
తమకు గిట్టనివారిపై కక్ష ఎలా తీర్చుకోవాలో, తమకు కావల్సిన వారిని ఎలా అందలం ఎక్కించాలో తెలుసుకోవాలంటే ఏపీకి వెళ్లాలి. అక్కడ జరుగుతున్న పరిణామాలు కచ్చితంగా కేస్ స్టడీ అవుతాయి. సాధారణంగా ప్రజాస్వామ్య వ్యవస్థను వ్యతిరేకించే తీవ్రవాద పార్టీలు రాజ్యంపై దాడులు చేస్తుంటాయి. కానీ, చిత్రంగా ఏపీలో అధికారంలో ఉన్న రాజకీయ కూటమి ప్రజలపై, ప్రతిపక్షంపైన ఇలాంటి దాడులకు పాల్పడుతోంది. ఈ క్రమంలో వారు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను, సినిమా కళాకారులను సైతం వదలడం లేదు. కూటమి ప్రభుత్వం ఏదో ఒక అక్రమ కేసు పెట్టి వేధింపులకు దిగుతోంది.
షాడో సీఎంగా భావిస్తున్న నారా లోకేష్ తీసుకు వచ్చిన రెడ్‌బుక్ రాజ్యాంగం ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తోంది. కొద్దిరోజుల క్రితం సీనియర్ ఐపీఎస్ అధికారి, గతంలో సీఐడీ అధిపతిగా పనిచేసిన దళిత అధికారి పీవీ సునీల్ కుమార్‌ను ప్రభుత్వం సస్పెండ్ చేయడం శోచనీయం. దానికి ప్రభుత్వం చెప్పిన కారణం వింటే ఆశ్చర్యం కలుగుతుంది. ఆయన గత ప్రభుత్వ సమయంలో అనధికారికంగా విదేశాలకు వెళ్లి వచ్చారట. ఆయన అలా టూర్ చేసినప్పుడు సున్నితమైన సమాచారం లీక్ అయ్యే అవకాశం ఉందట. బహుశా ఇలాంటి పిచ్చి కారణంతో ఏ రాష్ట్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ.. ఏ అధికారిపైనా ఇలాంటి చర్య తీసుకుని ఉండకపోవచ్చు. ఎందుకంటే సునీల్ కుమార్ విదేశాలకు వెళ్లడం, రావడం కూడా జరిగి కొన్నేళ్లు అయింది. ఎప్పుడూ ఆయనపై ఎలాంటి ఆరోపణలు రాలేదు. ఆయన వల్ల దేశానికి, లేదా రాష్ట్రానికి సంబంధించిన కీలక సమాచారం ఏదీ బయటకు వెళ్లినట్లు ఆరోపణలు రాలేదు.
కేంద్ర ప్రభుత్వం ఇలాంటి విషయాలలో ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటుంది. నిజంగా మన దేశ ప్రముఖులు ఎవరైనా కీలక సమాచారం లీక్ చేసే అవకాశం ఉందనుకున్నా, అభ్యంతరకరంగా వ్యవహరిస్తున్నారన్న అనుమానం ఉంటే వెంటనే చర్య తీసుకుంటుంది. అలాంటిది ఏమీ జరగలేదు. పైగా రాష్ట్రాలలో అంత ప్రమాదకరమైన సున్నిత సమాచారం ఏదీ ఉండదు. బాధ్యతాయుతమైన పోస్టులో ఉన్న సునీల్ కుమార్‌కు ఆ మాత్రం తెలియకుండా ఉండదు. అసలు కారణం ఏమిటంటే 2014-19 మధ్య తెలుగుదేశం ప్రభుత్వంలో జరిగిన పలు స్కాంలను పరిశోధించి, సాక్ష్యాధారాలతో సహా పలు కేసులు పెట్టడంలో సునీల్ కుమార్ ముఖ్య భూమిక పోషించారన్నది టీడీపీ పెద్దలకు ఉన్న కోపం. ఆ కేసులలో పనిచేసిన అప్పటి అధికారులు పలువురిపై ఇప్పటికే చంద్రబాబు ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగింది. కొందరికి పోస్టింగ్‌లు కూడా ఇవ్వలేదు. అంతేకాక డీజీపీ ఆఫీసుకు వచ్చి రిపోర్టు చేసి కూర్చోవాలని ఆదేశించింది. దీనిని రిటైర్డ్ ఐపీఎస్‌లు ఖండించారు కూడా. అయినా ప్రభుత్వం వెనక్కి తగ్గడం లేదు.

