పాతాళానికి నీళ్లు! | Rapidly declining groundwater levels in Telangana | Sakshi
Sakshi News home page

పాతాళానికి నీళ్లు! పడిపోతున్న భూగర్భ జలాలు

Published Sun, Feb 16 2025 5:48 AM | Last Updated on Sun, Feb 16 2025 10:16 AM

Rapidly declining groundwater levels in Telangana

రాష్ట్రంలో వేగంగా పడిపోతున్న భూగర్భ జలాలు 

డిసెంబర్‌లో 6.7 మీటర్ల లోతున.. జనవరికి 7.46 మీటర్ల లోతుకు క్షీణత 

నెల రోజుల్లో 0.74 మీటర్లు తగ్గిపోయిన తీరు.. 

పలు జిల్లాల్లో ఆందోళనకరంగా భూగర్భ జలమట్టాలు 

156 మండలాల్లో గత దశాబ్దకాలంలో లేనంత దారుణ పరిస్థితి 

వేసవికి ముందే పలు ప్రాంతాల్లో ఎండిపోతున్న బోర్లు 

33 జిల్లాల్లోని స్థితిగతులపై భూగర్భజల శాఖ నివేదికలో వెల్లడి

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో భూగర్భ జలమట్టాలు వేగంగా పడిపోతున్నాయి. ఎండాకాలం ఇంకా మొదలవక ముందే బోర్లలో నీళ్లు ఇంకిపోతున్నాయి. యాసంగిలో బోరుబావుల కింద సాగుచేస్తున్న పంటలకు నీటి కోసం కటకట తప్పని పరిస్థితి కనిపిస్తోంది. డిసెంబర్‌లో 6.7 మీటర్ల లోతుగా ఉన్న రాష్ట్ర సగటు భూగర్భ జలమట్టం జనవరిలో 7.46 మీటర్ల లోతుకు తగ్గిపోయింది. 

అంటే నెల రోజుల్లోనే సుమారు 0.74 మీటర్ల మేర భూగర్భ జలమట్టం పడిపోవడం ఆందోళన రేపుతోంది. వ్యవసాయం, ఇతర అవసరాలకుతోడు తాగునీటి కోసం వేసవిలో వినియోగం మరింత పెరగనుండటంతో.. రానున్న రోజుల్లో భూగర్భ జలమట్టాలు మరింతగా పడిపోయే అవకాశం కనిపిస్తోంది. 

రాష్ట్ర భూగర్భ జలవనరుల శాఖ జనవరిలో రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాల్లో భూగర్భ జలాల స్థితిగతులను పరిశీలించి రూపొందించిన నివేదికలోనే ఈ అంశాలు వెల్లడయ్యాయి. భూగర్భ జలవనరుల శాఖ రాష్ట్రంలోని 33 జిల్లాల పరిధిలోని అన్ని మండలాల్లో ఏర్పాటు చేసిన 1,771 పీజోమీటర్ల ద్వారా భూగర్భ జలాల స్థితిగతులను ప్రతి నెలా సమీక్షించి, తర్వాతి నెలలో నివేదికలను విడుదల చేస్తూ ఉంటుంది. 

8 జిల్లాల్లో 10 మీటర్ల కంటే లోతున... 
రాష్ట్రంలోనే అత్యధికంగా వికారాబాద్‌ జిల్లాలో 12.29 మీటర్ల లోతుకు భూగర్భ జలాలు పడిపోయాయి. రాష్ట్రంలోని జిల్లాలను సగటు భూగర్భ జలమట్టం 0–5 మీటర్లు, 5–10 మీటర్లు, 10 మీటర్లపైన లోతు.. అనే మూడు కేటగిరీలుగా భూగర్భ జలశాఖ వర్గీకరించింది. రాష్ట్రంలోని మొత్తం 33 జిల్లాలకుగాను 6 జిల్లాల్లో మాత్రమే 5 మీటర్లలోపు భూగర్భ జలమట్టం ఉన్నట్టు గుర్తించారు. 

భూగర్భ జలాలు సురక్షిత స్థాయిలో ఉన్నది కేవలం ఈ జిల్లాల్లో మాత్రమే. మరో 9 జిల్లాల్లో 5–10 మీటర్ల మధ్య, మిగతా 8 జిల్లాల్లో 10 మీటర్లకుపైగా లోతుకు భూగర్భ జలాలు పడిపోయాయి. ఇలా 10 మీటర్లకన్నా లోతుకు భూగర్భ జలాలు పడిపోయిన జిల్లాల్లో పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్టుగా భావిస్తారు. 

18 జిల్లాల్లో భారీ క్షీణత 
గత ఏడాది జనవరితో పోల్చితే ఈ ఏడాది జనవరిలో రాష్ట్రంలోని 18 జిల్లాల్లో భూగర్భ జలమట్టాల్లో భారీ క్షీణత నమోదైంది. గత ఏడాది జనవరిలో రాష్ట్ర సగటు భూగర్భ జలాల లోతు 7.72 మీటర్లుకాగా.. ఈ ఏడాది 7.46 మీటర్లకు తగ్గింది. రాష్ట్ర సగటు కాస్త మెరుగ్గానే కనిపిస్తున్నా... కొన్ని జిల్లాల్లో బాగా పడిపోయాయి. అత్యధికంగా యాదాద్రి జిల్లాలో 7.29 మీటర్ల నుంచి 10 మీటర్లలోతుకు అంటే.. 2.71 మీటర్ల మేర పడిపోవడం గమనార్హం. 

ఈ ప్రాంతాల్లో ప్రమాదకర స్థాయిలో.. 
రంగారెడ్డి, కామారెడ్డి, మెదక్, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల ఉత్తర, పశ్చిమ ప్రాంతాలు, వికారాబాద్‌ జిల్లాలోని దక్షిణ ప్రాంతాల్లో ప్రమాదకర స్థాయికి భూగర్భ జలమట్టాలు పడిపోయాయి. ఈ ప్రాంతాల్లో భూగర్భ జలమట్టాలు 15–20 మీటర్ల మధ్య, కొన్నిచోట్ల 20 మీటర్లకన్నా లోతుకు వెళ్లిపోయినట్టు తేల్చారు. రాష్ట్ర భూభాగం ఈ ప్రాంతాల వాటా 4 శాతమని అధికారులు చెబుతున్నారు. మరో 18 శాతం భూభాగంలో 10–15 మీటర్ల లోతున.. ఇంకో 54 శాతం ప్రాంతాల్లో 5–10 మీటర్లు లోతున, 25శాతం ప్రాంతాల్లో పరిధిలో 5 మీటర్ల కంటే తక్కువ లోతున భూగర్భ జలమట్టాలు ఉన్నట్టు గుర్తించారు. 

156 మండలాల్లో దశాబ్ద సగటుకన్నా తగ్గి.. 
గత దశాబ్ద కాల (2015–2024) సగటుతో పోల్చినప్పుడు.. రాష్ట్రంలోని మొత్తం 612 మండలాలకుగాను 456 మండలాల్లో భూగర్భ జల మట్టాలు కాస్త మెరుగ్గా ఉన్నాయి. మిగతా 156 మండలాల్లో క్షీణించాయి. 53 మండలాల్లో 0.5 మీటర్ల మేర, 33 మండలాల్లో 1–2 మీటర్ల మేర, 37 మండలాల్లో 2 మీటర్లకుపైగా పడిపోయాయి.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement