
Photo Courtesy: BCCI/GT X
గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (Shubman Gill)పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఓవైపు తమ ఫీల్డర్ నొప్పితో విలవిల్లాడుతుంటే... అతడు మాత్రం ప్రత్యర్థి జట్టు బ్యాటర్‌తో కలిసి నవ్వులు చిందించడం ఇందుకు కారణం. అసలేం జరిగిందంటే.. ఐపీఎల్-2025 (IPL 2025)లో భాగంగా గుజరాత్ ఆదివారం సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో తలపడింది.
ఆరంభంలోనే షాకులు
ఉప్పల్ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన గుజరాత్ కెప్టెన్ గిల్ తొలుత బౌలింగ్ ఎంచుకోగా.. బౌలర్లు అతడి నమ్మకాన్ని వమ్ముకానీయలేదు. రెండో ఓవర్ మొదటి బంతికే ఓపెనర్ ట్రవిస్ హెడ్ (8)ను పెవిలియన్‌కు పంపిన టైటాన్స్ పేసర్ మహ్మద్ సిరాజ్.. తదుపరి ఐదో ఓవర్ నాలుగో బంతికి మరో ఓపెనర్ అభిషేక్ శర్మ (18)ను కూడా అవుట్ చేశాడు.
ఈ క్రమంలో వన్‌డౌన్ బ్యాటర్ ఇషాన్ కిషన్ (Ishan Kishan) నిలదొక్కుకునే ప్రయత్నం చేసి విఫలమయ్యాడు. ఎనిమిదో ఓవర్ రెండో బంతికి టైటాన్స్ మరో పేసర్ ప్రసిద్ కృష్ణ బౌలింగ్‌లో 17 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నిష్క్రమించాడు. అయితే, అంతకంటే ముందు.. అంటే ఆరో ఓవర్‌లో ప్రసిద్ కృష్ణ బౌలింగ్‌లో నాలుగో బంతిని ఇషాన్ ఎదుర్కొన్నాడు.
గ్లెన్ ఫిలిప్స్‌నకు గాయం
అవుట్ సైడ్ ఆఫ్ దిశగా ప్రసిద్ వేసిన షార్ట్ బాల్‌ను పాయింట్ వైపు తరలించగా.. అక్కడ ఫీల్డింగ్ చేస్తున్న టైటాన్స్ స్టార్ గ్లెన్ ఫిలిప్స్ బంతిని ఆపే క్రమంలో గాయపడ్డాడు. మైదానంలో కుప్పకూలి నొప్పితో విలవిల్లాడగా.. వాషింగ్టన్ సుందర్ అతడికి దగ్గరికి పరిగెత్తుకు వచ్చాడు. ఇంతలో ఫిజియో కూడా వచ్చి ఫిలిప్స్‌ను పరీక్షించి.. మైదానం బయటకు తీసుకువెళ్లాడు.
ఇషాన్- గిల్ నవ్వులు
అయితే, ఆ సమయంలో నితీశ్ రెడ్డితో కలిసి సింగిల్ పూర్తి చేసుకున్న ఇషాన్ కిషన్ దగ్గరికి వెళ్లిన గిల్.. అతడితో నవ్వుతూ ముచ్చటించాడు. ఇషాన్ తన భుజంపై చేయి వేయగా.. గిల్ కూడా నవ్వులు చిందిస్తూ సరదాగా సంభాషిస్తున్నట్లుగా ఉన్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ క్రమంలో గిల్ తీరుపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
glenn phillips is lying in pain and these two buddies are gossiping like they're in some college park 😭😭😭#SRHvGT pic.twitter.com/172aqoAtM4
— 🍂 (@jaaniyeeex) April 6, 2025
మీకసలు మానవత్వం ఉందా?
‘‘సొంత జట్టు ఆటగాడు గాయపడి.. నొప్పితో బాధపడుతుంటే.. కెప్టెన్ మాత్రం ఇలా ప్రత్యర్థి జట్టు ఆటగాడితో ముచ్చట్లు పెడుతున్నాడు. ఆటగాళ్ల మధ్య స్నేహం తప్పు కాదు. కానీ పరిస్థితికి తగ్గట్లుగా హుందాగా , కాస్త మానవత్వంతో వ్యవహరించాలి. మ్యాచ్ అయిపోయిన తర్వాత కావాల్సినంత సేపు జోకులు వేసుకోవచ్చు’’ అంటూ గిల్‌కు చురకలు అంటిస్తున్నారు.
