
ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ ముందు హాజరైన శ్రవణ్‌రావు
టీవీలో పెట్టుబడుల అంశంపై ప్రశ్నలు
దుబాయ్‌లోని ఫ్లాట్ వ్యవహారాలపైనా ఆరా
ఈ నెల 8న మరోసారి రావాలని నోటీసు
సాక్షి, హైదరాబాద్/బంజారాహిల్స్: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడిగా ఉన్న శ్రవణ్‌కుమార్‌రావు బుధవారం రెండోసారి సిట్ ఎదుట హాజరయ్యారు. ఉదయం 11.30 గంటలకు వచ్చిన ఆయనను అధికారులు దాదాపు గంటపాటు ప్రశ్నించారు. శనివారం మొదటిసారి సిట్ ముందు హాజరైనప్పుడు అధికారులు, శ్రవణ్‌ను దాదాపు ఎనిమిది గంటల పాటు ప్రశ్నించారు. బుధవారం సైతం సుదీర్ఘంగానే విచారించాలని భావించారు. అయితే హెచ్‌సీయూ పరిణామాల నేపథ్యంలో పోలీసులు బిజీ అయ్యారు. దీంతో కేవలం గంట మాత్రమే ప్రశ్నించి పంపిస్తూ.. ఈ నెల 8న మరోసారి విచారణకు రావాలని నోటీసు జారీ చేశారు.
శ్రవణ్‌రావు గతంలో ఓ టీవీ చానల్‌ను నిర్వహించారు. ఆ చానల్‌ను ఎందుకు తీసుకున్నారు? దానికి పెట్టుబడులు ఎవరు పెట్టారు? అనే కోణంలో అధికారులు ప్రశ్నించినట్లు సమాచారం. మరోపక్క దుబాయ్‌లో సొంత ఫ్లాట్ ఉన్న శ్రవణ్, ఇటీవల రెండు నెలల పాటు అక్కడ ఉన్నారు. ఆ సమయంలో ఆయనతో పాటు మరో ఐదుగురు ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ఆ ఫ్లాట్ ఎప్పుడు? ఎలా? ఖరీదు చేశారనే అంశంతో పాటు ఆ ఐదుగురు ఎవరని పోలీసులు అడిగారు. కాగా, పోలీసులు అడిగిన ఏ ప్రశ్నకు కూడా శ్రవణ్‌రావు నుంచి సరైన సమాధానం రాలేదని తెలు స్తోంది.
శనివారం విచారణ సందర్భంగా శ్రవణ్‌రావు తాను 2023 ఎన్నికల సమయంలో ఓ సర్వే చేశానని. దాని వివరాలను ప్రభాకర్‌రావుతో పంచుకున్నానని చెప్పారు. ఆయనతో పాటు ఆయన ద్వారా పరిచయమైన ప్రణీత్‌తో తప్ప మరే ఇతర అధికారి, నాటి ప్రభుత్వ పెద్దలతో తనకు సంబంధం లేదంటూ శ్రవణ్‌రావు వాదిస్తున్నారు. అయితే ఆ సర్వే ఎవరి సూచనల మేరకు చేశారు? అందుకు సంబంధించిన నగదు ఎవరు చెల్లించారు? అనే అంశంపై పోలీసులు ప్రశ్నించినా.. శ్రవణ్ నుంచి సామాధానం రాలేదని తెలుస్తోంది.
2023 ఎన్నికల సమయంలో శ్రవణ్ 2 ఫోన్లు వాడినట్లు పోలీసులు గుర్తించారు. వాటిని తీసుకువచ్చి అప్పగించాలని శనివారమే స్పష్టం చేశారు. అయితే బుధవారం ఆయన ఓ పాత సెల్‌ఫోన్ తీసుకువచ్చి ఇచ్చారు. అది చూసి షాక్‌కు గురైన పోలీసులు గతంలో వాడినవి కావాలని స్పష్టం చేశారు. ఆ రెండు సెల్‌ఫోన్లను ఎనిమిదో తేదీన విచారణకు వచ్చే సమయంలో తీసుకురావాలని స్పష్టం చేశారు.
సెల్‌ఫోన్లను మార్చే ప్రయత్నం చేస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దర్యాప్తు అధికారులకు పూర్తి స్థాయిలో సహకరించాలంటూ శ్రవణ్‌రావును సుప్రీంకోర్టు ఆదేశించిందని, అయితే ఆయన నుంచి సరైన సహకారం లభించడం లేదని పోలీసులు చెపుతున్నారు.