ఇక సునీల్ కుమార్‌పై ఏవైనా ఆరోపణలు చేసి కేసులు పెట్టాలని తెలుగుదేశం కూటమి ప్రభుత్వం గట్టి ప్రయత్నమే చేసి ఉంటుంది. ఇందుకోసం ఇద్దరు, ముగ్గురు రిటైర్డ్ పోలీసు అధికారులకు బాధ్యత అప్పగించిందని కూడా వార్తలు వచ్చాయి. అయినా సునీల్ కుమార్‌పై స్కాంల ఆరోపణలు చేయడానికి అవకాశం వచ్చినట్లు లేదు. దాంతో రెడ్ బుక్ సృష్టికర్తలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ఒత్తిడి తెచ్చి దళిత ఐపీఎస్ అధికారిని ఈ రకంగా సస్పెండ్ చేయించి ఉండవచ్చన్న అభిప్రాయం వస్తోంది. తీరా చూస్తే సునీల్ కుమార్ అనధికారంగా విదేశీ యాత్రలు చేయలేదని వెల్లడవుతోంది. ఆయన ప్రభుత్వం నుంచి అవసరమైన అనుమతులు తీసుకునే విదేశీ టూర్‌కు వెళ్లారు. ఆయన వ్యక్తిగత హోదాలోనే వెళ్లారు. అందుకు సొంతంగానే ఖర్చు పెట్టుకున్నారు. ప్రభుత్వం వద్ద ఏదైనా నిర్దిష్ట సమాచారం ఉంటే దానికి సంబంధించి ముందుగా సునీల్ కుమార్‌కు నోటీసు ఇవ్వాలి. కానీ, ఆ పని చేయకుండా సస్పెండ్ చేశారంటేనే అందులోని దురుద్దేశం అవగతమవుతుందని అనుభవజ్ఞులు చెబుతున్నారు.
సీనియారిటీ, ట్రాక్ రికార్డు రీత్యా ఏపీకి డీజీపీ అయ్యే అవకాశం ఉన్నందున, కేంద్రానికి తప్పుడు నివేదిక పంపేందుకు ఇలా సస్పెండ్ చేసి ఉండవచ్చని కొందరు రిటైర్డ్ ఐపీఎస్‌లు అభిప్రాయపడుతున్నారు. డీజీపీ స్థాయిలో ఉన్న అధికారి పట్ల ఇంత ఘోరంగా వ్యవహరించిన ప్రభుత్వం, ఒక చిన్నస్థాయి అధికారి పట్ల ఎంత ఉదారంగా వ్యవహరించిందో చూడండి. గతంలో చంద్రబాబు వద్ద వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేసిన వ్యక్తిపై స్కిల్ స్కాం కేసులో అభియోగాలు వచ్చాయి. ఆయనను విచారించాలని అప్పట్లో సీఐడీ తలపెట్టింది. దానిని గమనించిన తెలుగుదేశం పెద్దలు అతనిని ఢిల్లీ నుంచి చెప్పా పెట్టకుండా అమెరికాకు పంపించేశారని అంటారు. దాంతో విచారణకు ఆయన అందుబాటులోకి రాకపోవడంతో ప్రభుత్వం సస్పెండ్ చేసింది. కానీ, కూటమి అధికారంలోకి రావడంతోనే ఆ సస్పెన్షన్ ఎత్తివేయడమే కాకుండా మొత్తం జీతభత్యాలను చెల్లించేశారని మీడియాలో కథనాలు వచ్చాయి.
అంతేకాదు, ఈయన ఇంటిపై కేంద్ర ప్రభుత్వ ఆదాయపన్ను శాఖ దాడులు చేసి సుమారు రెండువేల కోట్ల అక్రమాలకు సంబంధించిన ఆధారాలు కనుగొన్నట్లు అప్పట్లో సీబీడీటీ ప్రకటించింది. ఆ తర్వాత కేసును విజయవంతంగా మేనేజ్ చేసుకున్నారు. అది వేరే సంగతి. అలాంటి వ్యక్తిపై ప్రభుత్వం సస్పెన్షన్ ఎలా ఎత్తివేస్తుందంటే ఏమి చెబుతాం. అదంతే.. మరో సీనియర్ ఐఏఎస్ అధికారి భాస్కర భూషణ్ అనే అధికారి టీడీపీ హయాంలో 2018లో అనుమతులు లేకుండానే విదేశాలకు వెళ్లి వచ్చారట. తదుపరి ఏడాదికి ఆయన తిరిగి వస్తే, అప్పటి ప్రభుత్వం విదేశీ యాత్రలకు ఆమోదం తెలిపిందంట. దీనిపై ఎవరు వివరణ ఇవ్వాలి?. గతంలో ఒక డాక్టర్ రోడ్డుపై నానా రచ్చగా వ్యవహరించి, పోలీసుల మాట వినకుండా ప్రవర్తిస్తే ఒక పోలీస్ కానిస్టేబుల్ అతని చేతులు కట్టి పోలీస్ స్టేషన్‌కు తీసుకువెళ్లారు. ఆ ఉదంతాన్ని వైఎస్ జగన్ ప్రభుత్వానికి ఆపాదిస్తూ, దళితులకు ఇంత అవమానం చేస్తారా అంటూ దుష్ప్రచారం చేశారు. దానికి ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి ఎల్లో మీడియా మరీ నీచంగా ఆనాటి ప్రభుత్వంపై విష ప్రచారం సాగించింది.
