
15 ఏళ్ల క్రితం బంజారాహిల్స్‌లో అమెరికన్‌పై అత్యాచారం
క్లింటన్ ఫౌండేషన్‌లో పనిచేసేందుకు నగరానికి వచ్చిన మహిళ
పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేసినా ఫలితం శూన్యం
సాక్షి, హైదరాబాద్: రాచకొండ పోలీసు కమిషనరేట్‌లోని పహాడీషరీఫ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జర్మన్ యువతిపై జరిగిన అఘాయిత్యం రాజధానిలో తీవ్ర కలకలం సృష్టించింది. 15 ఏళ్ల క్రితం హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలోని బంజారాహిల్స్‌లో ఓ విదేశీ యువతిపై అత్యాచారం జరిగింది.
అమెరికా నుంచి వచ్చి, బేగంపేటలోని క్లింటన్ ఫౌండేషన్‌లో న్యూట్రీషన్‌గా పనిచేసిన బాధితురాలిపై 2010 జూలై 7న ఓ వ్యక్తి దారుణానికి ఒడిగట్టాడు. అప్పట్లో ఈ కేసు తీవ్ర సంచలనంగా మారడంతో ఏకంగా రాష్ట్ర డీజీపీ రంగంలోకి దిగారు. ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి, అన్ని కోణాల్లో దర్యాప్తు చేసినా నిందితుడిని మాత్రం పట్టుకోలేకపోయారు.
తుపాకీ చూపించి అత్యాచారం...
అమెరికాకు చెందిన సదరు యువతి (అప్పట్లో 25 ఏళ్లు) ఉద్యోగ నిమిత్తం 2009లో నగరానికి వచ్చింది. బంజారాహిల్స్ రోడ్డు నెం. 11లోని ఓ ఇంటి పెంట్‌హౌజ్‌లో ఏడాదిన్నర పాటు నివసించింది. ఎప్పటిలాగే తన విధులు ముగించుకుని 2010 జూలై 6 రాత్రి 8 గంటలకు తన ఇంటికి చేరుకుంది.
తలుపులు లోపల నుంచి తాళం వేసుకుని నిద్రించింది. తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో దాదాపు 30 ఏళ్ల వయసున్న యువకుడు కిటికీ గ్రిల్ తొలగించి లోపలకు ప్రవేశించాడు. బెడ్‌రూమ్‌లోకి వెళ్లి రివాల్వర్ చూపిస్తూ అరిస్తే చంపేస్తానని బెదిరించాడు. అనంతరం ఆమెపై అత్యాచారం చేసి పారిపోయాడు. ఉదయం బాధితురాలు నేరుగా ఆస్పత్రికి వెళ్లడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
తెలిసిన వారిగా ఆధారాలు లభించినా...
ఈ కేసు దర్యాప్తు కోసం నాటి పోలీసు కమిషనర్ ఏకే ఖాన్ ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. ఘాతుకం జరిగిన రోజు యువతి అల్మారాలో రూ.5 లక్షలు ఉన్నాయి. ఆమె ఇంట్లోకి ప్రవేశించిన ఆగంతకుడు తొలుత ఆ డబ్బు గురించే అడిగాడు. దీంతో ఆమెకు తెలిసిన వ్యక్తే ఈ పని చేసినట్లు పోలీసులు అనుమానించారు. ఆ అమెరికన్ అప్పట్లో బేగంపేటలోని ఓ జిమ్‌కు వెళ్లేవారు. అక్కడ ఆమెతో సన్నిహితంగా మెలిగే కొందరిని అనుమానించారు. క్లూస్ టీమ్ నిపుణులు ఘటనా స్థలి నుంచి 14 ఆధారాలు సేకరించారు.
ఎన్ని రకాలుగా దర్యాప్తు చేసినా... కేసు మాత్రం కొలిక్కిరాలేదు. ఆ యువతి తన స్వదేశానికి వెళ్లిపోతూ ‘ఫ్రమ్ పాస్ట్ ఫ్యూ ఇయర్స్ ఐ హావ్ స్వీట్ మెమరీస్ ఇన్ హైదరాబాద్. బట్.. దిస్ ఇన్సిడెంట్ ఈజ్ ఎ బ్యాడ్ మెమరీ ఫర్ మీ’ (హైదరాబాద్‌లో కొంతకాలంగా ఎన్నో తీపి జ్ఞాపకాలు భద్రపర్చుకున్నా. ఈ దురదృష్టకర ఘటన చేదు గుర్తుగా మిగిలిపోయింది) అని పోలీసులతో అన్న మాటలు ఇప్పటికీ అధికారులను వెక్కిరిస్తూనే ఉన్నాయి.
‘విదేశీ’ కేసులపై ప్రత్యేక చట్టం తేవాలి..
విదేశీయులపై జరిగే నేరాలకు సంబంధించిన కేసులు దేశంలో తక్కువగానే నమోదవుతున్నాయి. అత్యాచారం వంటి ఉదంతాలు అరుదు. అనేక కేసుల్లో నిందితులు చిక్కుతున్నా.. ఈ కేసుల్లో శిక్షలు పడే శాతం మాత్రం దారుణంగా ఉంటోంది. బాధితులు తమ దేశాలకు వెళ్లిపోయిన తర్వాత కేసు విచారణను పట్టించుకోకపోవడమే దీనికి ప్రధాన కారణం.
ప్రతి కేసుకూ ఫాస్ట్‌ట్రాక్ కోర్టు పెట్టడం సాధ్యం కాకపోవడంతో విచారణకు చాలా సమయం పడుతోంది. ఇవన్నీ నేరగాళ్లకు కలిసి వస్తున్నాయి. విదేశీయులపై జరిగే నేరాలకు సంబంధించి ప్రత్యేక చట్టం, కోర్టులు అమలులోకి తీసుకువస్తే ఈ పరిస్థితులు మారే అవకాశం ఉంది. – పి.రామకృష్ణ, మాజీ డీఎస్పీ