
హైదరాబాద్,సాక్షి: తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏ6గా ఉన్న శ్రవణ్ రావు ఇవాళ మరోసారి సిట్ విచారణను ఎదుర్కోనున్నారు. విచారణలో శ్రవణ్ రావు వినియోగించిన రెండు ఫోన్లు కీలకం కానున్నాయి.
ఇప్పటికే శ్రవణ్ రావు రెండు సార్లు సిట్ విచారణకు హాజరయ్యారు. విచారణలో భాగంగా గత ఎన్నికల సందర్భంగా శ్రవణ్ రావు వాడిన ఫోన్లను స్వాధీనం చేయాలని సిట్ నోటీసులు జారీ చేసింది.
దీంతో రెండోసారి సిట్ విచారణకు హాజరైన శ్రవణ్ రావు ఓ పాత తుప్పు పట్టిన ఫోన్ ఇచ్చారు. ఆ తుప్పు పట్టిన ఫోన్‌ను చూసిన విచారణ అధికారులు విస్మయానికి గురయ్యారు. సుప్రీంకోర్టు స్పష్టంగా సిట్ విచారణకు సంపూర్ణంగా సహకరించాలని ఆదేశించినా శ్రవణ్ రావు సహకరించకపోవడం వారిని అసంతృప్తికి గురి చేసింది.
తాము అడిగిన రెండు సెల్ ఫోన్లతో పాటు అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానంతో ఈనెల 8వ తేదీన మరోసారి విచారణకు హాజరు కావాలని సిట్ అధికారులు నోటీసులు ఇచ్చింది. దీంతో ఇవాళ ఆయన సిట్ ఎదుట హాజరు కానున్నారు.