
మహబూబ్‌నగర్/నాగర్ కర్నూల్: శ్రీశైలం ఎడమగట్టు కాలువ (ఎస్‌ఎల్‌బీసీ) సొరంగం ప్రమాద ఘటనలో చిక్కుకున్న వారి ఆచూకీ కోసం అధికారుల ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ప్రమాదం జరిగి గురువారం నాటికి 48 రోజులు అవుతోంది. సొరంగం పైకప్పు కూలిన ప్రదేశంలో సహాయక సిబ్బంది నిరంతరాయంగా పనులు చేపడుతున్నారు. నిత్యం సహాయక సిబ్బంది 20 మీటర్ల మేర తవ్వకాలు చేపడుతూ శిథిలాలను బయటకు తరలిస్తున్నారు.
సొరంగం పైకప్పు కూలిన ఘటనలో ఎనిమిది మంది కారి్మకులు చిక్కుకోగా, మార్చి 9న టీబీఎం ఆపరేటర్ గురుప్రీత్‌సింగ్ మృతదేహాన్ని డీ2 ప్రదేశంలో వెలికితీశారు. మార్చి 25న ప్రాజెక్టు ఇంజనీర్ మనోజ్‌కుమార్ మృతదేహాన్ని కనుగొన్నారు. ప్రస్తుతం శిథిలాల కింద చిక్కుకున్న ఆరుగురి అచూకీ కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
సొరంగం లోపల 13.73 కిలోమీటరు నుంచి 13.8 కిలోమీటరు వరకు కన్వేయర్ బెల్టును పొడిగించేందుకు గురువారం లోకో ట్రైన్ ద్వారా కన్వేయర్ బెల్టు, ఇతర సామగ్రిని సొరంగం లోపలికి తరలించారు. ప్రమాద స్థలం వరకు కన్వేయర్ బెల్టును పొడిగిస్తూ మట్టిని తవ్వే ప్రక్రియను మరింత వేగవంతం చేశారు. వారం రోజుల్లో శిథిలాల తొలగింపును పూర్తి చేసేందుకు సహాయక సిబ్బంది కృషి చేస్తున్నారు.