
సాక్షి, పెద్దపల్లి: అకారణంగా తిడుతూ, చెప్పుతో కొట్టారని అవమాన భారంతో ధూళికట్ట గ్రామానికి చెందిన పెద్ది కనుకయ్య(65) బీరన్నగుడి సమీపంలో చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. జూలపల్లి ఎస్సై వెంకటకృష్ణ కథనం ప్రకారం.. పెద్ది కనుకయ్య 20ఏళ్లుగా పొలం కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నాడు. ఈనెల10న ఐకేపీ సెంటర్ వద్ద అదే గ్రామానికి చెందిన పెద్ది వెంకటయ్యతో ధాన్యం కాంటా విషయంలో గొడవ జరిగింది.
ఈవిషయాన్ని పెద్దమనుషులకు చెబుతూ కనుకయ్య రోడ్డు వెంట వెళ్తున్నాడు. అయవతే, కనుకయ్య తమనే తిడుతున్నాడంటూ గ్రామానికి చెందిన అమరగొండ చంద్రయ్య, అమరగొండ లక్ష్మి, అమరగొండ సంతోష్ భావించారు. అతడిని నానా బూతులు తిట్టి, చేతులతో నెట్టివేశారు. అంతటితో ఆగకుండా లక్ష్మి వృద్ధుడిని చెప్పుతో కొట్టింది. దీంతో తీవ్రంగా మనస్తాపం చెందిన కనుకయ్య.. ఆరోజు రాత్రంతా నిద్రపోలేదు.
తనకు అవమానం జరిగిందని మానసికంగా కుంగిపోయాడు. శనివారం వేకువజామున 4గంటలకు ఇంట్లో నుంచి బయటకు వెళ్లాడు. తాను కౌలుకు తీసుకున్న వ్యవసాయ పొలం వద్ద చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ నలుగురి కారణంగానే తన భర్త ఆత్మహత్య చేసుకున్నాడని మృతుడి భార్య పెద్ది ఐలమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈమేరకు నలుగురిపై నమోదు చేసినట్లు ఎస్సై వివరించారు.
ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com