
ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం ఎలా ఉంది? అని ఓ సామాన్యుడిని ఓ విలేకరి అడిగారు. ‘‘ఓ బ్రహ్మాండంగా ఉందిగా...’’ అన్నది అతడి సమాధానం!. ‘‘ఏ ఏ స్కీములు అందాయి’’ అనే రిపోర్టర్ ప్రశ్నకు వచ్చిన జవాబు.. ‘‘ఒకటేమిటి అన్నీ అందాయి కదా!’’ అని!!! ఇదేమిటి ఇలా అంటున్నాడని ఆ విలేకరి మరో ప్రశ్న వేశారు. ‘‘రైతు భరోసా కింద నిధులు వచ్చాయా?’’ అంటే, ‘‘నలభై వేలు వచ్చాయి..’’ అని సమాధానమొచ్చింది. ‘‘హామీ ఇచ్చింది రూ.ఇరవై వేలే కదా..’’ అని రిపోర్టర్ ఆశ్చర్యపోతే.. ‘‘అవునండి.. రైతులు కష్టాలలో ఉన్నారని కూటమి ప్రభుత్వం రూ.నలభై వేలు ఇచ్చిందిలే..’’ అని నిట్టూరుస్తూ చెప్పాడు. అప్పుడు అర్థమైంది ఆ విలేకరికి.. ఆ సామాన్యుడి చమత్కారం!
కూటమి ప్రభుత్వంపై ప్రజల మాస్ ట్రోలింగ్ ఈ మధ్యకాలంలో బాగా పెరిగిపోయింది. ఇక కొందరు పిల్లలు ‘‘నాకు పదిహేను వేలు, నాకు పదిహేను వేలు ఎక్కడ ముఖ్యమంత్రి గారూ’’ అంటూ అడిగిన వీడియో కూడా పాపులర్ అయింది. మరో వ్యక్తి పశువులను చూపుతూ ‘‘నీకు పదిహేను వేలు, నీకు పదిహేను వేలు’’ అంటూ మరో వీడియో చేశారు. కొందరు మహిళలు ఒక ఆర్టీసీ బస్సు ఎక్కి గతంలో చంద్రబాబు చెప్పిన డైలాగుల వీడియో ప్రదర్శించారు. అందులో ‘‘మీ చంద్రన్న డ్రైవర్ అయ్యాడు. మీరు ఏ బస్సైనా ఎక్కండి.. పుట్టింటికి వెళ్లండి.. లేదా పని చేసే చోటకు వెళ్లండి.. ఎవరైనా టిక్కెట్ అడిగితే చంద్రన్న పేరు చెప్పండి’’ అని చంద్రబాబు చేసిన ప్రకటన ఉంది. ఏపీలో ప్రభుత్వం ఎంత హేళనకు గురి అవుతుందో ఈ ఉదాహరణలన్నీ తెలియ చేస్తాయి. అయితే..
సమాధానం చెప్పవలసిన టీడీపీ, జనసేన, బీజేపీ ప్రభుత్వం ఆ పని చేయకుండా, ఇలా ప్రశ్నించిన వారిపై కేసులు పెడుతోంది. పోలీసులు అలా మాట్లాడిన వారిని గుర్తించి పోలీస్ స్టేషన్లకు తీసుకువెళ్లి వేధిస్తున్నారన్న ఫిర్యాదులు వస్తున్నాయి. ఏపీలో ప్రజలు అత్యధిక శాతం తాము చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ తదితర నేతల చేతిలో మోసపోయామని, వారు చేసిన వాగ్దానాలు నమ్మి దెబ్బతిన్నామని, రెండికి చెడ్డ రేవడి అయ్యామని బాధ పడుతున్నారు. ఈ దశలో శాసనసభ్యులు మాత్రం తమ సాంస్కృతిక కార్యక్రమాలలో మాజీ ముఖ్యమంత్రి జగన్‌పై స్కిట్లు వేస్తూ తమ కుసంస్కారాన్ని ప్రదర్శించుకుంటున్నారన్న విమర్శలు ఎదుర్కొంటున్నారు.
