పేరు గొప్పగుంది.. అప్పు పుట్టకుంది: సీఎం రేవంత్‌ | CM Revanth Reddy Comments In Praja Palana | Sakshi
Sakshi News home page

పేరు గొప్పగుంది.. అప్పు పుట్టకుంది: సీఎం రేవంత్‌

Published Fri, Mar 21 2025 5:40 AM | Last Updated on Fri, Mar 21 2025 5:40 AM

CM Revanth Reddy Comments In Praja Palana

కారుణ్య ఉద్యోగ నియామక పత్రాలు అందజేస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి. చిత్రంలో మంత్రి సీతక్క, హైదరాబాద్‌ నగర మేయర్‌ విజయలక్షి్మ, సీఎస్‌ శాంతికుమారి తదితరులు

ప్రజాపాలన– కొలువుల పండుగ కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి

సాక్షి, హైదరాబాద్‌: ‘గత పాలకులు రిటైర్డ్‌ ఉద్యోగులకు పదవీ విరమణ ప్రయోజనాల కింద రూ.8 వేల కోట్లు బకాయిలు పెట్టి పోయారు. నెలకు కొంతమందికి అవసరానికి అనుగుణంగా సర్దుతున్నాం. మరోవైపు కొత్తగా నెలకు వెయ్యి మంది రిటైర్‌    అవుతున్నారు. వారికి బెనిఫిట్స్‌ ఇచ్చేందుకు కూడా డబ్బుల్లేవు. ఎక్కడా అప్పు పుడ్తలేదు.. ఎవ్వడు మనల్ని నమ్మడం లేదు. పేరు చూస్తే గొప్పగ ఉంది.. అప్పు పుట్టకొచ్చింది (పుట్టడం లేదు). ఎన్నిరోజులు దాచిపెట్టుకోను. 

క్యాన్సర్‌ ఉంటే సిక్స్‌ప్యాక్‌ బాడీ అని చెప్పుకుంటే నమ్ముతరా? ఉన్నదున్నట్లు చెపుతున్న..’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌ రవీంద్రభారతిలో గురువారం సాయంత్రం ‘ప్రజాపాలన..కొలువుల పండుగ’ పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో.. పంచాయతీరాజ్, పురపాలక శాఖల్లో 922 మందికి కారుణ్య ఉద్యోగ నియామక పత్రాలు ఆయన అందజేశారు. అలాగే రాష్ట్రంలో కొత్త భవన నిర్మాణాలకు సంబంధించి ‘బిల్డ్‌ నౌ’ పోర్టల్‌ను ఆవిష్కరించారు. ఇందుకోసం ‘ఆన్‌లైన్‌’లో దరఖాస్తు చేసుకున్న ముగ్గురికి అనుమతి పత్రాలు అందజేసిన అనంతరం ప్రసంగించారు.  

ఆ డబ్బే ఉండుంటే అద్భుతాలు చేసేవాణ్ణి.. 
‘ఒక ప్రాజెక్టుకు డీపీఆర్‌ ఇచ్చి, పద్ధతి ప్రకారం అప్పు తీసుకుంటే 4 శాతం వడ్డీకి అప్పులు ఇచ్చేందుకు ఎన్నో సంస్థలు సిద్ధంగా ఉన్నాయి. కానీ గుట్టుగా కమీషన్ల కోసం కాళేశ్వరానికి 11 శాతం వడ్డీతో అప్పు తెచ్చారు. దాన్ని 5 శాతం చేసేందుకు ప్రయత్నిస్తున్నా. అప్పటి పాలకులు తెచ్చిన అప్పులకు వడ్డీలు కట్టేందుకే నేను సీఎం అయ్యాక రూ.1.53 లక్షల కోట్లు అప్పులు తెచ్చిన. 

ఇందులో రూ.88వేల కోట్లు అసలు, రూ.66 వేల కోట్లు మిత్తి కింద కట్టిన. ఈ డబ్బు నాదగ్గర ఉండుంటే గంటలోనే రుణమాఫీ చేసేవాడిని. 25 లక్షల మందికి ఇళ్లు కట్టించి ఇచ్చేవాడిని. ఎన్నో అద్భుతాలు చేసేవాణ్ణి. అప్పట్లో రోజుకు లక్ష టన్నుల చొప్పున ఇసుక దోచుకున్నరు. రూ.7 వేల కోట్లు దోచుకున్నారు. ఇప్పుడు హైదరాబాద్‌లో రైతుబజార్‌ల తరహాలో ఇసుక బజార్‌లు పెట్టి మూడు ప్రాంతాల్లో అమ్ముతున్నం. అంతా ఆన్‌లైన్‌లోనే..’ అని సీఎం చెప్పారు. 

