుతున్నాయి. వివిధ ఆమోదాలు, ఆర్థిక పెట్టుబడులపై ఈ ప్రాజెక్టు వేగం ఆధారపడి ఉంటుంది. అండర్‌ వాటర్‌ ట్రైన్‌ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ లభిస్తే, ఈ రైలు 2030 నాటికి పరుగులు తీయవచ్చు. మరోవైపు, ఇది భారత్‌- యూఏఈ మధ్య ముడి చమురు, వస్తువుల రవాణాను మరింత సులభంగా మారుస్తుంది. ఈ ప్రతిపాదిత రైలు నెట్‌వర్క్ విమాన ప్రయాణికులకు మరొక ఆప్షన్‌ను అందిస్తుంది. విమాన ప్రయాణాల్లో రద్దీని కూడా తగ్గించే అవకాశం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement