
2014లో అరకు వైఎస్సార్‌సీపీ ఎంపీ అభ్యర్థిగా
కొత్తపల్లి గీతకు 4,13,191 ఓట్లు 2019లో జనజాగృతి పార్టీ
విశాఖ ఎంపీ అభ్యర్థిగా వచ్చిన ఓట్లు 1,158
ఆ ఎన్నికల్లో నోటాకు పోలైనవి 16,646 ఓట్లు
అతి తక్కువ ఓట్లతో ఆఖరి స్థానం
ప్రస్తుతం అరకు ఎంపీ బీజేపీ అభ్యర్థిగా ఎదురీత
సాక్షి, విశాఖపట్నం: ఆమె పేరు కొత్తపల్లి గీత. 2014లో అరకు పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి వైఎస్సార్‌సీపీ తరఫున ఎంపీగా గెలుపొందారు. అప్పట్లో ఆమెకు 4,13,191 ఓట్లు పోలయ్యాయి. సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి గుమ్మడి సంధ్యారాణిపై ఆమె 91,398 ఓట్ల మెజారిటీ సాధించారు. ఎంపీ అయిన కొన్నాళ్లకే ఆమె వైఎస్సార్‌సీపీని వీడారు. ఆపై 2018లో సొంతంగా జన జాగృతి పార్టీని స్థాపించారు. ఆ పార్టీ తరఫున 2019 ఎన్నికల్లో విశాఖపట్నం లోక్‌సభ స్థానం నుంచి బరిలో నిలిచారు. 2014లో అరకు నుంచి 4 లక్షలకు పైగా ఓట్లను, 90 వేలకు పైగా ఆధిక్యాన్ని సాధించిన ఆమె అదంతా తన బలంగా భావించారు. ఆ నమ్మకంతో 2019 ఎన్నికల్లో పోటీ చేసిన ఆమెకు తన సత్తా ఏపాటిదో తెలిసొచ్చింది. 2019 ఎన్నికలకు విశాఖ లోక్‌సభ నియోజకవర్గంలో 18,29,300 మంది ఓటర్లున్నారు.
వీరిలో 12,39,754 ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వీరిలో కొత్తపల్లి గీతకు 1,158 మంది మాత్రమే ఓట్లు వేశారు. ఇది మొత్తం ఓట్లలో 0.09 శాతం మాత్రమే కావడం విశేషం. దీంతో ఆమె డిపాజిట్లు కోల్పోవడమే కాదు.. నోటాకు పడిన ఓట్లలో ఒక శాతం కూడా పొందలేక పోయారు. 2019 విశాఖ లోక్‌సభ స్థానానికి 14 మంది పోటీ చేశారు. వీరందరిలో ఆమె అత్యల్పంగా 1,158 ఓట్లు మాత్రమే సాధించి 13 వ స్థానంలో నిలిచారు. మిగిలిన 12 మంది ఆమెకంటే ఎక్కువ ఓట్లను సాధించిన వారే! వీరిలో విజయం సాధించిన వైఎస్సార్‌సీపీ అభ్యర్థి ఎంవీవీ సత్యనారాయణకు 4,36,906 ఓట్లు లభించాయి. ఆ తర్వాత టీడీపీ అభ్యర్థి భరత్‌కు 4,32,492, జనసేన అభ్యర్థి వీవీ లక్ష్మీనారాయణకు 2,88,874, బీజేపీ అభ్యర్థి దగ్గుబాటి పురందేశ్వరికి 33,892, నోటాకు 16,646 ఓట్లు వచ్చాయి.
బలం తెలిసి.. బీజేపీలో చేరి..
2019 ఎన్నికల్లో ఘోర పరాజయంతో జనంలో తనకు వ్యక్తిగతంగా ఎంత బలముందో గీతకు తేటతెల్లమైంది. 2014లో వచ్చిన ఓట్లను చూసి తనను తాను అతిగా ఊహించుకున్న ఆమెకు అదంతా తన బలం కాదన్న వాస్తవం అర్థమైంది. దీంతో ఎన్నో ఆశలతో స్థాపించిన జన జాగృతి పార్టీకి మనుగడ లేదన్న నిర్ధారణకు వచ్చిన ఆమె ఆ పార్టీ చాప చుట్టేసి 2019 జూన్‌లో బీజేపీలో విలీనం చేశారు. తాను కూడా బీజేపీలో చేరిపోయారు.
అరకులో మరోసారి పరీక్ష
ఈసారి ఎన్నికల్లో కొత్తపల్లి గీత అరకు లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ అభ్యరి్థగా పోటీ చేస్తున్నారు. అరకు నుంచి మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. గత ఎన్నికల్లో కనీసం 1,200 ఓట్లు కూడా తెచ్చుకోలేని గీత ఈ ఎన్నికల్లో ఎలా విజయం సాధిస్తారోనని అరకు పార్లమెంటరీ నియోజకవర్గంతో పాటు ఉమ్మడి విశాఖ జిల్లా ఓటర్లు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. తొలిసారి ఎంపీగా పోటీ చేసి నాలుగు లక్షలకు పైగా ఓట్లతో గెలిచి.. ఆ తర్వాత ఎన్నికల్లో పోటీ చేసి వందల ఓట్లకు దిగజారిన అభ్యర్థి ఈమేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.