ముఖ్యమంత్రికి విజ్ఞత ఉండాలి 
‘ప్రజలు మాపై కోపంగా ఉన్నారని కొందరు మాట్లాడుతున్నారు. ఎందుకు మాపై కోపం?. నిరుద్యోగులకు ఉద్యోగ నియామకపత్రాలు అందిస్తున్నందుకా..? అదానీ, అంబానీలతో పోటీ పడేలా ఆడబిడ్డలకు సోలార్‌ పవర్‌ ఉత్పత్తి చేసే అవకాశం కల్పించినందుకా? రేవంత్‌రెడ్డికి పాలనపై పట్టు రాలేదని మాట్లాడుతున్నారుం. 

రాజయ్య, ఈటల లాంటి బలహీనవర్గాల వారిని సస్పెండ్‌ చేస్తేనే పట్టు వచ్చినట్టాం? మేం గడీలలో పెరగలేదు. నల్లమల అడవుల్లో పేదలను చూస్తూ పెరిగాంం. అందుకే మాకు మానవత్వం ఉంది.. మీకు లేదు. ముఖ్యమంత్రికి విజ్ఞత ఉండాలిం. మేం విజ్ఞత ప్రదర్శిస్తున్నాం. ఆ విజ్ఞత లేకపోవడం వల్లే ఆయన ఫామ్‌హౌస్‌ నుంచి బయటకు రాలేకపోతున్నారు..’ అని రేవంత్‌ విమర్శించారు.  

మిస్‌ వరల్డ్‌ పోటీలతో వందల కోట్ల ఆదాయం 
‘మిస్‌ వరల్డ్‌ పోటీలపై కూడా కొందరు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. పర్యాటక రంగానికి ఇదొక అద్భుతమైన అవకాశం. ప్రపంచం తెలంగాణ వైపు చూడబోతోంది. మే 7 నుంచి 31 వరకు ఈ పోటీలు ఇక్కడ జరగబోతున్నాయి. వేలాది మంది విదేశీయులు రాబోతున్నారు. వివిధ రంగాలకు ఉపాధి లభిస్తుంది. 3 వేల విదేశీ ఛానెల్స్, పత్రికలు రాబోతున్నాయి. 

వివిధ దేశాల నుంచి వచ్చే ప్రతినిధులు తెలంగాణలో ప్రసిద్ధి చెందిన పర్యాటక ప్రాంతాలను సందర్శిస్తారు. భవిష్యత్‌లో వందల కోట్ల ఆదాయం రాబోతోంది. ఫార్ములా–ఈ రేస్‌ ముసుగులో మీరు ప్రభుత్వ సొమ్ము దోచుకున్నారు. మీకు, మాకూ పోలికా? పట్టింపులేకుండా వ్యవహరించిన విధానం మీదిం. పట్టుదలతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్న సంకల్పం మాది. త్వరలోనే యాదగిరిగుట్టను వైటీడీ బోర్డు ద్వారా విశ్వవ్యాప్తం చేయబోతున్నాం..’ అని సీఎం తెలిపారు.  

ఈ ఉద్యోగాలు మీ హక్కు 
‘ఈ కారుణ్య నియామకాలు మీ హక్కు. మీ కుటుంబసభ్యుల నుంచి వారసత్వంగా మీకు రావాల్సిన ఉద్యోగాలు ఇవి. గత పాలకులు ఈ నియామకాలను పట్టించుకోలేదంటే.. ఎంత నిర్లక్ష్యం వహించిందో ఆలోచించండి. అలాంటి నిర్లక్ష్యం ప్రజా ప్రభుత్వంలో ఉండకూడదనే ఈ నియామకాలు పూర్తి చేస్తున్నాం. మేం అధికారంలోకి రాగానే 57,924 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశాం. గ్రూప్‌ 1, 2, 3లలో 2 వేల పైచిలుకు ఉద్యోగాలకు మరికొన్ని రోజుల్లో నియామక పత్రాలు అందించబోతున్నాం..’ అని రేవంత్‌ తెలిపారు.  

అక్రమాలు అరికట్టేందుకే ‘బిల్డ్‌ నౌ’ పోర్టల్‌ 
‘హైదరాబాద్‌ నగరంలో భవన నిర్మాణ అనుమతుల్లో అక్రమాలు అరికట్టేందుకే ‘బిల్డ్‌ నౌ’ పోర్టల్‌ను తీసుకొచ్చాం. ఎంతటివారైనా సరే ఆన్‌లైన్‌లో అనుమతులు తీసుకోవాల్సిందే. ప్రజలకు పారదర్శక పరిపాలన అందించాలన్నదే మా ఉద్దేశం.. అదే గుడ్‌ గవర్నెన్స్‌.. ఇది తెలంగాణ మోడల్‌..’ అని ముఖ్యమంత్రి చెప్పారు. మంత్రి ధనసరి అనసూయ, ఎమ్మెల్యేలు వీర్ల శంకర్, కాలె యాదయ్య, సీఎస్‌ శాంతికుమారి, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్, డీటీసీపీ దేవేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement