విద్యాశాఖ కమిషనర్‌పై చర్య తీసుకోవాలి | Sakshi
Sakshi News home page

విద్యాశాఖ కమిషనర్‌పై చర్య తీసుకోవాలి

Published Mon, May 6 2024 12:15 AM

విద్యాశాఖ కమిషనర్‌పై చర్య తీసుకోవాలి

ఖమ్మం సహకారనగర్‌ : రాష్ట్రంలో ఉపాధ్యాయుల పదోన్నతుల సంక్షోభానికి కారణమైన ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) వివాదం పరిష్కారం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన విద్యాశాఖ కమిషనర్‌ను ఆ బాధ్యతల నుంచి తొలగించాలని టీఎస్‌ యూటీఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చావా రవి డిమాండ్‌ చేశారు. ఆదివారం సంఘం జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గత సెప్టెంబర్‌లో అర్ధంతరంగా నిలిచిపోయిన పదోన్నతులు కొనసాగింపునకు ఆటంకంగా ఉన్న టెట్‌పై ఎన్‌సీఈఆర్‌టీ వివరణ తీసుకోవాలని ఉపాధ్యాయ సంఘాలు కోరడంతో ఫిబ్రవరిలో క్లారిఫికేషన్‌ కోసం లేఖ రాసి రహస్యంగా ఉంచారని అన్నారు. ప్రధానోపాధ్యాయులకు పని చేస్తున్న పాఠశాలల స్థాయిలో మార్పు లేనప్పుడు పదోన్నతులకు టెట్‌ అవసరం లేదంటూ ఏప్రిల్‌ 8 న వచ్చిన వివరణ లేఖను వెల్లడించకుండా ఉపాధ్యాయులందరినీ మానసిక ఆందోళనకు గురి చేశారని ఆరోపించారు. అందరినీ టెట్‌కు దరఖాస్తు చేయించటం ద్వారా రూ.లక్షలు వృథా చేయించారని అన్నారు. ఎన్నికలు ముగిసేలోగా ఎన్‌సీఈఆర్‌టీ నుంచి మరికొన్ని అంశాలపై వివరణ తీసుకుని ఎన్నికలు ముగిసిన వెంటనే ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు దుర్గాభవాని, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జి.వి. నాగమల్లేశ్వరరావు, పారుపల్లి నాగేశ్వరరావు, ఉపాధ్యక్షుడు బుర్రి వెంకన్న, కోశాధికారి వల్లంకొండ రాంబాబు, కార్యదర్శులు పి.సురేష్‌, ఉద్దండు షరీఫ్‌, డి. నాగేశ్వరరావు, ఎస్‌.సతీశ్‌ పాల్గొన్నారు. కాగా, టెట్‌ వివాదం పరిష్కారం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన విద్యాశాఖ కమిషనర్‌ పై చర్య తీసుకోవాలని టీపీటీఎఫ్‌ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నాగేశ్వరరావు, ఎస్‌.విజయ్‌ ఆదివారం ఒక ప్రకటనలో డిమాండ్‌ చేశారు. సెప్టెంబర్‌ లో బదిలీ అయిన ఉపాధ్యాయులను రిలీవ్‌ చేయాలని, విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి పాఠశాలల్లో విద్యావలంటీర్లను నియమించి కొరత లేకుండా చూడాలని పేర్కొన్నారు.

టీఎస్‌ యూటీఎఫ్‌, టీపీటీఎఫ్‌ నేతల డిమాండ్‌

Advertisement
 
Advertisement