కాగా ఇషాన్- శుబ్‌మన్ గిల్ అండర్-19 స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయిలోనూ ఓపెనింగ్ జోడీగా రాణించారు. వీరిద్దరి మధ్య గాఢమైన స్నేహబంధం ఉంది. అయితే, టైటాన్స్- రైజర్స్ మ్యాచ్ సందర్భంగా ఓ ఆటగాడు గాయపడిన వేళ.. ఇలా నవ్వులు చిందిస్తూ మాట్లాడుకోవడం వీరిపై విమర్శలకు దారితీసింది.
Left national team to chase IPL money. Got injured without playing a ball.
- Glenn Phillips proving once again, greed has its own price. 🥲 #GTvSRH
pic.twitter.com/S0urYUhW7q— MUHAMMAD SAMI (@mrsalaar96) April 6, 2025
కానీ ఓ ట్విస్ట్!
అయితే, అప్పటికి ఫిలిప్స్ పరిస్థితిని గిల్ చూడకపోవడం గమనార్హం. విషయం తెలిసిన వెంటనే అతడు తమ ఫీల్డర్ దగ్గరికి వెళ్లినట్లు కనిపించింది. దీంతో.. ‘‘తెలిసీ తెలియక మాట్లాడవద్దు’’ అంటూ ట్రోలర్స్‌కు గిల్ ఫ్యాన్స్ కౌంటర్లు ఇస్తున్నారు.
ఇదిలా ఉంటే.. సన్‌రైజర్స్ టాపార్డర్ అభిషేక్ శర్మ(18), ట్రవిస్ హెడ్ (8), ఇషాన్ కిషన్ (17) మరోసారి విఫలం కాగా.. నితీశ్ రెడ్డి 34 బంతుల్లో 31 పరుగులు చేశాడు. ఇతరులలో హెన్రిచ్ క్లాసెన్ (19 బంతుల్లో 27), కెప్టెన్ ప్యాట్ కమిన్స్ (9 బంతుల్లో 22 నాటౌట్) కాస్త వేగంగా ఆడారు. ఫలితంగా సన్‌రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది.
గిల్ సూపర్ బ్యాటింగ్
టైటాన్స్ పేసర్లు మహ్మద్ సిరాజ్ నాలుగు వికెట్లతో రైజర్స్ బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించగా.. ప్రసిద్ కృష్ణ, సాయి కిషోర్ రెండేసి వికెట్లు తమ ఖాతాలో వేసుకున్నారు. ఇక రైజర్స్ విధించిన నామమాత్రపు లక్ష్యాన్ని టైటాన్స్ 16.4 ఓవర్లలోనే ఛేదించింది.
ఓపెనర్ శుబ్‌మన్ గిల్ (43 బంతుల్లో 61 నాటౌట్) అద్భుత అర్థ శతకం సాధించగా.. వాషింగ్టన్ సుందర్ (29 బంతుల్లో 49), షెర్ఫానే రూథర్‌ఫర్డ్ (16 బంతుల్లో 35 నాటౌట్) అదరగొట్టారు. ఫలితంగా ఏడు వికెట్ల తేడాతో గుజరాత్ టైటాన్స్ గెలుపొందింది. రైజర్స్ బౌలర్లలో మహ్మద్ షమీకి రెండు, కమిన్స్‌కు ఒక వికెట్ దక్కాయి.
3️⃣ wins on the trot 💙
A commanding 7️⃣-wicket win over #SRH takes #GT to the second spot in the #TATAIPL 2025 points table 🆙
Scorecard ▶ https://t.co/Y5Jzfr6Vv4#SRHvGT | @gujarat_titans pic.twitter.com/tYB1Dt5mdd— IndianPremierLeague (@IPL) April 6, 2025
చదవండి: ఇలా వచ్చి.. అలా వెళ్లారు.. అసలేం చేస్తున్నారు? కావ్యా మారన్ రియాక్షన్ వైరల్