పోస్టల్‌ బ్యాలెట్‌ వినియోగించుకోవాలి | Sakshi
Sakshi News home page

పోస్టల్‌ బ్యాలెట్‌ వినియోగించుకోవాలి

Published Sun, May 5 2024 8:05 AM

పోస్టల్‌ బ్యాలెట్‌ వినియోగించుకోవాలి

అనంతపురం అర్బన్‌: పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటు హక్కు వినియోగించుకోవాలని కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి వి.వినోద్‌కుమార్‌ స్పష్టం చేశారు. రాప్తాడు అసెంబ్లీ, హిందూపురం పార్లమెంట్‌ నియోజకవర్గానికి సంబంధించి స్థానిక పంగల్‌రోడ్డులోని టీటీడీసీ కేంద్రంలో ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్‌ సెంటర్‌ను కలెక్టర్‌ శనివారం తనిఖీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లాకు చెందిన, ఇతర జిల్లాలకు చెందిన వారు పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటు హక్కును వినియోగించుకునే ప్రక్రియ ప్రారంభమైందన్నారు. జిల్లాలో రాప్తాడు నియోజకవర్గానికి సంబంధించి మూడు మండలాలు ఉన్నాయని, మిగిలిన మండలాలు శ్రీ సత్యసాయి జిల్లాలో ఉన్నాయన్నారు. ఈ క్రమంలో పోస్టల్‌ బ్యాలెట్‌ వినియోగించుకునే విషయంలో కొద్దిపాటి గందరగోళం ఉందని, దీనిపై స్పష్టత ఇవ్వాలని పోలింగ్‌ సిబ్బంది, అభ్యర్థులు కోరారన్నారు. శ్రీ సత్యసాయి జిల్లాకు చెందిన వారు ఇక్కడికి శిక్షణకు వచ్చామని, ఇక్కడే ఓటు హక్కు కల్పించాలని విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. ఈ అంశంపై ఆ జిల్లా కలెక్టర్‌తో మాట్లాడి నివేదిక తెప్పించుకున్నామన్నారు. వారికి ఇక్కడ ఓటుహక్కు కల్పిస్తామన్నారు. పోస్టల్‌ బ్యాలెట్‌కు సంబంధించి నిబంధనలు మారిన నేపథ్యంలో అవగాహన పొందాలన్నారు. పోస్టల్‌ బ్యాలెట్‌ వినియోగించుకోవాలని ఫారం–12 ఇచ్చిన ఉద్యోగులందరికీ వాయిస్‌ కాల్‌, మెసేజ్‌ ద్వారా తెలియజేశామన్నారు. కార్యక్రమంలో రాప్తాడు రిటర్నింగ్‌ అధికారి వసంతబాబు తదితరులు ఉన్నారు.

Advertisement
 

తప్పక చదవండి

Advertisement