పురం.. ఎవరి పరమో..! | Sakshi
Sakshi News home page

పురం.. ఎవరి పరమో..!

Published Sun, May 5 2024 8:20 AM

పురం.

పెద్దాపురం

సామర్లకోట: మెట్ట ప్రాంత ముఖద్వారంగా పెద్దాపురం నియోజకవర్గం ఉంది. దీంతో మెట్ట ప్రాంత నేతలే ఇక్కడ ఎక్కువ సార్లు ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. అనపర్తి, పిఠాపురం, జగ్గంపేట, కాకినాడ రూరల్‌ అసెంబ్లీ సెగ్మెంట్ల మధ్య 291.46 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగిన ఈ నియోజకవర్గం 1952లో ఏర్పడింది. రెండు మున్సిపాలిటీలు, రెండు మండలాలు ఉన్న ఈ నియోజకవర్గం మొదట్లో కమ్యూనిస్టుల కంచుకోటగా ఉండేది.

ఇవీ ప్రత్యేకలు

● నియోజకవర్గంలోని సామర్లకోట జిల్లాలో పెద్ద రైల్వే జంక్షన్‌. ఇక్కడి నుంచే కాకినాడ జిల్లా కేంద్రానికి వెళ్లాల్సి ఉంటుంది. పెద్దాపురం, కిర్లంపూడి, ప్రత్తిపా డు, జగ్గంపేట, ఏలేశ్వరం తదితర ప్రాంతాల వారు సామర్లకోట నుంచే రైళ్లలో రాకపోకలు సాగిస్తారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ రైల్వే స్టేషన్‌, ఆర్టీసీ బస్సు కాంప్లెక్స్‌ ఎదురెదురుగా ఉన్నాయి.

● సగ్గు బియ్యం పరిశ్రమలు సామర్లకోట మండలంలో ఉన్నాయి. ఇక్కడ తయారైన సగ్గుబియ్యం ఇతర రాష్ట్రాలకు ఎగుమతి అవుతుంది. ఏడీబీ రోడ్డులో రాక్‌, అపర్ణ సిరామిక్స్‌, రిలయన్స్‌, జీవీకే పవర్‌ ప్లాంట్లతో పాటు అనేక ఇతర పరిశ్రమలు ఉన్నాయి.

శిక్షణలకు కేంద్రం

రాష్ట్రంలోని మహిళా సంఘాల సభ్యులతో పాటు వివి ధ శాఖల ఉద్యోగులు, ప్రజాప్రతినిధులకు సామర్లకో ట శిక్షణ కేంద్రంలో శిక్షణ ఇస్తుంటారు. గిరిజన యు వతకు శిక్షణ ఇవ్వడానికి గిరిజన శిక్షణ సంస్థ ఇక్కడే ఉంది. రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ, సర్వే సిబ్బందికి శిక్షణ ఇవ్వడానికి విస్తరణ, శిక్షణ కేంద్రంలోనే రెవెన్యూ అకాడమీ ఉంది. జిల్లా మహిళా సమాఖ్య సభ్యులు ప్రతి నెలా సర్వసభ్య సమావేశం నిర్వహించే టీటీడీ సామర్లకోటలోనే ఉంది. ఈ శిక్షణ కేంద్రంలో గ్రామీణ యువతీ యువకులకు ఉచిత భోజన, వసతి సౌకర్యాలతో ఇంగ్లిషు స్పీకింగ్‌ కోర్సు, కంప్యూటర్‌ శిక్షణ ఇస్తున్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న వారికి ఉపాధి అవకాశాలు కల్పిస్తారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ఏర్పాటు చేసిన ప్రైవేటు న్యాక్‌ సంస్థలో గృహ నిర్మాణానికి సంబంధించిన శిక్షణ ఇస్తున్నారు. మహిళలకు కుట్టు శిక్షణ ఇచ్చి, ఉపాధి కల్పిస్తారు. వ్యవసాయ రంగంలో శిక్షణ ఇవ్వడానికి సామర్లకోటలోనే వ్యవసాయ క్షేత్రం ఉంది. ఇక్కడ వరి విత్తనాలు పండిస్తారు. సుమారు 30 ఏళ్ల క్రితం బాగా గిరాకీ ఉన్న ఎస్‌ఎల్‌ఓ అక్కుళ్లు రకం ధాన్యాన్ని ఇక్కడ పండించారు. పెద్దాపురం పాండవుల మెట్టపై నవోదయ విద్యాలయం ఉంది.

పుణ్యక్షేత్రాలకు నెలవు

ఎన్నో పుణ్యక్షేత్రాలకు ఈ నియోజకవర్గం నెలవు. పంచారామ క్షేత్రాల్లో ఒకటైన బాలాత్రిపుర సుందరీ సమేత కుమారారామ భీమేశ్వర స్వామి ఆలయం సామర్లకోటలో ఉంది. సామర్లకోట – పెద్దాపురం పట్టణాల కూడలిలో 65 అడుగుల ఎత్తయిన ప్రసన్నాంజనేయస్వామి విగ్రహం ఉంది. పెద్దాపురం మరిడమ్మ, కాండ్రకోట నూకాలమ్మ, చదలాడ తిరుపతి శృంగారవల్లభ స్వామి ఆలయాలు ఈ నియోజకవర్గంలోనే కొలువుదీరాయి. పాండవులు అజ్ఞాతవాస సమయంలో పెద్దాపురం పాండవుల మెట్టపై నివసించినట్టు చెబుతారు. అనేక మంది యాత్రికులు పాండవుల మెట్టను తిలకిస్తారు. ఇక్కడి సూర్యనారాయణస్వామి ఆలయం కూడా ఎంతో ప్రసిద్ధి చెందింది.

ఎక్కువసార్లు స్థానికేతరులకే పట్టం

తోట రామస్వామి కిర్లంపూడి

పంతం పద్మనాభం గెద్దనాపల్లి

బొడ్డు భాస్కర రామారావు పెద్దాడ

తోట గోపాలకృష్ణ కిర్లంపూడి

పంతం గాంధీమోహన్‌ గెద్దనాపల్లి

నిమ్మకాయల చినరాజప్ప అమలాపురం

స్థానికులు..

దుర్వాసుల వెంకటసుబ్బారావు పెద్దాపురం

వుండవిల్లి నారాయణమూర్తి సామర్లకోట

కొండపల్లి కృష్ణమూర్తి వేట్లపాలెం

బలుసు రామారావు సామర్లకోట

మెట్ట ప్రాంత ముఖద్వారం పెద్దాపురం

సగ్గు బియ్యం పరిశ్రమలకు నెలవు

ఏడీబీ రోడ్డు వెంబడి ఇతర పరిశ్రమలు

పురం.. ఎవరి పరమో..!
1/1

పురం.. ఎవరి పరమో..!

Advertisement
 

తప్పక చదవండి

Advertisement