
Photo Courtesy: BCCI
ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో ముంబై ఇండియన్స్ ఎట్టకేలకు బోణీ కొట్టింది. నిన్న (మార్చి 31) సొంత మైదానంలో కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలి రెండు మ్యాచ్‌ల్లో సీఎస్‌కే, గుజరాత్ చేతుల్లో ఘోరంగా ఓడిన ఎంఐ.. కేకేఆర్‌తో మ్యాచ్‌లో అనూహ్యంగా పుంజుకుని సంతృప్తి పొందే విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ముంబై గెలుపులో అరంగేట్రం పేసర్ అశ్వనీ కుమార్ కీలకపాత్ర పోషించాడు.
అశ్వనీ 3 ఓవర్లలో 24 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. అశ్వనీతో పాటు దీపక్ చాహర్ (2-0-19-2), బౌల్ట్ (4-0-23-1), హార్దిక్ పాండ్యా (2-0-10-1), విజ్ఞేశ్ పుతుర్ (2-0-21-1), సాంట్నర్ (3.2-0-17-1) కూడా రాణించడంతో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన ముంబై కేకేఆర్‌ను 116 పరుగులకే కుప్పకూల్చింది.
కేకేఆర్ ఇన్నింగ్స్‌లో ఒక్కరు కూడా రాణించలేకపోయారు. రఘువంశీ చేసిన 26 పరుగులే (16 బంతుల్లో) అత్యధికం. ఆఖర్లో రమణ్‌దీప్ (12 బంతుల్లో 22) బ్యాట్ ఝులిపించడంతో కేకేఆర్ అతి కష్టం మీద 100 పరుగుల మార్కును దాటింది. కేకేఆర్ ఇన్నింగ్స్‌లో రఘువంశీ, రమణ్‌దీప్‌తో పాటు మనీశ్ పాండే (19), రింకూ సింగ్ (17), రహానే (11) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు. గత మ్యాచ్‌లో (రాజస్థాన్) సత్తా చాటిన డికాక్ ఈ మ్యాచ్‌లో తేలిపోయాడు. సునీల్ నరైన్ డకౌటయ్యాడు. కోట్టు పెట్టి కొన్న వెంకటేశ్ అయ్యర్ (3) తుస్సుమనిపించాడు. విధ్వంసకర వీరుడు రసెల్ (11 బంతుల్లో 5) విఫలమయ్యాడు.
అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ ఆడుతూపాడుతూ విజయం సాధించింది. తొలి రెండు మ్యాచ్‌ల్లో విఫలమైన ర్యాన్ రికెల్టన్ (41 బంతుల్లో 62 నాటౌట్; 4 ఫోర్లు, 5 సిక్సర్లు) ఈ మ్యాచ్‌లో సత్తా చాటాడు. సూర్యకుమార్ (9 బంతుల్లో 27 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) తన సహజ శైలిలో విధ్వంసం సృష్టించాడు. రోహిత్ శర్మ (12 బంతుల్లో 13) పేలవ ప్రదర్శన కొనసాగగా.. విల్ జాక్స్ (17 బంతుల్లో 16) నిరాశపరిచాడు. ముంబై 12.5 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. కేకేఆర్ బౌలర్లలో ఆండ్రీ రసెల్‌కు 2 వికెట్లు దక్కాయి.
మ్యాచ్ అనంతరం ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా మాట్లాడుతూ ఇలా అన్నాడు. ఈ గెలుపు సంతృప్తికరంగా ఉంది. హోం గ్రౌండ్‌లో గెలవడం మరింత ప్రత్యేకం. సమిష్టిగా రాణించాం. ప్రతి ఒక్కరు గెలుపులో భాగమయ్యారు. వికెట్ మేము ఊహించిన దానికంటే ఎక్కువగానే మాకు అనుకూలించింది. అశ్వనీ కూమార్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. పిచ్‌ను పరిశీలించాక అశ్వనీ తన సహజ శైలిలో బౌలింగ్ చేసినా సత్ఫలితాలు వస్తాయని అనుకున్నాము. అదే జరిగింది. అశ్వనీ లాంటి ఆణిముత్యాన్ని వెలికి తీసినందుకు మా స్కౌట్స్‌ను అభినంధించాలి.
ముంబై ఇండియన్స్ స్కౌట్స్ దేశం నలుమూలలా తిరిగి విజ్ఞేశ్ పుతుర్, అశ్వనీ కుమార్ లాంటి టాలెంటెడ్ కిడ్స్‌ను ఎంపిక చేశారు. ప్రాక్టీస్ సమయంలోనే అశ్వనీలోని టాలెంట్‌ను గమనించాము. అతని బౌలింగ్‌లో ప్రత్యేకమైన లేట్ స్వింగ్ ఉంది. పైగా అతను లెఫ్ట్ హ్యాండర్. అశ్వనీ తీసిన రసెల్ వికెట్ చాలా కీలకం. అతడు డికాక్ క్యాచ్‌ను అందుకున్న తీరు కూడా అద్భుతం. ఓ ఫాస్ట్ బౌలర్ అంత ఎత్తుకు ఎగిరి క్యాచ్ పట్టడం ఆషామాషీ కాదు. ముందు చెప్పినట్లు, సమిష్టిగా రాణించడం శుభసూచకం.