జగన్ పేరు నేరుగా చెప్పకపోయినా అగౌరవంగా సంభోధిస్తూ.. జనసేన, బీజేపీ ఎమ్మెల్యేలు ఇద్దరు డైలాగులు చెప్పారు. ఆ క్రమంలో.. ‘‘లే..లే..నా రాజా..’’ అంటూ ఓ ఐటెమ్ సాంగ్‌ను పాడుకుని వెకిలి ఆనందం పొందారు. వారిద్దరూ ఏదో పిచ్చి స్కిట్ వేస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌లు పడి, పడి నవ్వుకుంటూ కూర్చున్నారు. పవన్ కళ్యాణ్ అయితే ఇంటికి వెళ్లినా నవ్వు ఆపుకోలేనని చెప్పారు. తోటి ఎమ్మెల్యేలపై ప్రభుత్వ కార్యక్రమంలో ఇలా నీచంగా ప్రదర్శనలు చేయవచ్చా? అనేది చాలామందికి వచ్చిన డౌటు. అందులో హాస్యం కన్నా వెకిలితనం ఎక్కువగా ఉందన్నది విశ్లేషకుల వ్యాఖ్య.
👉చిత్రం ఏమిటంటే.. ఇప్పుడు ఇలాంటి డ్రామాలు ఆడి వారిలో వారు సంతోషపడుతున్నారు కాని, ఎన్నికలకు ముందు నిజంగానే డ్రామాలు ఆడారు. ప్రజలను మాయ చేశారు. ఎక్కడలేని వాగ్దానాలు చేసి ప్రజలను బోల్తా కొట్టించామన్న ఆనందంలో కూటమి ఎమ్మెల్యేలు ఉండవచ్చు. కానీ ప్రజలు వీరి వికృత విన్యాసాలను జ్ఞప్తికి తెచ్చుకుని నిజంగానే వీరిని ఎద్దేవా చేస్తూ వ్యాఖ్యలు చేస్తున్నారు. శాసనసభలో ఒకరిద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు తప్ప ఎవరూ తామిచ్చిన హామీల గురించి ప్రభుత్వాన్ని ప్రశ్నించడం లేదు. గతంలో తాము ఇంటింటికి తిరిగి మరీ బాండ్లు పంచిన ఎమ్మెల్యేలకు, కూటమి నేతలకు ఆత్మ అనేది ఉంటే వాటిని గుర్తు చేసుకోవాలి.
👉ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొద్ది రోజుల క్రితం ఢిల్లీలో మాట్లాడుతూ తల్లికి వందనం స్కీము అమలు చేసేస్తున్నామనే భావన కలిగేలా మాట్లాడిన వీడియో చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. పిల్లలు ఎందరు ఉంటే అందరికి డబ్బులు ఇస్తున్నామని, పిల్లలు సంపాదించుకుంటున్నారని అంటున్నారు. మరో వైపు ఆయన కుమారుడు, విద్యా శాఖ మంత్రి లోకేష్ చట్టసభలో మాట్లాడుతూ లక్షల మంది విద్యార్ధులు ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీలలో తగ్గారని ఒక నిజాన్ని వెల్లడించారు. దానికి జగన్ ప్రభుత్వ విధానాలు అనే ఒక అబద్దాన్ని జత చేశారు. అంతే తప్ప తాము తల్లికి వందనం,తదితర పధకాలను హామీ ఇచ్చిన విధంగా అమలు చేయలేకపోతున్నామని మాత్రం చెప్పలేకపోయారు.
👉జగన్ టైమ్ లో ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్ధుల సంఖ్య పెరిగిందన్న విషయం మర్చిపోయి ఉండవచ్చు. కాని ఈ మద్య ఒక వీడియో వచ్చింది. పొలంలో కూలి పని చేసుకుంటున్న ఒక మహిళ ఒక బాలికను చూపుతూ.. డబ్బులు లేక స్కూల్ మాని పొలం పనికి వస్తోందని చెప్పింది. ఈ దృశ్యం హృదయ విదాకరంగా ఉంది. ఇలాంటి పరిస్థితిలో చేసిన బాసలను అధినేతలకు గుర్తు చేస్తూ స్కిట్‌లు ప్రదర్శించి ఉంటే బాగుండేది. లేదా మరో పని చేసి ఉండాల్సింది. ఎన్నికల ప్రచార సమయంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్‌లు ఎలాంటి స్పీచ్ లు ఇచ్చింది.. ప్రజలను ఎలా బోల్తా కొట్టించింది.. అన్న అంశాలపై నాటికలు ప్రదర్శించి ఉంటే చాలా రక్తి కట్టేవేమో! తాము ఎలా ప్రజలను మోసపూరిత హామీలతో నమ్మించింది చెప్పే స్కిట్‌లను వేసుకుని ఉండాల్సింది.
చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లు తల్లికి వందనం డబ్బులు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఎంతెంత ఇచ్చేది లెక్కలు వేసే చెప్పారు కదా. వలంటీర్లను కొనసాగిస్తామని, వారి పొట్టగొట్టమని, పదివేలకు గౌరవ వేతనం పెంచుతామని అధినేతలు చెప్పిన విషయాలను గుర్తు చేసుకుని సంబంధిత డ్రామాలు ప్రదర్శించుకుని ఉంటే అర్థవంతంగా ఉండేవేమో! లేదా ఆ వీడియోలను తెరపై ఒక్కసారి వేసుకుని చూసుకుని ఉంటే తెగ నవ్వు వచ్చేది కదా!.
'నీకు పదిహేను వేలు.. నీకు పదిహేను వేలు.. చిట్టి పాపా.. నీకు కూడా పదిహేను వేలు.." ఇది ఆంధ్రప్రదేశ్ లో బాగా ప్రచారంలోకి వచ్చిన డైలాగు. ప్రస్తుతం మంత్రిగా ఉన్న నిమ్మల రామానాయుడు ఆ రోజుల్లో ఇంటింటికి సైకిల్ వేసుకుని వెళ్లి మహిళలు, పిల్లలందరిని కలిసి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి రాగానే డబ్బులు తీసుకోవడమే ఆలస్యం అన్నట్లుగా కబుర్లు చెప్పి వచ్చారు. అలాగే యువతులు, గృహిణులు ఎవరు కనిపించినా..మీకు పద్దెనిమిది వేలు.. వలంటీర్ల దగ్గరకు వెళ్లి మీకు నెలకు పది వేలు ఖాయం అంటూ ఎన్నికల మానిఫెస్టో కరపత్రం అందించి మరీ చెప్పి వచ్చేవారు. అంతేకాదు..ప్రభుత్వం వచ్చిన వెంటనే హామీ అమలు పరుస్తామని, ఆ తర్వాత వలంటీర్లు తనకు స్వీట్లు, పూతరేకులు తెచ్చి తినిపంచాలని కూడా కోరారు.
ఆ సన్నివేశం ఒక్కటి చాలు బాగా పండడానికి. ఆ వీడియోలను చూసుకుని ఉంటే వారంత కడుపారా నవ్వుకునే వారేమో! .చంద్రబాబు అయితే ఒక అడుగు ముందుకు వేసి మీకు ఓపిక ఉంటే ఇంకా పిల్లలను కనండని, వారికి కూడా ఇదే విధంగా ఆర్థిక సాయం చేస్తామని చెప్పేవారు. ఎమ్మెల్యేలు పిల్లలు కనమంటున్న చంద్రబాబుకు సంబంధించి స్కిట్ వేసినట్లున్నారు కాని, ఆ పిల్లలకు తల్లికి వందనం ఈ ఏడాది ఎగ్గొట్టిన సంగతి మాత్రం చెప్పలేదు. సాంస్కృతిక ప్రదర్శనలో కొంతమంది వికృత విన్యాసాలకు బాగా సంతోషించిన పవన్ కళ్యాణ్ ఒక మాట చెప్పారు.
పిఠాపురం సభలో.. తనవల్లే టీడీపీ నిలబడిందని స్పీచ్ ఇచ్చినా, ఇక్కడ మాత్రం కారణం ఏమైనా, చంద్రబాబు మరో పదిహేనేళ్లు సీఎంగా కొనసాగాలని అంటూ పవన్ తన విధేయత ప్రదర్శించారు. చంద్రబాబు నుంచి చాలా నేర్పుకున్నానని ఆయన చెబుతుంటే బహుశా పరిపాలన కన్నా, ఇలా అబద్దాలు చెప్పి ప్రజలను ఏ విధంగా నమ్మించవచ్చు..ఆ తర్వాత ఎలా ఎగవేయవచ్చన్నది బాగానే నేర్చుకున్నారన్న భావన ఏర్పడుతోంది. సామాన్య ప్రజలు కూటమి ప్రభుత్వంపై వేస్తున్న ఛలోక్తులు సహజంగా ఉంటే.. ఎమ్మెల్యేల స్కిట్‌లు మాత్రం కృత్రిమంగా ఉన్నాయి.

:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.