
Photo Courtesy: BCCI
సాక్షి, సిటీబ్యూరో: సచిన్ టెండూల్కర్, రిషబ్ పంత్ తర్వాత ఆ్రస్టేలియాలో శతకం సాధించిన మూడో అత్యంత పిన్న వయస్కుడిగా తెలుగు క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డి చరిత్రలో నిలిచాడు. ఆ మ్యాచ్‌కు ముందు విరాట్ కోహ్లీ తనకు కానుకగా ఇచ్చిన షూతో ఆడి సెంచరీ చేశానని నితీష్ వెల్లడించాడు. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ సీజన్‌లో హైదరాబాద్ జట్టు సన్ రైజర్స్ ఆల్‌రౌండర్‌గా నితీష్ కుమార్ రెడ్డి ఆడుతున్నాడు.
ఈ నేపథ్యంలో తను బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న ప్యూమా ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో తన క్రికెట్ అనుభవాలను పంచుకున్నాడు. విరాట్ కోహ్లీ ఇచ్చిన ప్రత్యేక బహుమతి మొదలు తన మొదటి టెస్ట్ అర్ధ శతకం తరువాత వేసిన పుష్పా స్టెప్ వరకూ నితీష్ పంచుకున్న అనుభవాలు ఆయన మాటల్లోనే..
కోహ్లీ షూ కోసం అబద్దం చెప్పాను..
‘డ్రెస్సింగ్ రూమ్‌లో కోహ్లీ.. సర్ఫరాజ్ ఖాన్ వద్దకు వచ్చి ‘సర్ఫూ, నీ షూ సైజ్ ఎంత?’ అని అడగ్గా.. తను ‘తొమ్మిది’ అని చెప్పాడు. తర్వాత నన్ను చూసి షూ నంబర్ ఎంత అన్నాడు. ఆ క్షణం ఎలాగైనా నా ఫేవరెట్ కోహ్లీ బూట్లు పొందాలనే ఆశతో నా సైజ్ కాకుండా ‘పది’ అని చెప్పాను. వెంటనే కోహ్లీ వాటిని నాకు ఇచ్చాడు. తదుపరి మ్యాచ్‌లో ఆ షూస్ వేసుకుని సెంచరీ కొట్టాను.
ఆ జ్ఞాపకం ఎప్పటికీ మర్చిపోలేను. 21 ఏళ్ల వయస్సులో మొదటి టెస్ట్ అర్ధ శతకాన్ని చేసిన తరుణంలో ఆ సంతోషాన్ని పుష్పా సినిమా తగ్గేదెలే అనే స్టయిల్లో సెలబ్రేట్ చేసుకున్నాను. ‘నేను తెలుగు సినిమా అభిమాని.. నేను తెలుగు వాడిని కాబట్టి టాలీవుడ్ అభిమానులు ఆనందించేలా సెలబ్రేట్ చేసుకున్నాను. తర్వాతి మ్యాచ్‌లలో కూడా మరికొన్ని సినిమా సెలబ్రేషన్స్ ప్లాన్ చేసుకున్నాను.
నా విజయంలో మామయ్య త్యాగం..
నా క్రికెట్ ప్రయాణంలో కుటుంబ ప్రాముఖ్యత ప్రధానమైనది. ఆర్థిక పరిస్థితులు అనుకూలించకపోయినా.. మా మామయ్య అండగా నిలిచాడు. ‘ఆర్థిక సమస్యల కారణంగా మా నాన్న నాకు స్పైక్ షూస్, క్రికెట్ బ్యాట్ కొనలేని సందర్భాల్లో మామయ్య తన తక్కువ జీతంలోనే నేను కోరుకున్న విరాట్ కోహ్లీ ధరించే షూస్ కొనిచ్చాడు. ఆ బూట్లు వేసుకుని మైదానంలో కోహ్లీలా ఫీలయ్యేవాడిని.
అలాంటిది 2024లో ప్యూమా ఇండియా బ్రాండ్ అంబాసిడర్‌గా మారడం గర్వంగా ఉంది. పాడ్‌కాస్ట్‌లో మామయ్యకు వీడియో కాల్ చేసి, ప్యూమా షూస్ గిఫ్ట్‌గా ఇస్తున్నట్టు తెలిపాను. ఆయన చేసిన త్యాగం తీర్చలేనిది.. ఇది ఆయనను సంతోషపెట్టడానికి నా చిన్న ప్రయత్నం.
కాగా, గత సీజన్ రన్నరప్ అయిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ఈ సీజన్‌ను మెరుపు విజయంతో ప్రారంభించింది. సొంత మైదానంలో రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆరెంజ్ ఆర్మీ 44 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ ఇషాన్ కిషన్ సుడిగాలి సెంచరీతో విరుచుకుపడటంతో 286 పరుగుల రికార్డు స్కోర్ చేసింది. సన్‌రైజర్స్ భారీ స్కోర్‌లో నితీశ్ కూడా భాగమయ్యాడు. 15 బంతుల్లో 4 ఫోర్లు, సిక్సర్ సాయంతో 30 పరుగులు చేశాడు.
దాదాపుగా అసాధ్యమైన లక్ష్యం కావడంతో రాయల్స్ ఛేదనలో తడబడింది. అయినా ఆ జట్టు అద్భుతంగా పోరాడి 20 ఓవర్లలో 242 పరుగులు చేయగలిగింది. సంజూ శాంసన్, దృవ్ జురెల్ మెరుపు అర్ద సెంచరీలతో పోరాడారు. సన్‌రైజర్స్ తమ తదుపరి మ్యాచ్‌ను లక్నో సూపర్ జెయింట్స్‌తో ఆడుతుంది. ఈ మ్యాచ్ మార్చి 27న హైదరాబాద్‌లోనే జరుగనుంది.