
ఇంగ్లండ్ పురుషుల వన్డే, టీ20 జట్టు కెప్టెన్‌గా స్టార్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ ఎంపికయ్యాడు. ఈ ఈ మేరకు ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు సోమవారం అధికారిక ప్రకటన చేసింది. ఇంగ్లండ్ వైట్ బాల్ కెప్టెన్‌గా జోస్ బట్లర్ స్ధానాన్ని బ్రూక్ భర్తీ చేయనున్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 తర్వాత ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల కెప్టెన్సీ కెప్టెన్సీ బట్లర్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.
వన్డే వరల్డ్‌కప్, ఛాంపియన్స్ ట్రోఫీలో పేలవ ప్రదర్శనను నైతిక బాధ్యత వహిస్తూ బట్లర్ ఈ నిర్ణయం తీసుకున్నాడు. కాగా హ్యారీ బ్రూక్ 2022లో అంతర్జాతీయ అరంగేట్రం చేసినప్పటి నుంచి ఇంగ్లండ్ భవిష్యత్తు కెప్టెన్‌గా ముందుకు సాగాడు. 2024లోనే జోస్ బట్లర్ డిప్యూటీగా బ్రూక్ ఎంపికయ్యాడు.
గతేడాది బట్లర్ గైర్హజరీలో ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లో ఇంగ్లీష్ జట్టు కెప్టెన్‌గా బ్రూక్ వ్యవహరించాడు. ఆ సిరీస్‌ను ఇంగ్లండ్ 3-2 తేడాతో కోల్పోయినప్పటికి బ్రూక్ మాత్రం తన కెప్టెన్సీతో అందరిని ఆకట్టుకున్నాడు. బట్లర్ తప్పుకున్నాక బ్రూక్‌నే ఇంగ్లండ్ తదుపరి కెప్టెన్‌గా ఎంపిక అవుతాడని అంతా భావించారు.
ఇప్పుడు అందరూ ఊహించిందే జరిగింది. ఇంగ్లండ్ తమ తదుపరి వైట్‌బాల్ సిరీస్ ఈ ఏడాది మేలో వెస్టిండీస్‌తో ఆడనుంది. ఈ సిరీస్‌తో ఇంగ్లండ్ వైట్ బాల్ జట్టు ఫుల్ టైమ్ కెప్టెన్‌గా బ్రూక్ తన ప్రయాణాన్ని ఆరంభించనున్నాడు.
26 ఏళ్ల హ్యారీ బ్రూక్ ఇంగ్లండ్ తరపున ఇప్పటివరకు 70 వైట్ బాల్ మ్యాచ్‌లు ఆడాడు. టీ20 ప్రపంచకప్-2022ను సొంతం చేసుకున్న ఇంగ్లండ్ జట్టులో అతడు భాగంగా ఉన్నాడు. ఇంగ్లండ్ కెప్టెన్‌గా ఎంపికైన అనంతరం బ్రూక్ స్పందించాడు. "ఇంగ్లండ్ వైట్ బాల్ కెప్టెన్‌గా ఎంపిక అవ్వడం నాకు దక్కిన అరుదైన గౌరవంగా భావిస్తున్నాను.
నేను బర్లీలో స్కూల్ క్రికెట్ ఆడుతున్నప్పటి నుంచి ఇంగ్లండ్ క్రికెట్ జట్టుకు ప్రాతినిథ్యం వహించాలని, ఏదో ఒక రోజున అవకాశము వస్తే నాయకత్వం వహించాలని కలలు కన్నాను. ఈ రోజు నా కల నేరవేరింది. నాకు ఎంతో మద్దతుగా నిలిచిన నా ఫ్యామిలీకి, అభిమానులకు, కోచ్‌లకు ధన్యవాదాలు. వీరిందరి వల్లే ఈ రోజు నేను ఈ స్ధాయికి చేరుకున్నాను. నా ప్రతీ విజయంలోనూ భాగమయ్యారు. ద్వైపాక్షిక సిరీస్‌లు, ప్రపంచకప్‌లు, ప్రధాన ఐసీసీ ఈవెంట్లలో ఇంగ్లండ్‌ను గెలుపు పథంలో నడిపించేందుకు నా వంతు కృషి చేస్తానని" ఓ ప్రకటనలో బ్రూక్ పేర్కొన్నాడు.
చదవండి: గిల్, సూర్య కాదు!.. టీమిండియా కెప్టెన్‌గా ఊహించని పేరు చెప్పిన కపిల్ దేవ్