
పశువులకు మేతగా మారుతున్న వరి పైరు
భూగర్భజలాలు అడుగంటి పొట్ట దశలో నీటి తిప్పలు
నీరందక నెర్రెలు వారుతున్న పంటపొలాలు
సాక్షి,యాదాద్రి: వేసవి రాకముందే ఎండలు ముదిరిపోయా యి. దీంతో యాదాద్రి భువనగిరి జిల్లాలో పలుచోట్ల భూగర్భజలాలు అడుగంటుతున్నాయి. నాన్‌ఆయకట్టు ప్రాంతంలో ఎక్కువ శాతం బోర్లు, బావుల కింద వరి సాగు చేశారు. దాదాపు 2.80 లక్షల ఎకరాల్లో పంట సాగైంది. సరిగ్గా నీరందక వరి చేలు ఎండుముఖం పడుతున్నాయి. పొట్టదశలో ఉన్న పైరు ఎండిపోతుండగా రైతులు పశువులను మేపుతున్నారు.
ఇప్పటికే దాదాపు వెయ్యి ఎకరాల్లో పంట ఎండిపోయింది. పరిస్థితి ఇలాగే ఉంటే...వేలాది ఎకరాలకు పంటనష్టం జరిగే ప్రమాదం పొంచి ఉంది. దిగుబడి కూడా తగ్గే అవకాశాలున్నాయి. జనవరి నాటికి జిల్లాలో భూగర్భ జలాలు రెండున్నర మీటర్ల లోతుకు పడిపోయాయి.
యాసంగి ఆశలపై దెబ్బ
వానాకాలం సీజన్‌లో భారీ వర్షాలతో చెరువులు, కుంటలు నిండి పొంగిపొర్లాయి. జలకళ సంతరించుకోగా, రైతులు యాసంగి వరిసాగుపై ఆశలు పెంచుకున్నారు. ఫిబ్రవరి మొదటివారం నుంచే ఎండలు తీవ్రరూపం దాల్చడంతో రాజాపేట, ఆలేరు, మోటకొండూరు, ఆత్మకూర్(ఎం), మోత్కూరు, అడ్డగూడూరు, వలిగొండ మండలాల్లోని ఎగువ ప్రాంతాల్లో నీటిగండం వచ్చిపడింది.
పంటను దక్కించుకోవాలన్న తపనతో కొందరు బోరు బావుల్లో పూడికతీత పనులు చేపట్టారు. మరికొందరు అప్పు చేసి బోర్లు వేయిస్తున్నారు. అయినా చుక్కనీరు పడకపోవడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు.
రెండు ఎకరాల వరి బీటలు వారింది
నాకున్న ఐదెకరాల్లో వరిసాగు చేశాను. బావి నీటిమట్టం తగ్గడంతో రెండు ఎకరాల వరిపొలం బీటలు వారింది. ఉన్న మూడు ఎకరాలకు రెండు రోజులకో తడి ఇస్తున్నాను. దానిపై కూడా ఆశ లేదు. – వడకాల రాజు, వరి రైతు, మోత్కూర్.
నీరు లేక పంట ఎండిపోయింది
3 ఎకరాల్లో వరి వేశా. నాట్ల సమయంలో బావి లో నీరు బాగానే ఉంది. వరి పొట్టకు వచ్చే దశలో నీరు పూర్తిగా అడుగంటి పోయింది. వారం క్రితం రెండు బోర్లు వేశాను. రెండూ ఫెయిల్ అయ్యాయి. నీరులేక పంట ఎండిపోయింది –చౌడబోయిన కనకయ్య, శ్రీనివాసపురం గ్రామం