ఇప్పుడేమో ఒక దళిత సీనియర్ ఐపీఎస్ అధికారిపై మాత్రం ఇంత దారుణంగా కక్ష కట్టారు. దీనిపై రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్రంగా స్పందించారు. మంచి పేరున్న ఒక దళిత అధికారిని విద్వేషపూరితంగా సస్పెండ్ చేయడం ఏ మాత్రం సమంజసం కాదని ఆయన అన్నారు. ఇది కేవలం కోడిగుడ్డుపై ఈకలు పీకడమేనని అన్నారు. సునీల్ కుమార్ ఏమైనా గూఢచారి విభాగంలో ఉన్నారా, ఆయన ప్రతీ మూమెంట్ చెప్పడానికి అని ప్రశ్నించారు. ఆయనకు అనుమతులు ఇచ్చింది ప్రభుత్వమే కదా అని వ్యాఖ్యానించారు. సునీల్ ప్రజల ధనంతో టూర్ కు వెళ్లలేదని స్పష్టం చేశారు. చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ ప్రజల సొమ్ముతో ఎలా విదేశాలు తిరిగి వస్తున్నారని, వారిద్దరి టూర్ షెడ్యూల్ వెల్లడించాలని, ఎన్ని ఉల్లంఘనలు జరిగాయో తెలుస్తుందని కూడా ప్రవీణ్ సవాల్ చేశారు.

దళిత వర్గాల వారి పిల్లలు విదేశాలలో చదువుకోవద్దా?. ఆ పిల్లలను చూడడానికి దళితులు వెళ్లవద్దా?. ఆధిపత్య వర్గాలే విదేశాలకు వెళ్లాలా అని ఘాటుగా వ్యాఖ్యానించారు. ప్రవీణ్ కుమార్ అడిగే ప్రశ్నలకు ప్రభుత్వం వద్ద జవాబు ఉండదు. గూఢచర్య పరికరాల కొనుగోలు కేసులో ఆరోపణలు ఉన్న ఒక అధికారిని గత ప్రభుత్వం సస్పెండ్ చేస్తే, కూటమి ప్రభుత్వం దానిని ఎత్తివేయడమే కాకుండా, మొత్తం జీతం కూడా చెల్లించింది. అంత పెద్ద ఆరోపణ ఉన్నా తమకు మద్దతు ఇస్తున్నందున ఆ అధికారిపై కేసు ఎత్తివేయడం ఒకవైపు చేస్తూ, తమకు గిట్టని మరో అధికారిపై ఏదో ఒక పిచ్చి కారణం చూపి కేసులు పెట్టడం ద్వారా కూటమి ప్రభుత్వం అప్రతిష్ట పాలవుతోంది. దళిత సంఘాలు ఈ పరిణామాలపై మండిపడుతున్నాయి.
తెలుగుదేశం నేతలకు గత హయాంలో తప్పుడు కేసులు పెట్టారన్న సందేహం వస్తే దానిపై విచారణ చేయవచ్చు. ఆ స్కాంల ఆరోపణలకు సమాధానం చెప్పలేక ఇలా రెడ్ బుక్ ప్రయోగిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వంలో ఉన్నవారి కుంభకోణాలను సమర్ధంగా వెలుగులోకి తీసుకువస్తే ఇలాంటి కక్షలు ఎదుర్కోవలసి వస్తుందన్న భయం అధికారవర్గంలో ఏర్పడితే అది ప్రజాస్వామ్యానికి, సమాజానికి, అధికార వ్యవస్థకు ఎంత ప్రమాదమో ఆలోచించవలసిన పరిస్థితి ఏర్పడింది.
-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.