పోలీసులు పచ్చచొక్కాలు తొడుక్కున్నారు: గుడివాడ అమర్‌నాథ్‌ | Ysrcp Leader Gudivada Amarnath Fires On Tdp Leaders | Sakshi
Sakshi News home page

పోలీసులు పచ్చచొక్కాలు తొడుక్కున్నారు: గుడివాడ అమర్‌నాథ్‌

Published Tue, Apr 1 2025 9:22 PM | Last Updated on Tue, Apr 1 2025 9:33 PM

Ysrcp Leader Gudivada Amarnath Fires On Tdp Leaders

విశాఖపట్నం మేయర్ పదవిని అడ్డదోవలో దక్కించుకునేందుకు కూటమి పార్టీలు చేస్తున్న కుట్రలకు పోలీసులు పావులుగా మారుతున్నారని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు.

సాక్షి, విశాఖపట్నం: విశాఖపట్నం మేయర్ పదవిని అడ్డదోవలో దక్కించుకునేందుకు కూటమి పార్టీలు చేస్తున్న కుట్రలకు పోలీసులు పావులుగా మారుతున్నారని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. విశాఖ మేయర్‌పై అవిశ్వాస తీర్మానం సందర్బంగా పోలీసులతో వైఎస్సార్‌సీపీ కార్పోరేటర్లను ప్రలోభపెట్టడం, భయపెట్టడానికి తెలుగుదేశం నేతలు చేస్తున్న ప్రయత్నాలపై వైఎస్సార్‌సీపీ ప్రతినిధి బృందం జిల్లా కలెక్టర్‌ను కలిసి ఫిర్యాదు చేసింది.

అనంతరం కలెక్టరేట్ బయట గుడివాడ అమర్నాథ్ మీడియాతో మాట్లాడుతూ పోలీస్ అధికారులు పచ్చచొక్కాలు వేసుకున్నట్లుగా రాజకీయ ప్రయోజనాల కోసం చట్టాలను అతిక్రమించి పనిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైయస్ఆర్‌సీపీ కార్పోరేటర్ల ఇళ్ళకు అర్ధరాత్రి సమయాల్లో వెళ్ళి మహిళలను బెదిరించడం దారుణమని అన్నారు. ఇంకా ఆయనేమన్నారంటే..

అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఎటువంటి అరాచకాలకైనా పాల్పడవచ్చుననే ధీమాతో కూటమి నేతలు ఉన్నారు. వైఎస్సార్‌సీపీ మేయర్‌పై తెలుగుదేశం పార్టీకి మూడింట రెండొంతుల మెజార్టీ లేకపోయినప్పటికీ అవిశ్వాస తీర్మానం పెట్టారు. వైఎస్సార్‌సీపీ నుంచి గెలిచిన కొందరిని ప్రలోభపెట్టి తమవైపు తిప్పుకున్నారు. ఎన్ని చేసినప్పటికీ వైఎస్సార్‌సీపీకి చాలా స్పష్టమైన మెజారిటీ ఉంది. అయినా కూడా ఏదో ఒకటి చేసి మేయర్ పదవిని చేజిక్కించుకోవాలనే కుట్రతో కూటమి పార్టీలు పనిచేస్తున్నాయి.

ఈ నెల 19న అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు నోటీసులు జారీ చేశారు. వైఎస్సార్‌సీపీ కార్పోరేటర్లను బెదిరిస్తున్నారు. నిన్న ఒక కార్పోరేటర్ ఇంటికి రాత్రి సమయంలో పోలీసులను పంపి, వారి కుటుంబసభ్యులను బెదిరించారు. మహిళలను పోలీస్‌స్టేషన్‌కు రావాలని ఒత్తిడి చేశారు. పోలీసులు చట్టాలను కాపాడటానికి ఉన్నారా? తెలుగుదేశం పార్టీ కోసం పనిచేసేందుకు ఉన్నారా? ఖాకీ దుస్తులు తీసేసి, పచ్చచొక్కాలతో తెలుగుదేశం పార్టీకి సెక్యూరిటీ ఏజెన్సీగా పనిచేస్తున్నారా? దీనిపై జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశాం.

సత్తా ఉంటే అవిశ్వాసంలో బలం నిరూపించుకోవాలి
అవిశ్వాస తీర్మానంలో తెలుగుదేశం తమ బలం ఏమిటో నిరూపించుకోవాలి. భయపెట్టి, పోలీసులతో బెదిరింపులకు గురి చేసి పదవులను దక్కించుకోవాలని అనుకుంటున్నారు. ఎల్లకాలం పరిస్థితులు ఇలాగే ఉంటాయని అనుకోవద్దు. రాజకీయాల్లో మార్పు సహజం. అధికార యంత్రాంగం పనిచేయాల్సింది రాజకీయ పార్టీల కోసం కాదు. అంబేద్కర్ రాజ్యాంగం పరిధిలో పనిచేస్తారా? లేక లోకేష్ రెడ్‌బుక్ రాజ్యాంగం కోసం పనిచేస్తున్నారా?

విలువైన భూములను ప్రైవేటుపరం
విశాఖలోని విలువైన పదిహేను వందల కోట్ల రూపాయల భూములను లులూ సంస్థకు ఏకంగా తొంబై తొమ్మిది సంవత్సరాలకు నామమాత్రపు లీజుకే కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇదేనా సంపద సృష్టి అంటే? ప్రభుత్వ భూములను ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేయడంలో మీకున్న ప్రయోజనాలు ఏమిటీ? ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా, పీ4 అంటూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement