
Photo Courtesy: BCCI
ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా నిన్న (ఏప్రిల్ 5) రాత్రి పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ 50 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో రాయల్స్ అన్ని విభాగాల్లో సత్తా చాటి తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకుంది. టాస్ ఓడి ప్రత్యర్థి ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసిన రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 205 పరుగుల భారీ స్కోర్ చేసింది.
తొలి రెండు మ్యాచ్‌ల్లో విఫలమైన యశస్వి జైస్వాల్ (45 బంతుల్లో 67; 3 ఫోర్లు, 5 సిక్సర్లు) ఈ మ్యాచ్‌లో మెరుపు అర్ద సెంచరీతో సత్తా చాటాడు. సంజూ శాంసన్ (26 బంతుల్లో 38; 6 ఫోర్లు), రియాన్ పరాగ్ (25 బంతుల్లో 43 నాటౌట్; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) కూడా రాణించారు. ఆఖర్లో నితీశ్ రాణా (7 బంతుల్లో 12), హైట్‌మైర్ (12 బంతుల్లో 20), ధృవ్ జురెల్ (5 బంతుల్లో 13 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడి రాయల్స్ స్కోర్‌ను 200 దాటించారు.
కాగా, ఈ మ్యాచ్ జరుగుతున్న మహారాజా యాదవీంద్ర సింగ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో (ముల్లన్‌పూర్, చండీగఢ్) ఓ జట్టు (ఐపీఎల్‌లో) 200కు పైగా స్కోర్ చేయడం ఇదే మొదటిసారి. ఇక్కడ జరిగిన ఐదు ఐపీఎల్ మ్యాచ్‌ల్లో ఒక్కసారి కూడా 200 పరుగుల స్కోర్ నమోదు కాలేదు. తాజా ప్రదర్శన అనంతరం యాదవీంద్ర సింగ్ స్టేడియంలో 200 ప్లస్ స్కోర్ నమోదు చేసిన తొలి ఐపీఎల్ జట్టుగా రాజస్థాన్ రాయల్స్ చరిత్ర సృష్టించింది.
గత సీజన్‌లో పంజాబ్ కింగ్స్‌పై ముంబై ఇండియన్స్ చేసిన 192 పరుగులే ఈ మ్యాచ్‌కు ముందు వరకు ఈ మైదానంలో అత్యధిక స్కోర్‌గా ఉండింది. ఓవరాల్‌గా చూసినా ఈ మైదానంలో ఇది మూడో 200 ప్లస్ స్కోర్ మాత్రమే. ఈ మైదానంలో ఇప్పటివరకు (ఐపీఎల్ కలుపుకుని) 29 టీ20 మ్యాచ్‌లు జరిగాయి.
మహారాజా యాదవీంద్ర సింగ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో నమోదైన టాప్-5 అత్యధిక స్కోర్లు..
205/4 - రాజస్థాన్ రాయల్స్ vs పంజాబ్ కింగ్స్ (2025)
192/7 - ముంబై ఇండియన్స్ vs పంజాబ్ కింగ్స్ (2024)
183 ఆలౌట్ - పంజాబ్ కింగ్స్ vs ముంబై ఇండియన్స్ (2024)
182/9 - సన్‌రైజర్స్ హైదరాబాద్ vs పంజాబ్ కింగ్స్ (2024)
180/6 - పంజాబ్ కింగ్స్ vs సన్‌రైజర్స్ హైదరాబాద్ (2024)
చెలరేగిన ఆర్చర్
భారీ ఛేదనలో జోఫ్రా ఆర్చర్ తొలి ఓవర్‌లోనే పంజాబ్‌ను కోలుకోలేని దెబ్బకొట్టాడు. తొలి బంతికే ప్రియాన్ష్ ఆర్యను క్లీన్ బౌల్డ్ చేసిన ఆర్చర్.. ఓవర్ చివరి బంతికి ఇన్ ఫామ్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్‌ను కూడా ఆర్య తరహాలోనే క్లీన్ బౌల్డ్ చేశాడు.
ఆర్చర్‌తో పాటు (4-0-25-3) సందీప్ శర్మ (4-0-21-2), మహీశ్ తీక్షణ (4-0-26-2) కూడా రెచ్చిపోవడంతో పంజాబ్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 155 పరుగులు మాత్రమే చేయగలిగింది. నేహల్ వధేరా (41 బంతుల్లో 62; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), గ్లెన్ మ్యాక్స్‌వెల్ (21 బంతుల్లో 30; 3 ఫోర్లు, సిక్స్) పంజాబ్‌ను గట్టెక్కించే ప్రయత్నాలు చేయగా అవి ఫలించలేదు. వీరిద్దరు మినహాయంచి పంజాబ్ ఇన్నింగ్స్‌లో ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేదు.
రెండు వరుస విజయాల తర్వాత పంజాబ్‌కు ఈ సీజన్‌లో ఇది తొలి ఓటమి కాగా.. రెండు వరుస పరాజయాల తర్వాత రాయల్స్‌కు ఇది వరుసగా రెండో విజయం.