‘ట్రావిషేక్‌’ మళ్లీ ఫెయిల్‌!.. ఇదేం బ్యాటింగ్‌? సహనం కోల్పోయిన కావ్యా | SRH Kavya Maran Left Frustrated Head Abhishek Dismissals Vs GT Viral | Sakshi
Sakshi News home page

ఇలా వచ్చి.. అలా వెళ్లారు.. అసలేం చేస్తున్నారు? కావ్యా మారన్‌ రియాక్షన్‌ వైరల్‌

Published Mon, Apr 7 2025 10:37 AM | Last Updated on Mon, Apr 7 2025 11:04 AM

SRH Kavya Maran Left Frustrated Head Abhishek Dismissals Vs GT Viral

Photo Courtesy: BCCI/IPL

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఆట తీరు రోజురోజుకీ అధ్వానంగా తయారవుతోంది. ఐపీఎల్‌-2025 (IPL 2025)లో ఇప్పటికే హ్యాట్రిక్‌ పరాజయాలు నమోదు చేసిన కమిన్స్‌ బృందం.. తాజాగా గుజరాత్‌ టైటాన్స్‌ చేతిలో ఓటమిపాలైంది. సొంత మైదానం ఉప్పల్‌లో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ఏడు వికెట్ల తేడాతో ఓడిపోయింది.

సమిష్టి వైఫల్యంతో పరాజయాల సంఖ్యను నాలుగుకు పెంచుకుని పాయింట్ల పట్టికలో అట్టడుగున కొనసాగుతోంది. ఇందుకు ప్రధాన కారణం టాపార్డర్‌ దారుణంగా విఫలం కావడమే. 

ముఖ్యంగా విధ్వంసకర ఓపెనర్లుగా పేరొందిన అభిషేక్‌ శర్మ (Abhishek Sharma), ట్రవిస్‌ హెడ్‌ (Travid Head) దూకుడుగా ఆడే క్రమంలో వికెట్‌ పారేసుకోవడం.. జట్టులోకి కొత్తగా వచ్చి వన్‌డౌన్‌లో ఆడుతున్న టీమిండియా స్టార్‌ ఇషాన్‌ కిషన్‌ కూడా వరుస మ్యాచ్‌లలో చేతులెత్తేయడం తీవ్ర ప్రభావం చూపుతోంది.

టాపార్డర్‌ మరోసారి కుదేలు
గుజరాత్‌ టైటాన్స్‌తో మ్యాచ్‌లోనూ ఈ బ్యాటింగ్‌ త్రయం దారుణంగా విఫలమైంది. అభిషేక్‌ 16 బంతుల్లో 18 చేసి నిష్క్రమించగా.. హెడ్‌ ఐదు బంతులు ఎదుర్కొని కేవలం 8 పరుగులే చేశాడు. ఈ ఇద్దరి వికెట్లను హైదరాబాదీ స్టార్‌, గుజరాత్‌ పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ తన ఖాతాలో వేసుకున్నాడు.

 

సహనం కోల్పోయిన కావ్యా మారన్‌
ఇక ఓపెనర్ల వరుస వైఫల్యాలతో విసుగెత్తిన సన్‌రైజర్స్‌ యజమాని కావ్యా మారన్‌ తీవ్ర నిరాశకు గురయ్యారు. ‘‘అసలు మీరు ఏం చేస్తున్నారు? ఇంత  ఘోరంగా అవుటవుతారా? ఇదేం బ్యాటింగ్‌’’ అన్నట్లుగా హావభావాలు పలికిస్తూ తలను బాదుకున్నారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

సిరాజ్‌ ‘స్ట్రోక్‌’
ఇక మ్యాచ్‌ విషయానికొస్తే.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన సన్‌రైజర్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. అభిషేక్‌ శర్మ (18), ట్రవిస్‌ హెడ్‌ (8), ఇషాన్‌ కిషన్‌ (17) మరోసారి చేతులెత్తేయగా.. నితీశ్‌ రెడ్డి (31) రాణించాడు. హెన్రిచ్‌ క్లాసెన్‌ (19 బంతుల్లో 27), కమిన్స్‌ (9 బంతుల్లో 22) వేగంగా ఆడి స్కోరును 150 పరుగుల మార్కు దాటించారు.

గుజరాత్‌ బౌలర్లలో లోకల్‌ బాయ్‌ సిరాజ్‌ నాలుగు వికెట్లతో చెలరేగగా.. ప్రసిద్‌ కృష్ణ, సాయి కిషోర్‌ రెండేసి వికెట్లు కూల్చారు. లక్ష్య ఛేదనకు దిగిన గుజరాత్‌కు రైజర్స్‌ పేసర్‌ షమీ ఆరంభంలోనే షాకిచ్చాడు. ఓపెనర్‌ సాయి సుదర్శన్‌ను 5 పరుగులకే పెవిలియన్‌కు పంపించాడు.

గిల్‌, వాషీ,  రూథర్‌ఫర్డ్‌ ధనాధన్‌
అదే విధంగా.. ప్రమాదకర బ్యాటర్‌ జోస్‌ బట్లర్‌ను కెప్టెన్‌ కమిన్స్‌ డకౌట్‌ చేశాడు. అయితే, రెండు కీలక వికెట్లు తీసిన ఆనందం సన్‌రైజర్స్‌కు ఎక్కువ సేపు నిలవలేదు. ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌ (43 బంతుల్లో 61 నాటౌట్‌) కెప్టెన్‌ ఇన్నింగ్స్‌తో మెరవగా.. నాలుగో స్థానంలో వచ్చిన ఆల్‌రౌండర్‌ వాషింగ్టన్‌ సుందర్‌ ధనాధన్‌ (29 బంతుల్లో 49) దంచికొట్టాడు.

ఆఖర్లో షెర్ఫానే రూథర్‌ఫర్డ్‌ (16 బంతుల్లో 6 ఫోర్లు, ఒక సిక్సర్‌ సాయంతో 35) తన పవర్‌ హిట్టింగ్‌తో గిల్‌తో కలిసి జట్టును విజయతీరాలకు చేర్చాడు. గిల్‌, వాషీ, రూథర్‌ఫర్డ్‌ ఇన్నింగ్స్‌ కారణంగా 16.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించిన గుజరాత్‌ ఏడు వికెట్ల తేడాతో సన్‌రైజర్స్‌పై విజయఢంకా మోగించింది.

 

చదవండి: SRH VS GT: వారి పేసర్లను ఎదుర్కోవడం మా బ్యాటర్ల వల్ల కాలేదు: కమిన్స్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement