
సాక్షి, అనంతపురం: ఏపీలో రెడ్‌బుక్ రాజ్యాంగం నడుస్తోందన్నారు వైఎస్సార్‌సీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్. రాప్తాడు నియోజకవర్గంలో శాంతి భద్రతలు క్షీణించాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక ఫ్యాక్షన్ రాజకీయాలు ఎక్కువయ్యాయని అన్నారు.
మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ఇంటి వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. వైఎస్సార్‌సీపీ కార్యకర్త కురుబ లింగమయ్య మృతదేహానికి నివాళులు అర్పించేందుకు వెళ్తున్న గోరంట్ల మాధవ్‌ను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్, పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది. బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు పోలీసుల అనుమతి కావాలా అంటూ ఆయన ప్రశ్నించారు. తనును కావాలనే పోలీసులు అడ్డుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ క్రమంలోనే గోరంట్ల మాధవ్ మీడియాతో మాట్లాడుతూ..‘రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం కొనసాగుతోంది. వైఎస్సార్‌సీపీ నేత కురుబ లింగమయ్య దారుణ హత్యను ఖండిస్తున్నాం. టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీత సమీప బంధువులే ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. రాప్తాడు నియోజకవర్గంలో శాంతి భద్రతలు క్షీణించాయి. పరిటాల సునీత, పరిటాల శ్రీరామ్ బీసీ నేతలను టార్గెట్ చేశారు. వైఎస్ జగన్ హయాంలో హింసా రాజకీయాలు లేవు. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఫ్యాక్షన్ మొదలు పెట్టారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తున్న వారిని అడ్డుకోవడం దుర్మార్గం అంటే కామెంట్స్ చేశారు.

మరోవైపు.. కురుబ లింగమయ్య దారుణ హత్యను మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఈ సందర్బంగా తోపుదుర్తి మాట్లాడుతూ.. వైఎస్సార్‌సీపీలో కీలకంగా ఉన్నందుకే లింగమయ్యను హత్య చేశారు. టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీత హత్యా రాజకీయాలు చేస్తున్నారు. పరిటాల సునీతకు పోలీసులు తొత్తులుగా పనిచేస్తున్నారు అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.