ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల క్రికెట్ కెప్టెన్ జోస్ బట్లర్‌పై వేటు పడనుందంటూ గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. అతడి స్థానంలో ఓ యువ బ్యాటర్‌కు వన్డే, టీ20 పగ్గాలు అప్పగించాలని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు భావిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, ఇందులో నిజమెంత?!
వన్డే వరల్డ్‌కప్-2023, టీ20 ప్రపంచకప్-2024 టోర్నీల్లో డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన ఇంగ్లండ్ పూర్తిగా విఫలమైంది. భారత్ వేదికగా జరిగిన ఈ వన్డే ప్రపంచకప్‌లో తొమ్మిదింట కేవలం మూడే గెలిచి సెమీస్ కూడా చేరకుండానే నిష్క్రమించింది.
బట్లర్‌కు బైబై
ఇక అమెరికా- వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యమిచ్చిన పొట్టి క్రికెట్ ప్రపంచకప్‌లో సూపర్-8కు చేరుకునేందుకు ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి వచ్చింది. కష్టమ్మీద సెమీ ఫైనల్ చేరినప్పటికీ.. టీమిండియా చేతిలో చిత్తుగా ఓడి ఇంటిబాట పట్టింది. ఈ నేపథ్యంలో వన్డే, టీ20 కెప్టెన్‌ను మార్చే విషయమై ఇంగ్లండ్ క్రికెట్ డైరెక్టర్ రోబ్ కీ సంకేతాలు ఇచ్చినట్లు స్థానిక మీడియాలో వార్తలు వచ్చాయి.
ఈ క్రమంలో 33 ఏళ్ల బట్లర్‌ను తొలగించేందుకే ఇంగ్లండ్ బోర్డు మొగ్గుచూపుతుందనే ప్రచారం జరిగింది. అంతేకాదు.. బట్లర్ వారసుడిగా హ్యారీ బ్రూక్ పేరు తెరమీదకు వచ్చింది. ఈ వార్తలపై హ్యారీ బ్రూక్ తాజాగా స్పందించాడు.
నా స్థాయికి మించిన పదవి అది
‘‘వావ్.. నా స్థాయికి మించిన పదవి అది. కానీ దీని గురించి నాకేమీ తెలియదు. సూపర్‌చార్జర్స్‌కు తొలిసారిగా కెప్టెన్‌గా వ్యవహరించబోతున్నాను. ఆ బాధ్యతను ఎలా నిర్వర్తిస్తానో చూద్దాం. వచ్చే రెండునెలల పాటు మీతో మాట్లాడుతూనే ఉంటాను కదా!
అయితే, ఇంగ్లండ్ కెప్టెన్ కాబోతున్నానంటూ వస్తున్న వార్తల్లో వాస్తవం లేదు. ఇప్పట్లో కెప్టెన్సీ మార్పు ఉండబోదనే అనుకుంటున్నా’’ అని హ్యారీ బ్రూక్ పేర్కొన్నాడు. అదే విధంగా.. టెస్టు క్రికెట్‌కే తన మొదటి ప్రాధాన్యం అని స్పష్టం చేశాడు.
ప్రస్తుతం వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌తో బిజీగా ఉన్న ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. తదుపరి ‘ది హండ్రెడ్ లీగ్’లో పాల్గొనున్నాడు. నార్తర్న్ సూపర్‌చార్జర్స్ జట్టుకు సారథిగా బాధ్యతలు చేపట్టనున్నాడు. కాగా ఇదే జట్టుకు ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ ఆండ్రూ ఫ్లింటాఫ్ హెడ్‌కోచ్‌గా నియమితుడయ్యాడు.
భవిష్య హెడ్‌కోచ్‌గా ఫ్లింటాఫ్?
కాగా ఇంగ్లండ్ వన్డే, టీ20ల భవిష్య హెడ్‌కోచ్‌గా ఫ్లింటాఫ్ పేరు వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ది హండ్రెడ్ లీగ్‌లో అతడి మార్గదర్శనంలో 25 ఏళ్ల హ్యారీ బ్రూక్ కెప్టెన్‌గా పనిచేయడం గమనార్హం. ఇదిలా ఉంటే.. బెన్ స్టోక్స్ సారథ్యంలో వెస్టిండీస్‌తో స్వదేశంలో జరుగుతున్న టెస్టు సిరీస్‌ను ఇంగ్లండ్ ఇప్పటికే 2-0తో కైవసం చేసుకుంది. ఇరుజట్ల మధ్య మూడో టెస్టు శుక్రవారం(జూలై 26) నుంచి ఆరంభం కానుంది.
చదవండి: టీమిండియా మ్యాచ్‌లన్నీ లాహోర్‌లోనే!.. నో చెప్పిన ఐసీసీ!
Comments
Please login to add a commentAdd a comment