
సాక్షి, హైదరాబాద్: పుల్లారెడ్డి స్వీట్స్ అధినేత కోడలు వేధింపుల వ్యవహారం చివరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వద్దకు చేరుకుంది. కాగా, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలంగాణ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ద్రౌపది ముర్ముకు పుల్లారెడ్డి కోడలు ప్రజ్ఞారెడ్డి వేధింపుల విషయమై వినతి పత్రం అందజేశారు. తనకు ప్రాణహాని ఉందంటూ లేఖలో పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో ప్రజ్ఞారెడ్డి వినతిపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్పందించారు. ప్రజ్ఞారెడ్డిపై వేధింపుల విషయంలో చర్యలు తీసుకోవాలని సీఎస్‌కు ఆదేశాలు జారీ చేశారు. దీంతో, రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ప్రజ్ఞారెడ్డి, ఆమె కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఇక, అంతుకు ముందు పుల్లారెడ్డి కుమారుడు రాఘవరెడ్డి వేధిస్తున్నాడని గతంలో ఫిర్యాదు చేశారు.
అంతుకుముందు..
రాఘవరెడ్డి తనను చంపేందుకు ప్రయత్నించారని, వరకట్నం కోసం హింసించారని ప్రజ్ఞారెడ్డి వాపోయారు. తమను ఇంటి నుంచి బయటకి రాకుండా చేసేందుకు రాత్రికి రాత్రి తన గది బయట గోడ కట్టారని లేఖలో పేర్కొన్నారు. ఇవి తాను చేస్తున్న ఆరోపణలు కాదని.. ఈ విషయం న్యాయస్థానం వరకు వెళ్లడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన న్యాయమూర్తి గది బయట గోడ కూల్చి వేయమని ఆదేశించారని ప్రజ్ఞ పేర్కొన్నారు. తమ హక్కులను కాలరాస్తూ, నన్ను బెదిరిస్తున్న అత్తింటి వారిపై ఇప్పటికే హైదరాబాద్‌లో కేసులు నమోదై ఉన్నాయని, సాటి మహిళగా తన పరిస్థితిని అర్థం చేసుకోవాలని రాష్ట్రపతిని ప్రాధేయపడ్డారు.