
నేడు రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో ‘ఢీ’
రాత్రి గం. 7:30 నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం
బెంగళూరు: ఐపీఎల్ 18వ సీజన్‌లో మెరుగైన ప్రదర్శన చేస్తున్న ఇరు జట్ల మధ్య సమరానికి రంగం సిద్ధమైంది. ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్... గురువారం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ)తో తలపడుతుంది. తాజా సీజన్‌లో జోరు మీదున్న ఆర్‌సీబీ నాలుగు మ్యాచ్‌లు ఆడి మూడింట గెలిచింది.
గత మ్యాచ్‌లో కెప్టెన్ రజత్ పాటీదార్, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి అర్ధశతకాలతో చెలరేగడంతో ముంబై ఇండియన్స్‌పై బెంగళూరు ఘన విజయం సాధించింది. ఇదే జోరు కొనసాగిస్తూ తమ చిరకాల స్వప్నం నెరవేర్చుకోవాలని బెంగళూరు భావిస్తోంది. బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లోనూ ఆర్‌సీబీ బలంగా ఉండగా... కొత్త సారథి అక్షర్ పటేల్ కెప్టెన్సీలో ఢిల్లీ క్యాపిటల్స్ పరాజయం ఎరగకుండా దూసుకెళ్తోంది.
ఇప్పటి వరకు ఒక్కసారి కూడా టైటిల్ నెగ్గలేకపోయిన ఇరు జట్లు ఈ సారి ట్రోఫీ చేజిక్కించుకోవడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నాయి. ఇతర మైదానాలతో పోల్చుకుంటే కాస్త చిన్నదైన చిన్నస్వామి స్టేడియంలో ఆతిథ్య ఆర్‌సీబీ అదరగొడుతుందా... లేక ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర కొనసాగిస్తుందా చూడాలి!
విరాట్‌పైనే భారం...
మునుపటి ఫామ్ అందిపుచ్చుకున్న విరాట్ కోహ్లి తిరిగి సాధికారికంగా ఆడుతుండటం బెంగళూరు జట్టుకు ప్రధాన బలం. ఫిల్ సాల్ట్ అడపా దడపా రాణిస్తుండగా... కెపె్టన్ రజత్ పాటీదార్, దేవదత్ పడిక్కల్ గత మ్యాచ్‌లో కీలక ఇన్నింగ్స్‌లతో విలువ చాటుకున్నారు. మిడిలార్డర్‌లో లివింగ్‌స్టోన్, జితేశ్ శర్మ, టిమ్ డేవిడ్ రూపంలో మంచి హిట్టర్లు అందుబాటులో ఉన్నారు.
ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో జితేశ్ కీలక ఇన్నింగ్స్ ఆడటంతోనే జట్టు భారీ స్కోరు చేయగలిగింది. ప్రత్యర్థి జట్టు ప్రధాన పేసర్ స్టార్క్‌ను ఈ దళం ఎలా ఎదుర్కొంటుందనే దానిపైనే మ్యాచ్ ఫలితం ఆధారపడి ఉంది. టి20ల్లో స్టార్క్‌పై కోహ్లికి మెరుగైన రికార్డు ఉంది. అతడి బౌలింగ్‌లో 31 బంతులు ఎదుర్కొన్న విరాట్ 72 పరుగులు చేశాడు.
మరి ఈ సీజన్‌లో ఆడిన 3 మ్యాచ్‌ల్లోనే 9 వికెట్లు తీసిన స్టార్క్‌ను కోహ్లి ఎలా ఎదుర్కొంటాడనేది ఆసక్తికరం. గత సీజన్‌లతో పోల్చుకుంటే బెంగళూరు బౌలింగ్ ఈసారి మెరుగ్గా కనిపిస్తోంది. హాజల్‌వుడ్, భువనేశ్వర్, యశ్ దయాళ్ పేస్ భారం మోయనుండగా... కృనాల్ పాండ్యా, సుయాశ్ శర్మ స్పిన్ బాధ్యతలు పంచుకోనున్నారు.
స్పిన్నర్లే బలం...
ఇంటా బయటా అనే తేడా లేకుండా చక్కటి ఆటతీరు కనబరుస్తున్న ఢిల్లీ క్యాపిటల్స్... బెంగళూరుపైనా అదే దూకుడు కొనసాగించాలని చూస్తోంది. ఓపెనర్ కేఎల్ రాహుల్ అనుభవానికి మరో ఓపెనర్ మెక్‌గుర్క్ మెరుపులు తోడవుతుండటంతో ఆ జట్టుకు మెరుగైన ఆరంభాలు దక్కుతున్నాయి. చిన్నస్వామి స్టేడియంపై మంచి అవగాహన ఉన్న కర్ణాటక ప్లేయర్ కేఎల్ రాహుల్ మరోసారి కీలకం కానున్నాడు.
ఇక వన్‌డౌన్‌లో అభిషేక్ పొరెల్ నమ్మదగ్గ ఆటగాడిగా ఎదుగుతున్నాడు. కెప్టెన్ అక్షర్ పటేల్, ట్రిస్టన్ స్టబ్స్, సమీర్ రిజ్వి, అశుతోష్ శర్మలతో మిడిలార్డర్‌లో ప్రతిభకు కొదవలేదు. ఈ మ్యాచ్‌లో ప్రధానంగా ఢిల్లీ మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌కు బెంగళూరు స్టార్ కోహ్లికి మధ్య ఆసక్తికర సమరం ఖాయమే. గత మూడు మ్యాచ్‌ల్లో కలిపి 8 ఓవర్లు వేసి ఒక్క వికెట్ కూడా పడగొట్టలేకపోయిన సారథి అక్షర్‌పై ఒకింత ఒత్తిడి ఉంది.
సహచరులు రాణిస్తున్న చోట అతడు కూడా బంతితో మెరవాల్సిన అవసరముంది. స్టార్క్, ముకేశ్ కుమార్, మోహిత్ శర్మ పేస్ బౌలింగ్ బాధ్యతలు పంచుకోనుండగా... అక్షర్, కుల్దీప్, విప్రాజ్ నిగమ్ స్పిన్ భారం మోయనున్నారు. మూడు మ్యాచ్‌ల అనుభవమే ఉన్న విప్రాజ్ నుంచి కూడా బెంగళూరు బ్యాటర్లకు ముప్పుపొంచి ఉంది.
తుది జట్లు (అంచనా)
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు: రజత్ పాటీదార్ (కెప్టెన్ ), సాల్ట్, కోహ్లి, పడిక్కల్, లివింగ్‌స్టోన్, జితేశ్ శర్మ, టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్, హజల్‌వుడ్, యశ్ దయాళ్, సుయాశ్ శర్మ.
ఢిల్లీ క్యాపిటల్స్: అక్షర్ పటేల్ (కెప్టెన్ ), మెక్‌గుర్క్, కేఎల్ రాహుల్, అభిషేక్ పొరెల్, సమీర్ రిజ్వీ, స్టబ్స్, అశుతోష్ శర్మ, విప్రాజ్ నిగమ్, స్టార్క్, కుల్దీప్, మోహిత్, ముకేశ్ కుమార్.